కమలా హారిస్.. ఉషా చిలుకూరితో మరీ ఇంత చీప్ గానా?
అయితే, వాన్స్ ఉపాధ్యక్షుడు కానుండడం కూడా కమలకు అస్సలు రుచించడం లేదట.
ఓటమి తాలూకు బాధ ఎవరికైనా సహజమే. అది చిన్న పోటీ అయినా పెద్ద పోటీ అయినా..? ఇక అమెరికా అధ్యక్ష పదవికి పోటీకి దిగి విజయం చేజారితే ఇంక బాధ ఎంతగా ఉంటుందో చెప్పనలవి కాదు. భారత సంతతికి చెందిన కమలా హారిస్ విషయంలో ఇప్పుడిదే జరుగుతోంది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఓటమిని కమలా ఇంకా తట్టుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది.
నవంబరు 4న జరిగిన ఎన్నికల్లో అమెరికా అధ్యక్షురాలిగా కమలా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇది జరిగి రెండు నెలలు దాటినా ఆమెలో ఇంకా బాధ పోనట్లుంది. పైగా తనను తీవ్రంగా ద్వేషించే ట్రంప్ అధ్యక్షుడు కాబోతుండడంతో కమల ఇంకా రగులుతూనే ఉన్నట్లు కనిపిస్తోంది.
తోటి భారతీయురాలి పట్ల..
కమల గెలుపును భారతీయులు మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఇదే సమయంలో అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి (రిపబ్లికన్) జేడీ వాన్స్ కూ మద్దతు పలికారు. కారణం.. వాన్స్ భార్య ఉషా చిలుకూరి భారతీయురాలు కావడం. ఇక ఫలితాలు వచ్చాక కమల కల చెదరగా.. వాన్స్ ఉపాధ్యక్షుడు కాబోతున్నారు. ఈ నెల 20న అధ్యక్షుడు బైడెన్ పదవి నుంచి దిగిపోయి ట్రంప్, వాన్స్ కుర్చీ ఎక్కనున్నారు. అంటే ఉషా చిలుకూరి అమెరికా సెకండ్ లేడీ కానున్నారు.
అయితే, వాన్స్ ఉపాధ్యక్షుడు కానుండడం కూడా కమలకు అస్సలు రుచించడం లేదట. దీంతో ఆమె ఉపాధ్యక్షురాలిగా పనిచేసిన తన హోదా మర్చిపోయి వ్యవహరిస్తున్నారు.
అమెరికా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు పదవీ విరమణ తర్వాత.. కొత్తగా రాబోయేవారికి తాము నివసించిన ఇళ్లలోకి సాదరంగా ఆహ్వానిస్తారు. ఈ సందర్భంగా రెసిడెన్స్ టూర్ చేయడం ఆనవాయితీ. ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పుకోబోతున్న కమలా మాత్రం వాన్స్-ఉషా దంపతులను రెసిడెన్స్ టూర్ కు వచ్చేందుకు నిరాకరించారట.
కాగా, వాన్స్- ఉషా తమ ముగ్గురు పిల్లలతో జనవరి 20న ఉపాధ్యక్షుడి నివాసం నావల్ అబ్జర్వేటరీలోకి మారనున్నారు. దీనికోసం కమలా హ్యారిస్ సిబ్బందితో వారు సంప్రదించి ప్రక్రియ సాఫీగా సాగిపోవడానికి సహకరించాలి. కమల మాత్రం సహకరించడం లేదట. ఈ తీరు కమల సొంత పార్టీ డెమోక్రాట్లతో పాటు రిపబ్లికన్లలోనూ చర్చనీయాంశమైంది.
భారతీయ మూలాలున్న కమలా.. ఓ ప్రవాస భారతీయురాలి కి అడ్డంకులు కల్పించడం విమర్శలకు దారితీస్తోంది.