స్పీకర్ రఘురామపై జ్యోతుల నెహ్రూ అసహనం
ఈ క్రమంలో టీడీపీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ, స్పీకర్ రఘురామల మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఐదో రోజు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణరాజు నిన్న ఎంపికయ్యారు.ఈ రోజు సభలో స్పీకర్ గా రఘురామ వ్యవహరించారు. ఈ క్రమంలో టీడీపీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ, స్పీకర్ రఘురామల మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాట్లాడేందుకు సమయం ఇచ్చే విషయంలో ఇద్దరి మధ్య జరిగిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. నూతన ఇసుక పాలసీ వల్ల ప్రభుత్వానికి అంత మంచిగా లేదు అని నెహ్రూ అన్నారు. పూర్వ విధానంలో అవసరమైన వాళ్లు వెళ్లి ఇసుక తెచ్చుకునే విధానం పునరుద్ధరించాలని జ్యోతుల నెహ్రూ కోరగా..మిగతా సభ్యులు జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యలపై కాస్త అసహనం వ్యక్తం చేశారు.
ఆ క్రమంలో త్వరగా తన ప్రసంగాన్ని ముగించాలని నెహ్రూకు స్పీకర్ రఘురామ సూచించారు. అయితే,.తాను మాట్లాడుతుంటే స్పీకర్ త్వరగా ముగించాలని పదే పదే చెప్పడం సరికాదని, ఒకవేళ తనను కూర్చోమంటే కూర్చుంటానని నెహ్రూ అసహనానికి గురయ్యారు. సీనియర్ శాసన సభ్యుడైన తనకు తగినంత సమయం ఇవ్వాలని జ్యోతుల నెహ్రూ కోరారు. తనకంటే జూనియర్ సభ్యులు తనకంటే ఎక్కువ సేపు మాట్లాడారని చెప్పారు. అయితే, మిగతా సభ్యులు చేతులెత్తి అభ్యంతరం వ్యక్తం చేస్తుండడంతోనే నెహ్రూను తాను త్వరగా ముగించాలని చెప్పానని, దయచేసి కూర్చోవాలని రఘురామ కోరారు.
పంచాయతీ రాజ్ వ్యవస్థ రెండు పుంతలుగా వెళుతోందని నెహ్రూ అన్నారు. ఈ సమయంలో కల్పించుకున్న రఘురామ సభ్యులు చాలా అసహనంగా ఉన్నారు..అర్థం చేసుకోవాలి...త్వరగా ముగించండి అని నెహ్రూకు సూచించారు. దీంతో, అసహనానికి గురైన నెహ్రూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ కూర్చోమంటే కూర్చుంటాను...నాకు ఇబ్బందేమీ లేదు..3 నిమిషాలు కాకుండానే పదే పదే అడ్డొచ్చేస్తే ఎలా...నన్ను ప్రతిపక్షంగా చూడకండి...అద్యక్షా మీతో వాదన నాకొద్దు...సారీ.. టైం నాకూ ఇవ్వాల్సిన బాధ్యత సభపై ఉంది...మీరు ఇస్తానంటే ఓకే...లేదంటే లేదు...అలా చేస్తుంటే..నన్ను ప్రతిక్షంగా చూస్తున్న ఫీలింగ్ వస్తోంది...సభకు రావద్దంటే రాను మానేస్తాను..నాకు అభ్యంతరం లేదు...అది కరెక్టు కాదండీ.’’ అంటూ నెహ్రూ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.