కర్ణిసేన చీఫ్ హత్య కేసులో 5 కీలక పరిణామాలు

దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ వైరల్ గా మారింది. తీవ్రమైన షాక్ కు గురిచేసింది

Update: 2023-12-07 03:54 GMT

ఒక ముఖ్యనేతను వారింట్లో.. వారితో కూర్చున్న నిందితులు హటాత్తుగా తమ వద్ద ఉన్న గన్స్ ను బయటకు తీసి.. హత్య చేయటం.. అది కూడా సినిమాల్లో చూపించే మాదిరి ఎలాంటి హడావుడి లేకుండా.. చాలా ప్రొఫెషనల్స్ గా.. ప్రాణాలు తీయటమే లక్ష్యమన్నట్లుగా వ్యవహరించటం తెలిసిందే. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ వైరల్ గా మారింది. తీవ్రమైన షాక్ కు గురిచేసింది. రాష్ట్రీయ రాజ్ పుత్ కర్ణిసేన జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సుఖేదేవ్ సింగ్ గోగమేడి హత్యోదంతం రాజస్థాన్ ను కుదిపేసింది. ఆయన్ను హత్య చేసి పారిపోతున్న నిందితుల్లో ఒకరిని ఆయన భద్రతా సిబ్బంది కాల్పులు జరపగా చనిపోయాడు. మరో ఇద్దరు తప్పించుకు పారిపోయారు.

ఈ ఉదంతంతో రాజస్థాన్ వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏమవుతుందో అన్న భయాందోళనలు వ్యక్తమయ్యాయి. రాజధాని జైపూర్ తో పాటు.. రాజస్థాన్ వ్యాప్తంగా సున్నితమైన అన్ని ప్రాంతాల్లోనూ బలగాల్నిమొహరించారు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులో ఉందని.. ఎలాంటి హింసాత్మక సంఘటనలు చోటుచేసుకో లేదనిచెబుతున్నారు. సుఖేదేవ్ సింగ్ హత్య నేపథ్యంలో బుధవారం రాజస్థాన్ వ్యాప్తంగా బంద్ నిర్వహించారు. ఈ షాకింగ్ హత్య ఉదంతంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

1. సుఖ్ దేవ్ సింగ్ హత్య నేపథ్యంలో ఆయనకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ.. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన శ్యామ్ నగర్ పోలీసు సీఐను.. బీట్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిందితుల్ని 72 గంటల్లో అరెస్టు చేస్తామంటూ పోలీసు ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు.

2. సుఖ్ దేవ్ సింగ్ సతీమణి తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.కర్ణిసేన కార్యకర్తలను ఉద్దేశించి ఆమె ఒక పిలుపునిచ్చారు. ‘మీ సోదరి మిమ్మల్ని పిలుస్తోంది.మీరు బయటకు వచ్చి నాకు మద్దతు ఇవ్వండి.మీరంతా గురువారం గోగమేడికి చివరిసారిగా నివాళులు అర్పించాలని అభ్యర్థిస్తున్నారు’ అని కోరారు. ఈ నేపథ్యంలో శాంతిభద్రతల సమస్య ఏమైనా ఉత్పన్నమవుతుందా? అన్నది ప్రశ్నగా మారింది.

3. సుఖ్ దేవ్ సింగ్ భౌతికఖాయాన్నిప్రజల సందర్శనార్థం గురువారం ఉదయం 7 గంటల నుంచి జైపూర్ లోని రాజ్ పుత్ సభా భవన్ లో ఉంచుతారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో సుఖ్ దేవ్ సింగ్ స్వగ్రామం గోగమేడిలో అంత్యక్రియల్ని నిర్వహిస్తారు.

4. హత్యకు దారి తీసిన ఘటన మొత్తాన్ని హైకోర్టు రిటైర్డు జడ్జితో దర్యాప్తు చేస్తామని అధికారులు ప్రకటించటంతో.. సుఖేదేవ్ హత్యకునిరసనగా ఆందోళన చేస్తామని ప్రకటించిన కర్ణిసేన వెనక్కి తగ్గింది.

5. సుఖేదేవ్ సింగ్ హత్య కేసు విచారణ కోసం రాష్ట్ర డీజీపీ ఉమేశ్ మిశ్రా బుధవారం ఒక ప్రత్యేక సిట్ టీంను ఏర్పాటు చేశారు. నిందితుల్ని పట్టుకునేందుకు అవసరమైన సమాచారాన్ని ఇచ్చినవారికి రూ.5 లక్షల నగదు రివార్డుగా ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు. హత్యకు తానే బాధ్యత వహిస్తున్నట్లుగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు రోహిత్ తోదారా ప్రకటించటం తెలిసిందే.

Tags:    

Similar News