కవిత ఆడపడుచుకు షాకిచ్చిన ఈడీ
కవిత ఆడపడుచు అఖిల ఇంట్లో సోదాలు చేస్తున్నారు. భర్త అనిల్ బంధువుల ఇళ్లపైనా దాడులు కొనసాగిస్తున్నారు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ తో లిక్కర్ కుంభకోణంలో మలుపులు తిరుగుతున్నాయి. ఢిల్లీ సీఎం అరవింద కేజ్రీవాల్ అరెస్ట్ వల్ల కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. దాదాపు రూ.600 కోట్ల పైమాటే అవినీతి చోటు చేసుకున్నట్ల ప్రాథమిక అంచనాకు అధికారులు వస్తున్నారు. ఈనేపథ్యంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు సోదాలు జరపగా ఇప్పుడు తాజాగా కూడా తనిఖీలు చేపడుతున్నారు.
కవిత ఆడపడుచు అఖిల ఇంట్లో సోదాలు చేస్తున్నారు. భర్త అనిల్ బంధువుల ఇళ్లపైనా దాడులు కొనసాగిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో రోజురోజుకు కొత్త విషయాలు తెలుస్తున్నాయి. దీంతో ఈడీ అధికారులు దీన్ని చాలెంజ్ గా తీసుకుంటున్నారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి పిసోడియాను ఇప్పటికే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంపై సామాజిక కార్యకర్త అన్నా హజారే సైతం పెదవి విప్పారు. మద్యం విషయాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించినా వినకుండా ఇప్పుడు కేసుల్లో ఇరుక్కున్నారని తనదైన శైలిలో స్పందించారు.
కేసులో కవిత అరెస్ట్ నేపథ్యంలో ఆమె సుప్రీంకోర్టులో కేసు వేసినా దాన్ని లెక్కలోకి తీసుకోలేదు. రాజకీయ నాయకులైనా ఎవరైనా చట్టానికి అతీతులు కాదని స్పష్టం చేయడం గమనార్హం. కవిత భర్త అనిల్ కు కూడా నోటీసులు ఇచ్చినా అతడు విచారణకు హాజరు కాలేదు. దీంతో కోర్టు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.
మరోవైపు కవిత వ్యక్తిగత సహాయకులకు కూడా నోటీసులు అందజేసింది. దీంతో కేసు ఏ మలుపులు తిరుగుతుందోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లిక్కర్ స్కాం ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తోంది. రోజుకో తీరుగా ముందుకు వెళ్తోంది. కవిత కూడా ఇంతకుముందు నోటీసులకు స్పందించకపోవడంతోనే ఆమెను అరెస్ట్ చేయాల్సి వచ్చిందనే చెబుతున్నారు.
ఎమ్మెల్సీ కవితను వారం రోజుల కస్టడీకి ఈడీ అధికారులు తీసుకున్నారు. కోర్టులో విచారణ పూర్తయితే ఆమెకు ఏ శిక్ష పడుతుందో తెలియడం లేదు. కవిత, అనిల్ బంధువుల ఇళ్లల్లో సోదాలు జరిపి ఇంకా ఏవైనా ఆధారాలు దొరుకుతాయేమోనని చూస్తున్నారు. దీంతో కేసులో పురోగతి దొరుకుతుందని ఆశిస్తున్నారు. సోదాల తరువాత ఎలాంటి ఆధారాలు లభిస్తాయో వేచి చూడాల్సిందే.