ఆ బీఆర్ఎస్ నేతలు జైలుకే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తూ ఆయన ఈ కామెంట్స్ చేశారు. మాజీమంత్రులే లక్ష్యంగా ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన నేతలు జైలుకు వెళ్లాల్సిందేనంటూ ఒక్కసారిగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
రైతు భరోసా పథకాన్ని తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ఈ పథకాన్ని ప్రారంభించడంలో తమ ప్రభుత్వం నిబద్ధతతో ఉందని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. కానీ.. కేటీఆర్ మాత్రం దిగజారి అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సౌమ్యంగా ఉంటున్నారని, ఆ స్థానంలో కనుక తాను ఉండి ఉంటే క్షమించేవాడిని కాదంటూ ఘాటుగా స్పందించారు. తానైతే ఎప్పుడో జైల్లో వేసే వాడిని అని అన్నారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలకు దూరంగా ఉంటుందని, గతంలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పక్షపాత చర్యలకు పాల్పడిందని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షాలను పూర్తిగా కనుమరుగు చేసే కుట్రలకు తెరతీశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకుని ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కిందని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ కుటుంబంతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు రాష్ట్రాన్ని దోచుకున్నారని, వారికి ప్రజలే సమాధానం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.
రానున్న కాలంలో బీఆర్ఎస్ నేతలైన కేసీఆర్, కేటీఆర్‌తోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మాజీమంత్రి జగదీశ్వర్ రెడ్డి సైతం జైలుకు వెళ్లక తప్పదని రాజగోపాల్ రెడ్డి జోస్యం చెప్పారు. ప్రతిపక్షాలను పూర్తిగా కనుమరుగు చేసి.. అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్ అమలు చేసినట్లు కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా.. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.