మిగతా రోజులు సరే.. మన్మోహన్ సంతాప సభకూ అసెంబ్లీకి రాలేరా కేసీఆర్?
దాదాపు ఏడాదిన్నర పాటు కేంద్రంలో మంత్రి పదవిని నిర్వర్తించారు.
బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో 10 ఏళ్లు జాతీయ రాజకీయాల్లో ఉన్నారు. దాదాపు ఏడాదిన్నర పాటు కేంద్రంలో మంత్రి పదవిని నిర్వర్తించారు. అది కూడా కీలకమైన శాఖను చూశారు.
వరుసగా రెండు సార్లు ఎంపీగా ఎన్నికైన ఆయన పదేళ్లు కొనసాగారు. ఈ సమయంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. పైన చెప్పుకొన్న మూడు ఉదాహరణల్లో కేసీఆర్ 10 ఏళ్లు జాతీయ రాజకీయాల్లో ఉన్న సమయంలో ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్.
ఏడాదిన్నర పాటు కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన సమయంలో ప్రధానమంత్రిగా ఉన్నది డాక్టర్ మన్మోహన్ సింగ్.
మరి అలాంటి మన్మోహన్ సింగ్ మరణానికి సంతాపంగా తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైన సోమవారం కూడా కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది.
కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేత..
మిగతా సభ్యులు ఎవరైనా మన్మోహన్ కు నివాళిగా ఏర్పాటు చేసిన అసెంబ్లీకి గైర్హాజరైతే పెద్దగా పట్టించుకోనవసరం లేకపోయేది. కానీ, ఇప్పుడు ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. అందుకని కేసీఆర్ రాకపోవడమే విమర్శలకు కారణమవుతోంది. పైగా కేసీఆర్ ముఖ్యమంత్రి కావడానికి పరోక్ష కారణం మన్మోహన్ సింగ్. తెలంగాణ అనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పడకుంటే కేసీఆర్ అసలు సీఎం అయ్యేవారు కాదు కదా? అని విమర్శకులు అంటున్నారు.
ఒక్కరోజేనా?
కేసీఆర్ తెలంగాణ సీఎం పదవిలో దాదాపు పదేళ్లు ఉన్నారు. నిరుడు డిసెంబరులో ఓటమి అనంతరం పదవికి రాజీనామా చేశారు. గజ్వేల్ నుంచి ఎన్నికైన శాసన సభ్యుడిగా పదవీ ప్రమాణం చేసేందుకు మాత్రమే అసెంబ్లీకి హాజరయ్యారు. ప్రభుత్వాన్ని నిలదీస్తానని.. సమస్యలపై కడిగేస్తానని అసెంబ్లీ మీడియా గ్యాలరీలో మాట్లాడి వెళ్లిపోయారు. ఆ తర్వాత అసెంబ్లీకి రానేలేదు. ఆఖరికి మన్మోహన్ కు నివాళి సభకూ గైర్హాజరయ్యారు. మిగతా రోజులు సరే.. తాను ఎంతో దగ్గరుండి చూసిన, తెలంగాణ ఏర్పాటుకు కారణమైన మన్మోహన్ సంతాప సభకూ అసెంబ్లీకి రాలేరా కేసీఆర్? అని ప్రశ్నిస్తున్నారు.