డ్రగ్స్ కేసు విచారణలో ఒక రేంజ్ లో నిందితుల పెర్ ఫార్మెన్స్!
మరో ప్రముఖుడు అయితే.. తాను బుద్ధిగా వ్యాపారం చేసుకునేవాడినని.. తనలాంటి అమాయకుడ్ని తీసుకొచ్చి డ్రగ్స్ మరక అంటిస్తారా? అంటూ విచారణ వేళ.. పోలీసుల మీదనే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని
డ్రగ్స్ కేసులో నిందితుల తీరు విచారణ అధికారులకు ఒక సవాలుగా మారుతోంది. వారి మాటలకు చేతలకు మధ్య అంతరం ఒక ఎత్తు అయితే.. విచారణ వేళ.. వారు ప్రదర్శించే యాషాలు చూస్తే.. ఓర్నీ యాషాలో అన్నంత రేంజ్ లో ఉన్నాయని చెబుతున్నారు. పక్కా సమాచారంతో పాటు ఆధారాలతో అదుపులోకి తీసుకున్న నిందితుల్ని.. విచారణ వేళలో పోలీసుల ముందు ఇస్తున్న బిల్డప్ మామూలుగా లేదని చెబుతున్నారు. ఈ మధ్యన డ్రగ్స్ కేసులో మాదాపూర్ లో నిర్వహించిన ఒక రేవ్ పార్టీలో తెలుగు సినీ రంగానికి చెందిన వారిని అదుపులోకి తీసుకోవటం తెలిసిందే.
ఈ కేసు విచారణలో భాగంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పలువురి వివరాలు బయటకు వచ్చాయి. ఈ క్రమంలో వారికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచిన వేళ.. వారి తీరు దర్యాప్తు అధికారులకు విభిన్నమైన అనుభవాన్ని కలిగించినట్లుగా చెబుతున్నారు. విచారణకు హాజరైన వారిలో ఎక్కువ మంది తమ ఫెర్ ఫార్మెన్స్ ను అదరగొట్టేసినట్లుగా తెలుస్తోంది. అయితే.. పోలీసులు పక్కా ఆధారాల్నిసేకరించి.. విచారణ వేళకు ప్రిపేర్ కావటంతో.. వారి యాషాలు ఒక రేంజ్ దాటినంతనే తమ వద్ద ఉన్న ఆధారాల్ని వారి ముందు పెట్టిన తర్వాత మాత్రం కాళ్ల బేరానికి వస్తున్నట్లుగా చెబుతున్నారు.
పదేళ్లుగా కొకైన్.. హెరాయిన్ లాంటి ఖరీదైన డ్రగ్స్ ను తీసుకునే సినీ నటుడు ఒకరు తనను తాను సుద్దపూసగా చెప్పుకోవటమే కాదు.. తాను అమాయకుడ్ని అని.. తనకు డ్రగ్స్ కు లింకుల్ని ఎలా పెడతారు? అని ఘాటుగా ప్రశ్నించిన వైనం తెలిసిందే. ఇదే నటుడు.. పోలీసులు తమ వద్ద ఉన్న ఆధారాల్ని చూపించటంతో.. ఒళ్లంతా చెమటలు పట్టేసినట్లుగా చెబుతున్నారు. మీడియా ఎదుట హడావుడి చేసి.. తాను ఎలాంటి తప్పు చేయలేదన్న అతను.. విచారణ వేళలో మాత్రం అందుకు భిన్నంగా రియాక్టు కావటం గమనార్హం.
మాదాపూర్ రేవ్ పార్టీలో ఐదు రకాల డ్రగ్స్ లభించటం తెలిసిందే. ఈ ఎపిసోడ్ లో ఒక సినీ నిర్మాత బ్లడ్ శాంపిల్స్ ను తీసుకున్న అధికారులు.. తమ శాంపిల్ ను విశ్లేషించగా.. అతను పలు డ్రగ్స్ తీసుకున్నట్లుగా రిపోర్టులు వచ్చినట్లుగా తెలుస్తోంది. పోలీసుల వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయన్న విషయంపై అవగాహన లేని సదరు నిర్మాత.. పోలీసుల ముందు బిల్డప్ ఇవ్వటం.. చివరకు తమ వద్ద ఉన్న ఆధారాల్ని చూపించిన తర్వాత మాత్రం కాళ్ల బేరానికి వస్తున్నట్లుగా చెబుతున్నారు.
మరో ప్రముఖుడు అయితే.. తాను బుద్ధిగా వ్యాపారం చేసుకునేవాడినని.. తనలాంటి అమాయకుడ్ని తీసుకొచ్చి డ్రగ్స్ మరక అంటిస్తారా? అంటూ విచారణ వేళ.. పోలీసుల మీదనే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని.. తనకు సంబంధించి ఏ ఆధారం ఉందని తనను తీసుకొచ్చారంటూ నిలదీసిన అతనికి నాలుగేళ్ల క్రితం రేవ్ పార్టీలో భాగంగా తీసిన ఫోటోల్ని అతగాడి ముందు ఉంచగా.. వాటిని చూసినంతనే.. ఇదంతా గతం సార్.. ఎప్పుడో జరిగిపోయినవి ఇప్పుడు గుర్తుంటాయా? అన్న అతను.. తానిప్పుడు మాత్రం పూర్తిగా మారినట్లుగా చెప్పుకున్నట్లుగా తెలుస్తోంది.