"పురుషులకు మాత్రమే" బస్సు ఒక్క ట్రిప్ తోనే ఖతం పట్టించారెందుకు?

ఇలాంటి వేళ.. ఈ రెండు అంశాల్ని డామినేట్ చేసి.. సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ ఒక వార్త తెగ వైరల్ అయ్యింది.

Update: 2024-02-02 04:24 GMT

ఓవైపు బడ్జట్.. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం లాంటి వాటి పుణ్యమా అని.. గురువారం వార్తలకు కొదవ లేకుండా పోయింది. ఇలాంటి వేళ.. ఈ రెండు అంశాల్ని డామినేట్ చేసి.. సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ ఒక వార్త తెగ వైరల్ అయ్యింది. అందరిని ఆకర్షించేలా చేసిన వార్తాంశం ‘పురుషులకు మాత్రమే’’ బస్సు సర్వీస్. హైదరాబాద్ మహానగర శివారులోని ఇబ్రహీంపట్టణం డిపోకు చెందిన ఒక బస్సు సర్వీసును ఈ విధంగా నడిపించటం.. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి పెను సంచనలంగా మారింది.

277ఎల్ సర్వీసు (ఇబ్రహీంపట్నం - ఎల్ బీనగర్) మధ్య నడిపే ఆర్టీసీబస్సును పురుషులకు మాత్రమే అంటూ బోర్డు పెట్టి మరీ నడిపించారు. దీంతో చరిత్రలో తొలిసారి మగాళ్లకు మాత్రమే బస్సు ఏర్పాటు చేశారంటూ వాట్సాప్ గ్రూపుల్లోనూ.. సోషల్ మీడియాలోనూ ఈ బస్సుకు సంబంధించిన ఫోటో తెగ వైరల్ అయ్యింది. దీనిపై ఎవరికి వారు కావాల్సినంత ఎటకారం చేసేసుకున్నారు. ఇలాంటి స్పందనను ఊహించని తెలంగాణ ఆర్టీసీతో పాటు.. ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన స్పందనతో బిక్కచచ్చిపోయారు అధికారులు. ఒక్కటంటే ఒక్క ట్రిప్ తో సదరు సర్వీసును ఖతం పట్టించేశారు.

మగాళ్లకు మాత్రమే అన్న బస్సు ఒక్క ట్రిప్ వేయటం.. ఆ వెంటనే ఉన్నతాధికారుల నుంచి డిపో పెద్దాయనకు వచ్చిన ఆదేశాలతో.. సదరు సర్వీసును యథావిధిగా రోటీన్ సర్వీసుగా మార్చేశారు. అదే సమయంలో.. వైరల్ గా మారిన ఈ అంశంపై ఆర్టీసీ ఉన్నతాధికారులకు పెద్ద ఎత్తున ఫోన్లు వెళ్లాయి. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సైతం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు ప్రభుత్వాన్ని సంప్రదించాలన్న ఆలోచన చేయరా? అంటూ తలంటు పోసినట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ ఒక్క సర్వీసును ప్రయోగాత్మకంగా చేపట్టామని.. ఈ రూట్ లో కాలేజీలు అధికంగా ఉండటం.. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే తప్పించి.. ప్రభుత్వాన్ని ఇరుకున పడేసేందుకు కాదని ఆర్టీసీ అధికారులు చెప్పే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఒకే ఒక్క సర్వీసుతో పురుషులకు మాత్రమే సర్వీసు ఆగిపోయింది. రానున్న రోజుల్లో ఇలాంటి నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దన్న హెచ్చరికలు ప్రభుత్వం నుంచి వెళ్లినట్లుగా చెబుతున్నారు.


Tags:    

Similar News

ఇక ఈడీ వంతు