ఇదొస్తే.. చెన్నై నుంచి బెంగళూరు అరగంటే!
మనదేశంలో రైళ్ల గరిష్ట వేగం 120 కిలోమీటర్లు దాటడం లేదు. నిర్దేశిత వేగానికి లోపుగానే అన్ని రైళ్లూ ప్రయాణిస్తున్నాయి.
మనదేశంలో రైళ్ల గరిష్ట వేగం 120 కిలోమీటర్లు దాటడం లేదు. నిర్దేశిత వేగానికి లోపుగానే అన్ని రైళ్లూ ప్రయాణిస్తున్నాయి. అత్యాధునిక వసతులు, వేగవంతమైన ప్రయాణం కోసం ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లు సైతం పేరు గొప్ప–ఊరు దిబ్బ అనే చందంగా మారాయనే విమర్ళలున్నాయి.
ఈ నేపథ్యంలో రైళ్ల వేగాన్ని పెంచడమే లక్ష్యంగా దేశంలో ప్రఖ్యాత విద్యా సంస్థ.. ఐఐటీ మద్రాస్ అరుదైన ఆవిష్కరణతో ముందుకొచ్చింది. 76 మంది ఐఐటీ మద్రాస్ విద్యార్థులు 425 మీటర్ల పొడవైన హైపర్ లూప్ ను రూపొందించారు. ఇది ట్యూబ్ లాంటి నిర్మాణమని చెబుతున్నారు. ఈ హైపర్ లూప్ ట్యూబ్ లో రైళ్ల బోగీలను ప్రవేశపెడితే అవి గంటకు దాదాపు 500 కిలోమీటర్ల నుంచి 600 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని అంటున్నారు.
రవాణా రంగంలో హైపర్ లూప్ టెక్నాలజీ తో సరికొత్త విప్లవం ఆవిష్కృతమవుతుందని చెబుతున్నారు. రవాణా రంగంలో కీలకం కానున్న ఈ పరిశోధనకు ఇండియన్ రైల్వేస్, ఎల్ అండ్ టీ సంస్థలు నిధులను అందజేస్తున్నాయి.
మద్రాస్ ఐఐటీ విద్యార్థులు అత్యా«ధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తైయూర్ క్యాంపస్ లో 425 మీటర్ల పొడవైన హైపర్ లూప్ ను నిర్మించారు. ఈ లూప్ విశేషాలను మద్రాస్ ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి వెల్లడించారు.
సాధారణంగా భూమిపై ప్రయాణించే వాహనాలకు గాలి అనేది పెద్ద ఆటంకంగా మారుతుందని ప్రొఫెసర్ కామకోటి తెలిపారు. గాలి ఆటంకాలతో వాహనాలు ఒక పరిమితిని మించి వేగంగా వెళ్లడం కుదరదని చెప్పారు.
ఈ నేపథ్యంలో గాలిపీడనం తక్కువగా ఉండే హైపర్ లూప్ ట్యూబ్ లో రైళ్ల బోగీని ప్రవేశపెడితే దాని వేగం బాగా పెరుగుతుందన్నారు.
తక్కువ గాలిపీడనం ఉండటం, అయస్కాంత బలం తోడు కావడం వల్ల హైపర్ లూప్ బోగీ గంటకు దాదాపు 500–600 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతుందని కామకోటి వివరించారు.
తమ ప్రయోగం విజయవంతమయితే హైపర్ లూప్ బోగీలో సరుకులను రవాణా చేసి పరిశీలిస్తామన్నారు. ఆ తర్వాత మనుషులను పంపుతామని చెప్పారు. హైపర్ లూప్ బోగీలు అందుబాటులోకి వస్తే చెన్నై నుంచి బెంగళూరుకు 30 నిమిషాల్లోనే చేరుకోవచ్చని కామకోటి వివరించారు.
కాగా హైపర్ లూప్ ట్యూబ్ లో ‘లూప్’ ముఖ్య భాగం. ఈ లూప్ (ట్యూబ్ లాంటి నిర్మాణం)లో గాలిపీడనం చాలా తక్కువగా ఉంటుంది. లూప్ లోనే రైలు బోగీలాంటి పాడ్ అనే మరో భాగం కూడా ఉంటుంది.
హైపర్ లూప్ ను ప్రయోగాత్మకంగా నడపటానికి తైయూర్ క్యాంపస్ లో ఆసియాలోనే అతి పొడవైన హైపర్ లూప్ ను నిర్మించారు. నాలుగు దశల్లో దీన్ని పరీక్షిస్తారు. విజయవంతమయ్యాక ఇండియన్ రైల్వేల్లో ప్రవేశపెడతారు.