అటెక్షన్ ఆల్.. కేసీఆర్ నోటి నుంచి తాజా వ్యాఖ్యలు విన్నారా?
పలువురు నాయకుల్ని ఎర్రవెల్లిలోని ఫాంహౌస్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై స్పందించారు.
సంచలన వ్యాఖ్యలు చేశారు గులాబీ బాస్ కేసీఆర్. త్వరలో ఉప ఎన్నికలు జరుగుతాయని జోస్యం చెప్పిన ఆయన.. సదరు ఎన్నికల్లో కడియం శ్రీహరి ఓడిపోతారని.. రాజయ్య ఎమ్మెల్యేగా గెలుస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తాజాగా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే రాజయ్యతో పాటు.. పలువురు నాయకుల్ని ఎర్రవెల్లిలోని ఫాంహౌస్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై స్పందించారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగటం ఖాయమన్న ఆయన.. ఆ ఎన్నికల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. తాము పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు.. తెలంగాణలోని వివిధ పార్టీల నుంచి ఎమ్మెల్యేలను ఫిరాయించేలా చేసిన వైనం తెలిసిందే. అప్పట్లో తమ చర్యల్ని సమర్థించుకున్న కేసీఆర్.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నారు. కేసీఆర్ చేసిన తాజా వ్యాఖ్యలు సీఎం రేవంత్ కు షాక్ కు గురి చేసేలా మారాయన్న మాట వినిపిస్తోంది.
ఫిరాయించిన పార్టీ ఎమ్మెల్యేలపై వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఇక్కడో విషయాన్ని ప్రస్తావించాలి. అధికారం లేనప్పుడు ఫిరాయింలంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న కేసీఆర్.. తాను ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రోత్సహించిన ఫిరాయింపుల మీద అత్యున్నత న్యాయస్థానం ఫోకస్ చేయాల్సి ఉంది. దాంతో ఇప్పుడు సంబంధం ఏం ఉందన్న ప్రశ్న కొందరు వేయొచ్చు.
మనిషి శరీరంలో ఏదైనా జబ్బును గుర్తిస్తే.. దాని మూలాల్లోకి వైద్యులు వెళ్లి.. అందుకు కారణాల్ని శోధించి.. మొత్తంగా వైద్యం చేసి శరీరానికి స్వస్థత చేకూరుస్తారు. సమాజానికి అవసరమైన న్యాయసహాయాన్ని అందించే సుప్రీంకోర్టు.. తాజా ఫిరాయింపులపై ఫోకస్ చేసిన వేళలో.. దానికి కారణం ఏమిటి? ఎన్నికల్లో ఒక పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలు మరో పార్టీలోకి ఎందుకు వెళ్లే ధైర్యం చేస్తున్నారు? పార్టీ మారే ప్రజాప్రతినిధిపై చర్యలు తీసుకున్నట్లే.. వారిని ప్రోత్సహించే రాజకీయ పార్టీలపై చర్యలు ఎందుకు తీసుకోకూడదన్నది ప్రశ్న.
అవినీతి కేసుల్లో లంచం అడిగే అధికారి బాధ్యుడు కావటంతో పాటు.. లంచాన్నిప్రోత్సహించే వారు సైతం బాధ్యత వహించాల్సి ఉన్నప్పుడు.. పార్టీ ఫిరాయింపుల విషయంలోనూ అదే సూత్రాన్ని ఎందుకు అనుసరించకూడదన్నది ప్రశ్న. తాను పవర్ లో ఉన్నప్పుడు ఒక నీతి.. పవర్ చేజారినప్పుడు మరో నీతిని వల్లించే కేసీఆర్ లాంటి వారు.. ఒకే విధానంపై నిలిచి ఉంటే.. ఇప్పుడీ పరిస్థితి వచ్చేదే కాదు.
ఒకవేళ.. అలాంటి పరిస్థితి ఎదురైతే.. ఎవరో ఫిర్యాదు చేస్తే స్పందించే కన్నా.. సుమోటోగా సుప్రీం ఎందుకు స్వీకరించకూడదు? దేశంలో ప్రజాస్వామ్యం ఒక చక్కటి పద్దతిలో ఉండేందుకు అత్యున్నత న్యాయస్థానం అంతో ఇంతో చొరవను ప్రదర్శిస్తే తప్పేంటి? ఇప్పుడు పార్టీ మారిన వారు తప్పు చేసినట్లుగా సుప్రీం చెప్పదలిస్తే.. ఆ సందర్భంలో కేసీఆర్ గతంలో ప్రోత్సహించిన పార్టీ ఫిరాయింపుల విషయాన్ని ప్రస్తావించి.. దానికి సంబంధించిన వివరణను కోరాల్సి ఉంది. అప్పుడు మాత్రమే రాజకీయ నేతలు మాత్రమే కాదు.. అధినేతలు సైతం కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించే వీలుంది.