కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ ఫిరోజ్ ఖాన్ కలకలం !
లోక్ సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అధిష్టానం నియమించిన కురియన్ కమిటీ ఎదుట ఆయన ఈ రోజు హాజరయిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు.
‘ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ కు సీఎం రేవంత్ రెడ్డి రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందులో ఖర్జూరా తినిపించటంతోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ అమాంతం పడిపోయింది. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 8 ఎంపీ స్థానాలకే పరిమితం అయింది. వాస్తవంగా 14 స్థానాలు గెలిచేది’ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఇటీవల నాంపల్లి శాసనసభ నుండి కేవలం 2037 ఓట్ల తేడాతో ఎంఐఎం చేతిలో ఓడిపోయిన ఫైర్ బ్రాండ్ ఫిరోజ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అధిష్టానం నియమించిన కురియన్ కమిటీ ఎదుట ఆయన ఈ రోజు హాజరయిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు.
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల పొలరైజేషన్ చేయలేదని, కేవలం పొలిటికల్ పోలరైజేషన్ చేసిందని ఫిరోజ్ ఖాన్ అన్నాడు. ఎన్నికల్లో కార్యకర్తలు కష్టపడ్డా నాయకులు తప్పుచేశారని అభిప్రాయపడ్డాడు.
అందుకే చాలా చోట్ల పార్లమెంటు స్థానాల్లో అపజయం పాలయ్యామని ఫిరోజ్ ఖాన్ అన్నాడు.
ఎంఐఎంతో రహస్య పొత్తు మూలంగా కాంగ్రెస్ పార్టీ కరీంనగర్,సికింద్రాబాద్,నిజామాబాద్,మల్కాజిగిరి,చేవెళ్ల, మహబూబ్ నగర్ ,మెదక్ స్థానాల్లో బీజేపీ గెలిచిందని అన్నారు.
ఎంఐఎం తో రహస్య పొత్తు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొంప ముంచిందని, రాష్ట్రంలో బీజేపీ బలపడిందని ఫిరోజ్ ఖాన్ అన్నారు. అసద్ ఉద్దీన్ బీజేపీ కి భయపడి కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు చేయడంతో కాంగ్రెస్ నుండి డమ్మీ అభ్యర్థిని నిలబెట్టారని, పార్లమెంటు ఎన్నికల్లో ఎంఐఎం కాంగ్రెస్ కి మద్దతు తెలపడంతో ,హిందువులు కాంగ్రెస్ దూరం అయ్యారని అన్నారు.
ఎంఐఎంతో కాంగ్రెస్ పార్టీ దోస్తానా చేయడం తెలంగాణ ప్రజలకు నచ్చలేదని, అందుకే 8 స్థానాలకే పరిమితం అయ్యామని ఫిరోజ్ కమిటీ ముందు వెల్లడించడం గమనార్హం. అసదుద్దీన్ లాంటి వారి పైన నాలాంటి అభ్యర్థి పోటీ చేస్తే పరిస్థితులు వేరేగా ఉండేవని ఫిరోజ్ వెల్లడించాడు.
ఫిరోజ్ ఖాన్ ఇటీవల శాసనసభ ఎన్నికల్లో నాంపల్లి నుండి కేవలం 2037 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యాడు. ఇదే స్థానం నుండి ఫిరోజ్ ఖాన్ 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుండి ఏడు వేల ఓట్ల తేడాతో, 2014 ఎన్నికల్లో 17 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలు కావడం గమనార్హం.