నేతల మీద కోపంతో పార్టీని బొంద పెట్టొద్దు: రాజా సింగ్‌పై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఇటీవల కాలంలో రాజా సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే.;

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ''నేతలపై కోపంతో పార్టీని బొంద పెట్టొద్దు!'' అని పార్టీ కేడర్‌కు ఆయన సూచించారు. అంతేకాదు.. ''అవసరం, అవకాశం కోసం.. కొందరు నాయకు లు ఎదురు చూస్తున్నారు. వారి మాటలు నమ్మొద్దు. వారికి తగిన సమయంలో హైకమాండ్ దెబ్బ కొడుతుంది. మీరు చూస్తూ ఉండండి. నేను చెప్పేది నిజం'' అని పరోక్షంగా ఘోషామహల్ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ ను ఉద్దేశించి నాయకులకు హితవు పలికారు. ఇటీవల కాలంలో రాజా సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఆయన ఎవరినీ పేరు పెట్టి విమర్శించకపోయినా.. పరోక్షంగా చేస్తున్న వ్యాఖ్యలు విమర్శలను బట్టి.. కిషన్ రెడ్డిని రాజా సింగ్ టార్గెట్ చేసిన విషయం చర్చకు వచ్చింది. ఈ విషయాన్ని తాజాగా పరోక్షంగా ప్రస్తావించిన కిషన్ రెడ్డి.. నేతలపై కోపంతో పార్టీని బద్నాం చేయొద్దని, బొంద పెట్టద్దని అనడం గమనార్హం. హైదరాబాద్‌లోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి అధ్యక్షతన పదాధికారుల సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌కు రాజా సింగ్ సహా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మినహా.. ఇతర ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. వీరిని ఉద్దేశించి కిషన్ రెడ్డి ప్రసంగించారు.
ప్రస్తుతం బీజేపీకి అధికారంలోకి వచ్చేందుకు అన్నిఅవకాశాలు ఉన్నాయని కిషన్ రెడ్డి చెప్పారు. అయితే.. దీనికి గాను మరికొం త కష్టపడాల్సి ఉందని తేల్చి చెప్పారు. కానీ, కొందరు పార్టీని డైల్యూట్ చేసేలా వ్యాఖ్యలు చేస్తున్నారని.. నాయకుల మధ్య చి చ్చు పెట్టేలా వ్యవహరిస్తున్నారని.. వారి మాటలు నమ్మొద్దని ఆయన సూచించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రజలు విసిగిపో యారని కిషన్ రెడ్డిచెప్పారు. దీంతో ఎప్పుడు ఎన్నికలు వస్తే.. అప్పుడు బీజేపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఈ విషయాన్ని నాయకులు, కార్యకర్తలు మనసులో పెట్టుకుని పార్టీ కోసం పనిచేయాలన్నారు.
బీఆర్ ఎస్-కాంగ్రెస్ పార్టీ రెండూ ఒక్కటేనని, ఈ విషయం ప్రజలకు కూడా క్లారిటీ ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. దీనిని మరింతగా ప్రజల మధ్యకు తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. `` కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం చేయాలి. మనమంతా పోరాటా లకు సిద్ధం కావాలి. కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్‌పై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. దీనిని మనకు అనుకూలంగా మార్చుకోవాలి. పోరాటాల ద్వారా పార్టీని పటిష్టం చేసుకోవాలి. పెండింగ్‌లో ఉన్న కమిటీలను వెంటనే పూర్తి చేయాలి.`` అని నాయకులకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అయితే.. రాజాసింగ్‌పై పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు పార్టీలోనూ చర్చకు రావడం గమనార్హం.