కూటమిని మరింత బలోపేతం చేస్తున్న జగన్.. !
గత ఏడాది ఎన్నికలకు ముందు కూడా.. ఒంటరిగా రావాలంటూ.. ఒక్కొక్క పార్టీని రెచ్చగొట్టింది.
టీడీపీ-బీజేపీ-జనసేన.. మూడు పార్టీల కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పాలన చేస్తోంది. అయితే.. వాస్తవానికి ఈ మూడు పార్టీలు కలవడాన్ని పొత్తు పెట్టుకుని పరుగులు పెట్టడాన్ని వైసీపీ సహించలేదన్న విష యం తెలిసిందే. గత ఏడాది ఎన్నికలకు ముందు కూడా.. ఒంటరిగా రావాలంటూ.. ఒక్కొక్క పార్టీని రెచ్చగొట్టింది. ముఖ్యంగా జనసేన వంటి పార్టీలను అయితే.. మరింతగా కుల, ఇమేజ్ పరంగా కూడా.. వైసీపీ కూటమి కట్టకుండా జాగ్రత్తలు తీసుకుంది.
కానీ, వైసీపీ దూకుడును కూటమి పార్టీలు ఏమాత్రం పట్టించుకోకుండా పొత్తు పెట్టుకుని జగన్ పార్టీకి ఝలక్ ఇచ్చాయి. కట్ చేస్తే.. ఇప్పుడు పలు జిల్లాల్లో పైకి అంతా బాగుందని అనిపించినా.. కూటమి పార్టీల నేతల మధ్య విభేదాలు.. వివాదాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏడు మాసాల్లోనే.. కూటమిలో రగడలు తెరమీదికి వస్తుండడం.. ఆధిపత్య పోరు రోడ్డెక్కుతుండడం తెలిసిందే. అయితే.. కూటమి అధినాయకులు ఈ వివాదాలను ఎప్పటికప్పుడు సరిదిద్దుతున్నారు.
కానీ, మరో నాలుగు సంవత్సరాలు.. కూటమి ముందుకు సాగాలి. ఈ క్రమంలో అనేక వివాదాలు, విభేదాలు తెరమీదికి వచ్చే అవకాశం ఉంటుందనడంలో సందేహం లేదు. దీంతో కూటమి ఎన్నికల వరకు పదిలం గా ఉంటే బెటరే అన్న సంకేతాలు కూడా వస్తున్నాయి. అయితే.. తాజాగా జగన్ చేసిన చేసిన వ్యాఖ్యలు.. కూటమి విడిపోవాలని అనుకున్నా.. క్షేత్రస్థాయి నాయకులు రోడ్డెక్కినా... ఇక, ఇప్పుడు మాత్రం వారంతా చేతులు కలిసి.. ముందుకు సాగేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి.
ఎన్నికలు ఇప్పుడు జరిగినా వైసీపీదే గెలుపు అని.. మరో 30 ఏళ్లపాటు తమదే పాలన అని జగన్ చెప్పుకొ చ్చారు. సహజం ఈ వ్యాఖ్యలు వైసీపీలో జోష్ పెంచుతాయో లేదో తెలియదు కానీ.. కూటమిలోని క్షేత్ర స్థాయి నాయకులను మాత్రం అలెర్ట్ చేస్తున్నాయి. ``మనం విడిపోతే.. వైసీపీకి బలం చేకూరుతుంది. కాబట్టి సర్దుకు పోదాం`` అనే టాక్ వినిపించేలా చేస్తున్నాయి. అంటే.. పైస్థాయిలో నాయకులు చెప్పినా చెప్పకపోయినా.. జగన్ వ్యాఖ్యల ఫలితంగా కూటమి నేతలు కలివిడిగానే ఉండేందుకు అవకాశం ఏర్పండింది. అంటే ఒకరకంగా.. కూటమిని జగనే స్వయంగా బలోపేతం చేస్తున్నట్టు అయిందని అంటున్నారు పరిశీలకులు.