కార్యకర్తలతో జగనన్న,.... జిల్లాల టూర్ ఖరారు
వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ జిల్లాల పర్యటనకు షెడ్యూల్ ఖరారు అయింది. ఆ విషయాన్ని ఆయనే పార్టీ నేతల సమావేశంలో చెప్పారు.
వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ జిల్లాల పర్యటనకు షెడ్యూల్ ఖరారు అయింది. ఆ విషయాన్ని ఆయనే పార్టీ నేతల సమావేశంలో చెప్పారు. తాను సంక్రాంతి తరువాత జనంలోకి వస్తున్నట్లుగా జగన్ తెలియచేశారు. ఆరు నెలల పాటు టీడీపీ కూటమి ప్రభుత్వానికి టైం ఇచ్చామని అయితే ఈ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవీ అమలు చేయలేదని అన్నారు.
దాంతో ప్రతీ ఇంట్లో ఇదే విషయం మీద చర్చ సాగుతోందని జగన్ పార్టీ నేతలతో అన్నారు. అయిదేళ్ల పాటు వైసీపీ అమలు చేసిన సంక్షేమ పధకాలను టీడీపీ సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి అమలు చేయని తీరుని జనాలు సరిపోల్చుకుని కూటమి ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను పెంచుకుంటున్నారు అని జగన్ విశ్లేషించారు.
అందువల్ల జనంలోకి వెళ్ళేందుకు ఇదే సరైన సమయం అని ఆయన అంటున్నారు. జనవరి లోగా పార్టీ కమిటీలు అన్నీ బూత్ లెవెల్ వరకూ వేయాలని ఆయన పార్టీ నేతలను ఆదేశించారు. అంతే కాకుండా పార్టీ నేతలు అంతా అనుసంధానం అయ్యేలా వాట్సప్ ఇన్స్టా, ఫేస్ బుక్ ఉండాలని సూచించారు. ప్రతీ పల్లెలో జరిగే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను వీడియోలుగా తీసి సామాజిక మాధ్యమాలలో అప్ లోడ్ చేయాలని జగన్ కోరారు
ఇవన్నీ పక్కన పెడితే సంక్రాంతి తరువాత తాను జనంలోకి వస్తాను అని జగన్ చెప్పారు. ప్రతీ బుధ, గురువారాలలో రెండు రోజుల పాటు జిల్లాలలోనే ఉంటానని అక్కడే బస చేస్తాను అని ఆయన ప్రకటించారు. కార్యకర్తలతో మమేకం అవుతానని తనకు అన్ని విషయాలు వారు నేరుగా కలసి చెప్పుకోవచ్చు అని జగన్ తెలియచేశారు.
పార్లమెంట్ యూనిట్ గా చేసుకుని ఈ జిల్లాల పర్యటన ఉంటుంది అని జగన్ చెప్పారు. అంటే మొత్తం 26 జిల్లాలు జిల్లాలో రెండు రోజులు లెక్కన 52 రోజుల పాటు జగన్ పర్యటనలు నిరంతరాయంగా సాగుతాయని అంటున్నారు. ఇక జగన్ ఎక్కడ నుంచి తన జిల్లాల టూర్ ప్రారభిస్తారు అన్నది కూడా చర్చగా ఉంది. జగన్ ఉత్తరాంధ్రా నుంచి ప్రారంభించవచ్చు అని ఒక ప్రచారంగా ఉంది.
అదే సమయంలో ఆయన నెల్లూరు నుంచి కూడా తన జిల్లాల పర్యటనను మొదలెడతారు అని అంటున్నారు మరో వైపు గోదావరి జిల్లాల నుంచి ప్రారంభిస్తే శుభారంభంగా ఉంటుందని పార్టీ నేతలు కొందరు సూచిస్తున్నారు. ఇక డేట్ జిల్లా ముహూర్తం అన్నీ తొందరలోనే ఖరారు చేస్తారు అని అంటున్నారు. జగన్ జిల్లాల టూర్ కి ఒక పేరుని కూడా పెట్టారు. కార్యకర్తలతో జగనన్న, పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం అనే పేరుతో కార్యక్రమం నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. జగన్ తాను స్వయంగా చేసిన ఈ ప్రకటనతో క్యాడర్ లో అయితే జోష్ కనిపిస్తోంది.