బీజేపీ కావాలనే నాన్చుతోందా ?

చంద్రబాబు ఈనెల 6వ తేదీన ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా తో పొత్తు చర్చలు జరిపొచ్చారు.

Update: 2024-02-25 04:51 GMT

ఒకవైపు ఎన్నికల తేదీ ముంచుకొచ్చేస్తున్నా బీజేపీ మాత్రం పొత్తు విషయాన్ని నాన్చుతోంది. నాలుగున్నరేళ్ళు టీడీపీతో పొత్తు విషయమై ఏమీ మాట్లాడని బీజేపీ అగ్రనేతలు సడెన్ గా పొత్తు సంకేతాలు పంపారు. అప్పటికే సీట్ల సర్దుబాటు చర్చల్లో బిజీగా ఉన్న చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ అలర్టయ్యారు. చంద్రబాబు ఈనెల 6వ తేదీన ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా తో పొత్తు చర్చలు జరిపొచ్చారు. అయితే ఆ చర్చల్లో ఎవరు ఏమి మాట్లాడుకున్నారనే విషయం బయటకు తెలీదు.

వీళ్ళ చర్చలపై రకరకాలుగా ప్రచారాలు జరగుతన్నాయి. బీజేపీ, జనసేనకు కలిపి 60 అసెంబ్లీ సీట్లు, 12 పార్లమెంటు సీట్లను అమిత్ షా అడిగారని, కాదుకాదు బీజేపీకి 25 అసెంబ్లీలు, 10 లోక్ సభ సీట్లను అడిగారనే ప్రచారం బాగా జరుగుతోంది. ఏదేమైనా చర్చలపై అధికారిక ప్రకటన రాలేదు కాబట్టి అనధికారికంగా ఎవరిష్టమొచ్చిన అంకెలను వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇపుడు విషయం ఏమిటంటే తామడిన సీట్లను ఇవ్వటానికి చంద్రబాబు అంగీకరించని కారణంగానే పొత్తు విషయాన్ని బీజేపీ నాన్చుతోందనే ప్రచారం పెరిగిపోతోంది.

పొత్తు, సీట్ల సర్దుబాట్లపై తేల్చకుండానే బహిరంగసభల నిర్వహణకు పార్టీలు రెడీ అయిపోతున్నాయి. 27వ తేదీన బీజేపీ ఆధ్వర్యంలో ఏలూరులో బహిరంగసభ జరగబోతోంది. అలాగే 28వ తేదీన టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలో భారీ బహిరంగసభ జరుగుతోంది. పొత్తు పెట్టుకునే ఉద్దేశ్యంలో ఉంటే బీజేపీ ఒంటరిగా బహిరంగసభకు ఎందుకు ప్లాన్ చేస్తుందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అంటే పొత్తు పేరుతో ఊరికే బీజేపీ టై వేస్టు పనిచేస్తోందనే ప్రచారం అందరిలోను పెరిగిపోతోంది.

నిజంగా ఇదే గనుక బీజేపీ మనసులో ఉంటే అప్పుడు ఎక్కువగా నష్టపోయేది టీడీపీ మాత్రమే. అప్పుడు బీజేపీకి కూడా ఎలాంటి ఉపయోగమూ ఉండదని అందరికీ తెలిసిందే. టీడీపీకి నష్టం చేయటమే బీజేపీకి జరగబోయే లాభమని కమలనాదులు అనుకుంటుంటే ఎవరు చేయగలిగేదేమీలేదు. ఏపీ విషయంలో బీజేపీ చేస్తున్న విషయాన్ని మిగిలిన రాష్ట్రాల్లో ప్రాంతీయపార్టీల అధినేతలు గమనించకుండానే ఉంటారా ? అప్పుడు అందరు జాగ్రత్తపడితే నష్టపోయేది తామే అని బీజేపీ అగ్రనేతలకు అంతమాత్రం తెలీదా ? మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

Tags:    

Similar News