మిధున్ రెడ్డి అరెస్ట్ కి రంగం సిద్ధం ?

అసలు లిక్కర్ స్కాం విషయంలోనే అంతా ఏకపక్షంగా సాగుతోదని వైసీపీ నేతలను కావాలని ఇరికించే ప్రయత్నం జరుగుతోందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయట.;

Update: 2025-04-06 03:44 GMT
మిధున్ రెడ్డి అరెస్ట్ కి రంగం సిద్ధం ?

లోక్ సభలో వైసీపీ లీడర్ మిధున్ రెడ్డి విషయంలో సీరియస్ యాక్షన్ దిశగా అడుగులు పడుతున్నాయా అన్న చర్చ సాగుతోంది. ఆయనని లిక్కర్ స్కాం విషయంలో అరెస్ట్ చేస్తారా అన్నది కూడా వైసీపీలో తర్జన భర్జనలు పడేలా చేస్తోంది. మిధున్ రెడ్డి ముందస్తు బెయిల్ ని హైకోర్టు తిరస్కరించడంతో మొత్తం సినారియో మారింది అని అంటున్నారు.

ఆయన పేరు ఎఫ్ఐఆర్ లో లేదని సీఐడీ కోర్టుకు తెలియచేసిన క్రమంలో ఆయనకు ముందస్తు బెయిల్ పిటిషన్ ని కోర్టు కొట్టేసింది. అయితే శనివారం ఉదయాన్నే ఢిల్లీకి సీఐడీ అధికారులు చేరుకోవడంతో వైసీపీ వర్గాలలో కొత్త టెన్షన్ మొదలైంది. పెద్దిరెడ్డి అరెస్టు కి రంగం సిద్ధం అవుతుందా అన్న చర్చ కూడా సాగుతోంది.

పెద్దిరెడ్డిని అరెస్ట్ చేయడానికే సీఐడీ అధికారులు ఏపీ నుంచి ఢిల్లీకి చేరుకున్నారని వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఈ కేసుతో ఎలాంటి సంబంధం మిధున్ రెడ్డికి లేకపోయినా తాము అరెస్టు చేసిన వారిని బలవంతం పెట్టి చెప్పి కావాల్సిన వారి పేర్లు చెప్పించుకుంటున్నారు అని అంటున్నారు. ఈ క్రమంలో ఇటీవలనే రిలీవ్ అయి తన మాతృ సంస్థ అయిన ఇండియన్ రైల్వేస్ లోకి వెళ్ళిన ఏపీ బేవరేజెస్ కార్పోరేషన్ మాజీ ఎండీ అయిన డి వాసుదేవరెడ్డి ద్వారా మిథున్ రెడ్డి పేరు చెప్పించి ఉంటారని వైసీపీ వర్గాలు అనుమానిస్తున్నాయిట.

అసలు లిక్కర్ స్కాం విషయంలోనే అంతా ఏకపక్షంగా సాగుతోదని వైసీపీ నేతలను కావాలని ఇరికించే ప్రయత్నం జరుగుతోందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయట. ఇక హైదరాబాద్ లోని వైసీపీ నేతల ఇళ్ళ మీద కూడా ఇటీవల కాలంలో దాడులు చేసి మరీ వారిని ఇబ్బంది పెట్టారని ఒక విధంగా చూస్తే అన్ని వైపుల నుంచి వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకుంటున్నారని అంటున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే మిధున్ రెడ్డి చుట్టూ మెల్లగా ఉచ్చు బిగుస్తోంది అని అంటున్నారు. మిధున్ రెడ్డి వైసీపీలో బిగ్ షాట్. ఆయన వైసీపీ అధినాయకత్వానికి అత్యంత సన్నిహితుడు. మరో వైపు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టార్గెట్ గా కూడా కొంతకాలం వ్యవహారం సాగింది. అయితే ఏడున్నర పదుల వయసులో ఉన్న పెద్దాయన అన్న ఒక కారణం మీద ఆయన గురించి కొంత ఆలోచనలో పడ్డారా లేక వేరే విధమైన సానుభూతి దక్కించుకుంటారని ఆలోచించారా తెలియదు కానీ ఆయన నుంచి మిధున్ రెడ్డి వైపుగా సీన్ మారింది అని అంటున్నారు.

ఇక ఈ విషయంలో కేలవం ఏపీలోని పార్టీల ప్రమేయం తో పాటు జాతీయ స్థాయిలోనూ ఆయన టార్గెట్ అయ్యారా అన్నది కూడా చర్చకు వస్తున్న విషయం. ఇక తన విషయంలో ఏదో జరుగుతోంది అన్నది ఆలోచిస్తున్న మిధున్ రెడ్డి సుప్రీం కోర్టునే ఆశ్రయించనున్నారు అని అంటున్నారు. మరి ఆయనకు అక్కడ ఏ రకమైన రిలీఫ్ దొరుకుతుందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News