జగన్ జీపీఎస్ నే మోడీ యూపీఎస్ నా ?

ఈ క్రమంలో 2004 తరువాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కొలువులలో చేరిన వారికి కొత్త పెన్షన్ విధానం అమలు చేసేలా విధానాలను రూపొందించారు.

Update: 2024-08-25 15:30 GMT

దేశంలో పెన్షన్లు పెను భారం అవుతున్నాయి. జీతాలు లక్షల లోకి మారిన తరువాత రిటైర్మెంట్ అయ్యాక ఇచ్చే పెన్షన్ కూడా లక్షలలో ఉంటోంది. దాంతో పాటు పెరిగిన జీవిత కాలం నామినీగా ఉన్న వారికి ఇచ్చే ఫ్యామిలీ పెన్షన్ ఇవన్నీ కలుపుకుంటూ ఒక ప్రభుత్వ ఉద్యోగికి కనీసంగా వందేళ్ళ పాటు ప్రభుత్వం జీతం పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్ కింద కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది.

ఇది అంతకంతకు పెను భారంగా మారుతోంది. ఖజానాకు చిల్లు పెడుతోంది. వచ్చే రూపాయలో జీతాలు పెన్షన్లకు తొంబై పైసలు ఖర్చు పోతూ ఉంటే ఇక అభివృద్ధికి సంక్షేమానికి ఎక్కడ నుంచి తెచ్చి ఖర్చు చేయాలి అన్న చర్చ కూడా ఉంది. రిజర్వ్ బ్యాంక్ కూడా పాత పెన్షన్ విధానం అయితే రాష్ట్రాలు అప్పుల కుప్ప అవుతాయని హెచ్చరించింది.

ఈ క్రమంలో 2004 తరువాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కొలువులలో చేరిన వారికి కొత్త పెన్షన్ విధానం అమలు చేసేలా విధానాలను రూపొందించారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ గా దానికి పేరు పెట్టారు. దీని ద్వారా వీలైనంత వరకూ ఖర్చు తగ్గించుకునేందుకు ప్రభుత్వాలు చూస్తున్నాయి.

అయితే రాష్ట్రాలు ఆర్ధిక పరిస్థితులు బాగుంటే పాత పెన్షన్ విధానం అమలు చేసుకోవచ్చు అని ఈ చట్టంలో నాడే కేంద్రం వెసులుబాటు ఇచ్చింది. అయితే ఈ రోజున దేశమే అప్పుల్లో ఉంది రాష్ట్రాలకు ఆ వెసులుబాటు ఎక్కడిదీ. ఎన్నికల్లో ఓట్ల కోసం ఉద్యోగుల మద్దతు కోసం పాత పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామని చెబుతున్నా ఆచరణలో మాత్రం చేయలేక చేతులు ఎత్తేస్తున్నారు.

దానికి ఉదాహరణ 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం సీపీఎస్ ని రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. కానీ అయిదేళ్ల కాలంలో అమలు చేయలేదు. దాని ప్లేస్ లో జీపీఎస్ ని తెచ్చింది. అంటే గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అన్న మాట. అయితే ఉద్యోగులు దీనిని వ్యతిరేకించారు. టీడీపీ కూటమికి ఓటేశారు. టీడీపీ కూటమి పాత పెన్షన్ స్కీమ్ ని తిరిగి తెస్తుందని ఆశగా చూస్తున్నారు.

అయితే అదంతా ఈజీ కానే కాదు. జగన్ చేసినదే బెటర్ అన్న చర్చ కూడా అప్పట్లో ఆర్థిక నిపుణులతో పాటు మేధావులలోనూ వచ్చింది. అటు పాత పెన్షన్ కాకుండా ఇటు సీపీఎస్ కాకుండా వయా మీడియాగా తెచ్చిన జీపీఎస్ వల్ల ఉద్యోగులకు బాగానే లాభాలు ఉంటాయని తేల్చిన వారూ ఉన్నారు. అయితే ఉద్యోగులలో పాత పెన్షన్ విధానం మీద మోజు పోలేదు.

ఈ క్రమంలో కేంద్రం ఇపుడు కొత్త ఉద్యోగుల కోసం తెచ్చిన ఏకీకృత పెన్షన్ విధానం అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ జగన్ తెచ్చిన జీపీఎస్ విధానంగానే ఉంది అని అంటున్నారు. ఒక విధంగా ఏపీలో వైసీపీ ప్రభుత్వం చూపిన దారిలో కేంద్రం అడుగులు వేసింది అని వైసీపీ నేతలు చెబుతున్నారు

ఏపీలో నాటి సీఎం వైయస్ జగన్ తీసుకొచ్చిన గ్యారెంటీ పెన్షన్‌ స్కీం (జీపీఎస్) తరహాలోనే కేంద్రం కూడా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)‌కి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. యూపీఎస్ లో చూస్తే కనుక ఒక కొత్త ఉద్యోగ విర­మణ తర్వాత చివరి జీతం బేసిక్‌లో 50 శాతం పెన్షన్‌గా అందచేయాలని నిర్ణయించారు. నిజానికి జగన్ తెచ్చిన జీపీఎస్ లోనూ ఇదే విధానం ఉంది. ఆ విధంగా చేయడం వల్ల సీపీఎస్ కంటే కూడా గరిష్టంగా ఉద్యోగి లాభాన్ని పొందుతాడు అని నాడు వైసీపీ నేతలు వివరించారు. కానీ ఉద్యోగులు ఎందుకో ఒప్పుకోలేదు.

అయితే ఇదే జీపీఎస్ తరహాలో కేంద్రం తెచ్చిన యూపీఎస్ ను చూసిన వైసీపీ నేతలు మా దారిలోనే కేంద్రం నడచింది కాబట్టి మా జగన్ విజనరీ అంటున్నారు. ఇక జీపీఎస్ ని ఆనాడు వ్యతిరేకించిన టీడీపీ అధినేత ప్రస్తుతం సీఎం చంద్రబాబు కేంద్రం కొత్తగా తెచ్చిన యూపీఎస్ విధానం మీద ఎలా స్పందిస్తారు అని కూడా ప్రశ్నిస్తున్నారు.

కేవలం జగన్ పైన కోపంతో ఇన్నాళ్లు జీపీఎస్‌ను వ్యతిరేకించిన చంద్రబాబు పాత పెన్షన్ స్కీం అమలు చేస్తారా లేక జీపీఎస్ అని జగన్ తెచ్చిన దానిని అమలు చేస్తారా అన్నది వైసీపీ సంధిస్తున్న ప్రశ్న. అయితే జీపీఎస్ అంటే ప్రభుత్వ ఉద్యోగులు అసలు అంగీకరించరు. మరి ఏమిటి మార్గం అన్నది కూటమి ప్రభుత్వమే నిర్ణయించుకోవాలి.

అయితే కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ చూపిన బాటలో అదే పేరుతో యూపీఎస్ అని చెప్పి ఇక్కడ ఎన్డీయే సర్కార్ ఉద్యోగులకు దానిని అమలు చేయవచ్చు. ఇంతకంటే అయితే ప్రభుత్వం వద్ద మార్గం. లేదు పాత పెన్షన్ స్కీమ్ అంటే ఖజానా పూర్తిగా ఆరిపోతుంది. ఆ సంగతి అందరి కంటే చంద్రబాబుకే బాగా తెలుసు అని అంటున్నారు.

Tags:    

Similar News