ప్రియ తాజా మాటతో మాజీ మంత్రి నారాయణకు దారేది?

తాను చెప్పిన అంశాలు తప్పు కాదన్న విషయాన్ని రుజువు చేస్తానని కావాలంటే తనకు నార్కో టెస్టు చేసుకోవాలని కోరారు

Update: 2023-08-01 07:13 GMT

మాజీ మంత్రి నారాయణ తనను ఎన్ని అవస్థలకు గురి చేశారన్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టుల రూపంలో పెట్టటం ద్వారా పెను దుమారానికి కారణమయ్యారు నారాయణ సోదరుడి సతీమణి ప్రియ. తన పెళ్లి.. ఆ తర్వాత ఇంట్లో అత్తమామలు ఎలా చూసుకునేవారన్న విషయం దగ్గర నుంచి నారాయణ చేష్టల గురించి ఆమె విపులంగా వివరించారు. ఈ సందర్భంగా ఆమె చెప్పిన మాటలు సంచలనంగా మారాయి.

అయితే.. ప్రియ అనారోగ్యంతో ఉందని.. ఆమె మానసికంగా సరిగా లేదన్న వాదనలు ప్రియ భర్త వ్యాఖ్యానించిన గంటల వ్యవధిలోనే ఆమె హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీసు స్టేషన్ కు వెళ్లి నారాయణ మీద ఫిర్యాదు చేయటంతో విషయం మరింత సీరియస్ గా మారింది. ఇదిలా ఉంటే.. తనపై చేస్తున్న వ్యాఖ్యల వేళ.. ప్రియ షాకింగ్ సవాలు విసిరారు. తాను చెప్పిన అంశాలు తప్పు కాదన్న విషయాన్ని రుజువు చేస్తానని.. కావాలంటే తనకు నార్కో టెస్టు చేసుకోవాలని కోరారు.

తాను జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పెద్ద ఫ్యాన్ అని.. కానీ తనకు సమస్య వస్తే పవన్ పట్టించుకోలేదని ఆరోపించారు. ఆయన సీఎం అయితే నమ్ముకున్న వారి పరిస్థితేమిటి? అని ప్రశ్నించారు. తాను చెప్పిన విషయాల్లో నిజాల్ని నిగ్గు తేల్చేందుకు నార్కో టెస్టుకు రెఢీ అన్న ఆమె.. తాను చెప్పిన వాటిల్లో తప్పులు అని తేలితే నారాయణ కాళ్లు పట్టుకొని క్షమాపణలు కోరతానని వ్యాఖ్యానించారు. తనతో పాటు నారాయణకు కూడా నార్కో పరీక్షలు నిర్వహించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.

నారాయణ వైద్యశాలలో చాలామంది మహిళా వైద్యులు మాజీ మంత్రి లైంగిక వేధింపులు తట్టుకోలేక ఉద్యోగాలు మానేసి వెళ్లిపోయారని.. వాటికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నట్లుగా పేర్కొన్నారు. ప్రియ నోటి నుంచి వచ్చిన మాటలు ఇప్పుడు మరింత సంచలనంగా మారటంతో పాటు.. నార్కో పరీక్షకు సిద్ధమన్న సవాలుతో ఆయన అడ్డంగా ఇరుక్కుపోయినట్లేనని చెబుతున్నారు. మరి.. ప్రియ సవాలుకు ఆయన స్పందిస్తారా? లేదా? అన్నదిప్పుడు చర్చగా మారింది.

Tags:    

Similar News