హరీశ్ ఫోన్లు చేసి రమ్మన్నా.. పట్టుమని పాతిక మంది రాలేదా?

ఒక్కసారి అధికారం చేజారిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయన్న విషయానని రాజకీయ నేతలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Update: 2025-01-10 06:25 GMT

అధికారం చేతిలో ఉన్న వేళలో.. బెల్లం చుట్టూ మూగే ఈగల మాదిరి సందడి ఉంటుంది. ఒక్కసారి అధికారం చేజారిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయన్న విషయానని రాజకీయ నేతలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి ఇదేమీ కొత్త విషయం కానప్పటికి.. పదేళ్లు తిరుగులేని అధికారాన్ని వెలగబెట్టిన గులాబీ పార్టీ నేతలకు.. ఇలాంటి షాకులు తగిలి చాలా కాలమే కావటంతో.. తాజా పరిణామాల్ని జీర్ణించుకోవటం కాస్త కష్టంగా ఉందంటున్నారు.

ఫార్ములా ఈ రేస్ వ్యవహారానికి సంబంధించి ఏసీబీ విచారణను ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కేటీఆర్ ఎపిసోడ్ గురించి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఆయనకు న్యాయస్థానాల్లో వరుస పెట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అరెస్టు అవుతారని.. జైలుకు వెళ్లటం ఖాయమన్న ప్రచారం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఇలాంటి వేళ.. తమ అంచనాలకు తగ్గట్లే కేటీఆర్ అరెస్టును అధికారులు ప్రకటిస్తే.. ఏం చేయాలి? ఎలా స్పందించాలి? అన్న అంశంపై కసరత్తు చేసేందుకు వీలుగా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. రాజ్యసభ సభ్యుల్ని పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తునన హరీశ్ రావు స్వయంగా ఫోన్లు చేసినట్లు చెబుతున్నారు.

అధికారం చేతిలో ఉన్నప్పుడు.. హరీశ్ లాంటి ముఖ్యనేతకు ఏదైనా అవసరం ఉందన్న భావన కలిగితేనే.. ఉదయానికి ఇంటి బయట వందల్లో కార్యకర్తలు.. పదుల సంఖ్యలో నాయకులు సిద్ధంగా ఉండే పరిస్థితి నుంచి.. స్వయంగా ఫోన్లు చేసి మరీ పార్టీ ఆఫీసుకు రావాలని పిలిచినా.. అందుకు స్పందించిన వారి సంఖ్య షాకింగ్ గా మారిందంటున్నారు. గురువారం ఉదయం పార్టీ ప్రధాన కార్యాలయానికి అందుబాటులోఉన్న పార్టీ ప్రజాప్రతినిదుల్ని రావాలని కోరుతూ ఫోన్లు వెళ్లాయి. కానీ.. స్పందన మాత్రం షాకింగ్ గా ఉందంటున్నారు.

ఎలాంటి పరిస్థితి నుంచి ఎలాంటి పరిస్థితికి పార్టీ వెళుతోంది? అన్నదిప్పుడు చర్చగా మారింది. ఇక.. హరీశ్ అండ్ కోకు తాజా పరిణామం మింగుడు పడనట్లుగా మారిందంటున్నారు. తాను స్వయంగా ఫోన్ చేసి చెప్పిన తర్వాత పట్టుమని పాతిక మంది ప్రజాప్రతినిధులు పార్టీ ప్రధాన కార్యాలయానికి రాకపోవటం ఏమిటి? అన్నదిప్పుడు చర్చగా మారింది. ఏమైనా.. ఇలాంటి పరిస్థితిని జీర్ణించుకోవటం గులాబీ అధినాయకత్వానికి కష్టంగా ఉందంటున్నారు.

Tags:    

Similar News