గుత్తావారి ఆవేదన.. ఎన్నికలంటే ఇంతే గురూ!
రాజకీయాల్లో సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ.. ప్రస్తుతం బీఆర్ ఎస్‌లో ఉన్న గుత్తా సుఖేందర్‌రెడ్డి తెగ ఆవేదన చెందుతున్నారు
రాజకీయాల్లో సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ.. ప్రస్తుతం బీఆర్ ఎస్‌లో ఉన్న గుత్తా సుఖేందర్‌రెడ్డి తెగ ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంపై ఆయన కన్నీరు ఒక్కటే తక్కువ అన్న రీతిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ''పాపం.. కేసీఆర్‌ను ఒక్కడిని చేసి ఇంత మంది వాలిపోతారా? మాయదారి దండు!'' -అ ని మీడియా ముందే.. తన అక్కసు వెళ్లగక్కారు.
తాజాగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ కేంద్ర అగ్ర నాయకులు సీఎం కేసీఆర్‌పై దండయాత్రలా వస్తున్నారని, తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేలా కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తోందని విమర్శించారు. సోషల్ మీడియాలో తాను కాంగ్రెస్ పార్టీలోకి మారుతు న్నానని దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని ప్రశంసలు గుప్పించారు.
అయితే.. ఇక్కడ ప్రధానంగా ప్రస్తావిస్తున్న అంశం.. కేసీఆర్‌ను ఒక్కడిని చేసి..ఇతర పార్టీల అగ్రనేతలు.. దండయాత్ర చేస్తున్నారని ఆయన అనడమే. వాస్తవానికి రాజకీయాలు అంటే కదా.. గుత్తా బ్రో! అంటున్నా రు ఇతర పార్టీల సీనియర్లు. ముఖ్యంగా ఎన్నికలు అనగానే ఏ పార్టీకి ఆపార్టీ పుంజుకునేందుకు ప్రయత్నా లు చేస్తుంది. దీనిలో వింత విడ్డూరం ఏమీ లేదు. అయితే.. ఇప్పుడు మారిన కాలానికి అనుగుణంగా.. పార్టీలు మరింత పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి.
పదేళ్లపాలనలోని లోపాలను ఎండగడుతున్నాయి. దీనికి ఇంత బాధపడాల్సిన అవసరం ఏముంది? అంటున్నారు. ఇక, గుత్తా మాత్రం కాలు కదిపి బయటకు రావడం లేదు. కేసీఆర్‌పై ఇంత ఆవేదన ఉన్న నాయకుడు మైకు పట్టుకుని ప్రచారానికి రావాలి కదా! అంటే.. సాయంత్రం వేళల్లో రెండు రోడ్లు తిరిగేసి మమ అనిపిస్తున్నారు. కీలకమైన ఎన్నికల సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన నాయకులు ఇలానే ఉంటారా? అనేది మరో ప్రశ్న.