కదిరి సీటు కదులుతోంది.. రెడ్డిగారి మనోవ్యధ!
ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం. గత రెండు సార్లుగా ఇక్కడ వైసీపీ విజయం దక్కించు కుంటున్న విషయం తెలిసిందే
ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం. గత రెండు సార్లుగా ఇక్కడ వైసీపీ విజయం దక్కించు కుంటున్న విషయం తెలిసిందే. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రయోగాలు చేసినా.. ఇక్కడ ప్రజలు ఆ పార్టీకే జై కొట్టారు. 2014లో అత్తర్ చాంద్ బాషాకు అవకాశం ఇవ్వగా.. 2019లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సిద్దా రెడ్డికి అవకాశం ఇచ్చారు. అయితే.. ఈ రెండు ప్రయోగాలకు కూడా జనాలు జై కొట్టారు.
కానీ, ఎన్నికలు ఎప్పుడూ ఒకే విధంగా జరగవు. నాయకులు ఎప్పుడూ ఒకేలా ఉండరు. ప్రజలు కూడా ఒకే తరహాలో ఆలోచన చేయరు. సో.. ఈ మూడు అంశాలను పరిగణనలోకి తీసుకున్న వైసీపీ అధిష్టానం అనూహ్య మార్పుల దిశగా అడుగులు వేస్తోంది అని ప్రచారం జరుగుతుంది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ సిద్దారెడ్డిని పక్కన పెట్టేయాలని భావిస్తోంది అని కూడా ప్రచారం ఊపు అందుకుంది . వచ్చేఎన్నికల్లో ఆయనకు టికెట్ లేదని.. ఇప్పటికే చెప్పేసినట్టు కూడా అంటున్నరు.
ఆయన స్థానంలో మైనారిటీ వర్గానికి చెందిన నాయకుడిని నిలబెట్టనున్నారని టాక్. కదిరిలో మైనారిటీ వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడం.. పైగా.. ఆ వర్గం వారు ఇప్పుడు తమకే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతుం డడం కూడా.. దీనికి ప్రధాన కారణంగా మారింది. ఇక, బలమైన వర్గంగా ఉన్న మైనారిటీల్లో ప్రస్తుత ఎమ్మెల్యేకి అంత పాజిటివిటీ కనిపించడం లేదు. ఇది కూడా మరోకారణం.
ఇక, కదిరి వైసీపీలో వర్గం పోరు మరింత ఎక్కువగా ఉంది. సిద్దారెడ్డికి వ్యతిరేకంగా గ్రూపులు కడుతున్నవారు కూడా ఉన్నారు. దీంతో ఎన్నికలకు ముందు వీరిని చక్కదిద్దలేక, సరిదిద్దలేక.. అధిష్టానం.. ఒకే వేటుకు రెండు పరిష్కారాలు అన్నట్టుగా.. ఎమ్మెల్యే సిద్దారెడ్డిని పక్కన పెట్టేయడం ద్వారా.. అన్ని సమస్యలకు ఒకే పరిష్కారం చూపించేందుకు రెడీ అయినట్టు సమాచారం. అయితే.. ఇక్కడ అభ్యర్థి ఎవరనేది తేలాల్సి ఉంటుంది.