కౌంటింగ్ వేళ అభ్యర్థులు, ఏజెంట్లకు కీలక సూచనలు కం హెచ్చరికలు!

ఈ సమయంలో అభ్యర్థులకు, ఏజెంట్లకు పలు కీలక సూచనలు చేశారు సీఈవో ఎంకే మీనా!

Update: 2024-05-30 14:02 GMT

ఏపీలో ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్దం అవుతోంది. జూన్ 4న ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. వాస్తవానికి మే 13న పోలింగ్ వేళ పలుప్రాంతాల్లో జరిగిన అవాంఛనీయ ఘటనలు ఏ స్థాయిలో వైరల్ అయ్యాయనేది తెలిసిన విషయమే. ఇక కౌంటింగ్ వేళ పరిస్థితిపైనా అందోళన వ్యక్తం అవుతుంది. ఈ సమయంలో అభ్యర్థులకు, ఏజెంట్లకు పలు కీలక సూచనలు చేశారు సీఈవో ఎంకే మీనా!

అవును... ఏపీలో పోలింగ్ వేళ జరిగిన అవాంఛనీయ ఘటనలు దృష్టిలో పెట్టుకునో ఏమో కానీ... కౌంటింగ్ రోజు ఎవరి ప్రవర్తన ఎలా ఉండాలనే విషయాలపై సీఈవో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... కౌంటింగ్ కేంద్రంలో అలజడులు సృష్టిస్తే అరెస్టు చేసి జైలుకు పంపుతామని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా హెచ్చరించారు.

ఇదే సమయంలో... అభ్యర్థి, ఏజెంట్‌ లలో ఎవరైనా కౌంటింగ్ సెంటర్లో గొడవ చేయాలని, అలజడులు సృష్టించాలని చూస్తే వారిని వెంటనే అక్కడి నుంచి బయటకు పంపిస్తామని మీనా తెలిపారు. కౌంటింగ్ పరిశరాల్లో ఎలాంటి ఊరేగింపులు చేయడానికి వీలులేదని తేల్చి చెప్పిన ఆయన... ఆరోజు మధ్యం షాపులు కూడా పూర్తిగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

కౌంటింగ్ సెంటర్ల భద్రత కోసం మూడంచెల వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పిన మీనా... కౌంటింగ్‌ రోజున అన్ని కౌంటింగ్‌ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ ఉంటుందని తెలిపారు. ఏజెంట్లు ఎవరైనా నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే బయటకు పంపించి వేస్తామని నొక్కి చెప్పారు. స్ట్రాంగ్‌ రూంల వద్ద సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు చేశామని చెప్పారు.

ఎంతమంది ఏజెంట్లను అనుమతిస్తారు?:

ఫలితాలు వెలువడే రోజు... నియోజకవర్గానికి ఒక కౌంటింగ్ హాల్‌ ను కేటాయిస్తారు. ఆ హాల్‌ లో ఎన్ని టేబుళ్లు ఏర్పాటు చేయాలనేది పూర్తిగా అధికారులే నిర్ణయిస్తారు. ఒక్కో అభ్యర్థి / పార్టీ.. టేబుల్‌ కు ఒకరి చొప్పున ఏజెంట్లను నియమించుకోవచ్చు. ఉదాహరణకు 14 టేబుళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తే ఒక అభ్యర్థి 14 మంది ఏజెంట్లను నియమించుకోవచ్చు.

వీరితోపాటు పోస్టల్ బ్యాలెట్ల పరిశీలనకు, రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద ఒక్కో ఏజెంట్ ను నియమించుకోవాల్సి ఉంటుంది. అయితే... వీరంతా కౌంటింగ్ గదిలో ఉండి ఓట్ల లెక్కింపును పర్యవేక్షించడం వరకే అనుమతి తప్ప... ఈవీఎం ల దగ్గరకు వెళ్లడం, వాటిని ఆపరేట్ చేయడం వంటి పనులను అనుమతి ఉండదు.

Tags:    

Similar News