జగన్ కి ప్రాణ హాని...ఆయన వెంట ఉండాలి !

ఆ మేరకు ఆయనను జగన్ తన వెంట ఉండేలా చూడాలని కోరుతూ ఒక పిటిషన్ హైకోర్టులో దాఖలు అయింది.

Update: 2025-01-14 03:55 GMT

మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ భద్రత మరోసారి చర్చకు వస్తోంది. జగన్ కి ప్రస్తుతం జెడ్ ప్లస్ భద్రత ఉంది. అయితే ఆయన సెక్యూరిటీ వింగ్ లో కీలక అధికారిగా డీఎస్పీ ఎస్ మహబూబ్ భాషా ఉండాలని కోరుకుంటున్నారు. ఆ మేరకు ఆయనను జగన్ తన వెంట ఉండేలా చూడాలని కోరుతూ ఒక పిటిషన్ హైకోర్టులో దాఖలు అయింది.

జగన్ తన కుమార్తెను చూసేందుకు విదేశాలకు వెళ్తున్నారు. ఆయన లండన్‌లో చదువుతున్న తన కుమార్తె స్నాతకోత్సవం కోసం ఆ దేశం వెళుతున్న సందర్భంగా తన భద్రతా బృందంలో డిఎస్‌పి ఎస్‌.మహబూబ్‌ బాషా ఉండేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ తాజాగా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిని అత్యవసర హౌస్‌మోషన్‌ పిటిషన్‌ గా వేయడంతో సోమవారం విచారణ చేపట్టారు.

ఈ పిటిషన్ లో పేర్కొన్న మేరకు జగన్‌ తరపు న్యాయవాదులు వాదిస్తూ జగన్ కి ప్రాణహాని ఉన్నందున జెడ్‌ ప్లస్‌ భద్రత ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇక ఆయన విదేశానికి వెళుతున్నందున ప్రొటోకాల్‌ మేరకు సెక్యూటిరీని రాష్ట్రమే కల్పించాలని కూడా చెప్పారు. అయితే జగన్ కి గతంలో తన భద్రతా బృందంలో ఉన్న మహబూబ్‌ బాషాను ప్రస్తుతం లేకుండా చేసారని పేర్కొన్నారు.

ఆయనను జగన్ సెక్యూరిటీ వింగ్ లో కొనసాగించాలని జగన్‌ ఈ నెల 9న ఏపీ ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చినా ఫలితం లేకపోయిందని కోర్టుకు తెలిపారు. అందువల్ల ఆయనని కొనసాగించాలని వారు వాదనలు వినిపించారు. అయితే దీని మీద రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ ప్రతివాదన చేశారు. ఆయన చెప్పినది ఏంటి అంటే ఎల్లోబుక్‌ ప్రకారం తనకు నిర్దిష్ట వ్యక్తినే భద్రతాధికారిగా ఇవ్వాలని కోరేందుకు పిటిషనర్‌కు హక్కు లేదని.

అంతే కాదు ముఖ్య వ్యక్తుల భద్రతా సిబ్బంది కేటాయింపు విషయంలో రాష్ట్రానికే కాకుండా కేంద్ర హోం, విదేశీ వ్యవహారాల శాఖలు కూడా తుది నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. ఇలా వాద ప్రతివాదనలు జరిగాయి. దీంతో ఈ కేసు విచారణను ఈ నెల 17కి వాయిదా వేశారు. మరి జగన్ కోరుకున్న అధికారిని ఆయన సెక్యూరిటీ వింగ్ లో ఉంచుతారా లేదా అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News