50 లక్షల మంది భారతీయుల ప్రభావానికి ఆ దేశం ఫిదా!

అగ్రరాజ్యం అమెరికాలో 5 మిలియన్లు (50 లక్షలు) మంది భారతీయులు నివసిస్తున్నారు

Update: 2024-06-18 15:13 GMT

అగ్రరాజ్యం అమెరికాలో 5 మిలియన్లు (50 లక్షలు) మంది భారతీయులు నివసిస్తున్నారు. ఉన్నత చదువుల కోసం, ఉన్నత ఉద్యోగాల కోసం అమెరికాకు వెళ్లిన భారతీయులు అక్కడే స్థిరపడి శాశ్వత నివాస హోదాను అందుకున్నారు.

ఈ నేపథ్యంలో అమెరికాలో ఐదు మిలియన్ల మంది భారతీయుల జనాభా అమెరికా మొత్తం జనాభాలో 1.5 శాతం మాత్రమే ఉన్నప్పటికీ అమెరికాలో ఉన్న 33 కోట్ల మందిపై విశేష ప్రభావం చూపుతున్నారు. అమెరికన్లను అనేక కోణాల్లో భారతీయులు గణనీయంగా ప్రభావితం చేస్తున్నారు. అంతేకాకుండా అమెరికాలో నివసిస్తున్న వలస సమూహాల్లో అత్యంత శక్తివంతమైన వలస సమూహాలుగా భారతీయులు నిలుస్తున్నారు.

ఈ మేరకు నివేదిక ఒకటి ఈ విషయాన్ని వెల్లడించింది. అమెరికాలోని భారతీయులు వ్యాపారం, విద్యారంగం, సంస్కృతి, ప్రజా సేవలో గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నారని పేర్కొంది.

వ్యాపార రంగంలో.. గూగుల్, వెర్టెక్స్‌ ఫార్మాస్యూటికల్స్‌ వంటి 16 ఫార్చ్యూన్‌ 500 కంపెనీలకు భారతీయ–అమెరికన్లు నాయకత్వం వహిస్తున్నారు. వీరు సమిష్టిగా 2.7 మిలియన్ల మంది అమెరికన్లకు ఉపాధిని కల్పిస్తుండటం విశేషం. అంతేకాకుండా దాదాపు ట్రిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.

Read more!

అలాగే భారతీయులు స్టార్టప్స్‌ లో తమ సత్తా చాటుతున్నారు. 648 యూనికార్న్‌ లకు సంబంధించి 72 యూనికార్న్‌ లకు భారతీయులే సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు. వీటిలో కేంబ్రిడ్జ్‌ మొబైల్‌ టెలిమాటిక్స్, సోలుజెన్‌ వంటివి ఉన్నాయి. ఈ స్టార్టప్‌లు 55,000 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉన్నాయి. వాటి మొత్తం విలువ 195 బిలియన్‌ డాలర్లు కావడం గమనార్హం.

హోటళ్ల రంగంలోనూ భారతీయులు సత్తా చాటుతున్నారు. అమెరికాలో హోటళ్ల రంగంలో మెజారిటీ భారతీయులే ఉన్నారు. వీరు పెద్ద ఎత్తున పన్ను చెల్లిస్తూ అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదం చేస్తున్నారు. హోటళ్ల రంగంలో భారతీయ అమెరికన్లు సంవత్సరానికి 250–300 బిలియన్‌ డాలర్లు పన్ను కింద చెల్లిస్తున్నారు. భారతీయ అమెరికన్ల హోటల్‌ వ్యాపారాలు పరోక్షంగా 11 మిలియన్లకు పైగా అమెరికన్లకు ఉద్యోగాలను అందించాయి.

ఇక విద్యారంగం, ఆవిష్కరణలు, వాటికి పేటెంట్లు పొందడంలోనూ భారతీయ–అమెరికన్లు విశేషమైన వాటాను కలిగి ఉన్నారు. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ గ్రాంట్లలో గణనీయమైన భాగాన్ని అందుకుంటున్నారు.

ముఖ్యంగా నవీన్‌ వరదరాజన్, సుబ్ర సురేష్‌ వంటి వ్యక్తులు ఆరోగ్య సంరక్షణ, సుస్థిరత వంటి రంగాలలో మంచి పురోగతిని సాధించారు.

సాంస్కృతికంగానూ భారతీయ–అమెరికన్లు వంటకాలు, యోగా, ధ్యానం, పండుగలు, ఫ్యాషన్, సాహిత్యం, దాతృత్వం వంటి వాటి ద్వారా అమెరికన్ల జీవితాన్ని సుసంపన్నం చేస్తున్నారు.

4

దీపక్‌ చోప్రా, వికాస్‌ ఖన్నా వంటి వారి ఆయుర్వేదం, భారతీయ వంటకాలు ప్రాచుర్యం పొందాయి. సాహిత్యంలో జుంపా లాహిరి వంటి రచయితలు తమ సాహిత్యం ద్వారా లబ్దప్రతిష్టలయ్యారు.

రాజకీయాల్లోనూ భారతీయ అమెరికన్లు సత్తా చాటుతున్నారు. అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌ కమలా హారిస్‌ తో సహా ఫెడరల్‌ అడ్మినిస్ట్రేషన్‌లో అనేక కీలక పదవుల్లో భారతీయులు ఉన్నారు.

అలాగే భారతీయ సినిమాలను, హీరోలు, దర్శకులు, హీరోయిన్లను అమెరికన్లు పెద్ద ఎత్తున ఇష్టపడుతున్నారు. భారతీయ సినిమాలను అమెరికాలో పెద్ద ఎత్తున ప్రదర్శిస్తున్నారు. ఇలా అమెరికాలో నివసిస్తున్న 5 మిలియన్ల మంది భారతీయులు 33 కోట్ల మంది అమెరికన్లపై విశేష ప్రభావం చూపుతున్నారు.

Tags:    

Similar News