చైనాలో బీభత్సం సృష్టిస్తోన్న వైరస్ భారత్ లో ఎందుకు కాదు?
ట్రావెల్ హిస్టరీ లేకపోయినా ఈ వ్యాధి సోకుతుండటంపై చర్చ జరుగుతుందని అంటున్నారు.
చైనాలో కలకలం రేపుతోన్నట్లు చెబుతున్న హ్యూమన్ మెటానిమో వైరస్ (హెచ్ఎంపీవీ) కేసులు దేశంలోనూ నమోదవుతుండటం తీవ్ర కలవరం కలిగిస్తోందని అంటున్నారు. ట్రావెల్ హిస్టరీ లేకపోయినా ఈ వ్యాధి సోకుతుండటంపై చర్చ జరుగుతుందని అంటున్నారు. ఈ సమయంలో బీజేపీ నేతలు ఈ వైరస్ పై స్పందిస్తున్న తీరు ఆసక్తికరంగా మారింది.
అవును... ప్రస్తుతం దేశంలో హ్యూమన్ మెటానిమో వైరస్ (హెచ్ఎంపీవీ) కేసులు నమోదవుతుండటం వేళ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పందించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఈ వైరస్ కొత్తదేమీ కాదని.. భయపడాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. పరిస్థితిని ఐసీఎంఆర్, ఎన్సీడీసీ నిశితంగా గమనిస్తున్నాయని తెలిపారు.
అదేవిధంగా... హెచ్ఎంపీవీ కొత్త వైరస్ కాదని ఆరోగ్య రంగ నిపుణులు స్పష్టం చేశారని.. ఈ వైరస్ ని 2001 లోనే గుర్తించారని.. అన్ని వయసుల వారినీ ఇది ప్రభావితం చేస్తుందని.. ఇది చాలా ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తిలో ఉందని జేపీ నడ్డా వెళ్లడించారు. అయితే... కర్ణాటకకు చెందిన బీజేపీ నేతలు మాత్రం ఈ వైరస్ పై కాస్త గట్టిగానే మాట్లాడుతున్నారు!
ఈ వైరస్ కి సంబంధించిన తొలి కేసులు కర్ణాటకలో నమోదైన నేపథ్యంలో.. ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్ గుండూరావు మాట్లాడుతూ.. ఈ వైరస్ పట్ల ప్రజలు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని తెలిపారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తరహాలోనే ఈయన స్పందించారు! దీంతో.. కర్ణాటక బీజేపీ నేతలు మాత్రం సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు!
ఇందులో భాగంగా... ఈ కొత్త వైరస్ ప్రభావం గురించి ఏమీ తెలియనప్పుడు తేలిగ్గా తీసుకోవద్దని.. ఈ వైరస్ చైనాలో బీభత్సం సృష్టిస్తోందని.. అక్కడి చిన్నారులు ఆస్పత్రుల పాలయ్యారని.. ఈ క్రమంలో ఈ వైరస్ వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని.. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసిందని బీజేపీ నేత ఆర్. అశోక తెలిపారు.
దీంతో... చైనాలో ఈ వైరస్ చిన్నారుల ప్రాణాలను హరిస్తుందని కర్ణాటక బీజేపీ నేతలు చెబుతుండగా.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి.. దీనిపై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నట్లుగా వ్యాఖ్యానించారనే చర్చ మొదలైందని అంటున్నారు. వీరిద్దరి మాటలను తీసుకుంటే.. చైనాలో అంత బీభత్సం సృష్టిస్తోన్న వైరస్ భారత్ లో మాత్రం ఎందుకు ప్రమాదం కాదు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని అంటున్నారు.