ఆయనంటే నాకు మర్యాద లేదు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

కొండా సురేఖ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ మరోసారి రియాక్ట్ అయ్యారు. కందుకూరులో నిర్వహించిన రైతు ధర్నాలో కేటీఆర్ పాల్గొన్నారు

Update: 2024-10-05 10:38 GMT

కొండా సురేఖ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ మరోసారి రియాక్ట్ అయ్యారు. కందుకూరులో నిర్వహించిన రైతు ధర్నాలో కేటీఆర్ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘మంత్రి కొండా సురేఖ దిక్కుమాలిన ఆరోపణలు చేశారు. గబ్బు మాటలు మాట్లాడారు. ఇకపై నాపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు’ అని కేటీఆర్ హెచ్చరించారు. లక్ష యాబై వేల కోట్లు మూసీ కోసం ఖర్చు పెడుతున్నారని, డబ్బు మూటలు ఢిల్లీకి పంపేందుకు మూసీ సుందరీకరణ అంటున్నారని ఆరోపించారు.

ఎన్నికలకు ముందు కూడా రేవంత్ రెడ్డి ఆచరణకు సాధ్యం కాని అడ్డగోలు హామీలు ఇచ్చారని అన్నారు. అనుకోకుండా ముఖ్యమంత్రి కావడంతో ఇప్పుడు వాటిని అమలు చేయలేక పోతున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక.. ముఖ్యమంత్రిని సీటును కాపాడుకోలేక ఆయన ఆగమాగం అవుతున్నారని దుయ్యబట్టారు.

తనపై ముఖ్యమంత్రి, మంత్రులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. మోడీ లాంటి వారికే తాను భయపడలేదని, రేవంత్ రెడ్డి నాకు ఎంత అని ప్రశ్నించారు. ఇప్పటికే మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశానని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు. భారత ప్రధాని నరేంద్ర మోడీతోనే పోరాడామని, చిట్టినాయుడు ఎంత అని వ్యాఖ్యలు చేశారు.

హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూల్చుతున్నారని, తమ మీద కోపం ఉంటే తమ ఇండ్లు కూల్చండని సవాల్ చేశారు. అంతేకానీ.. పేదల జోలికి రావద్దని కోరారు. అలాగే.. తనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే మర్యాద లేదని చెప్పుకొచ్చారు. తమ నాయకులు సీఎం గారూ.. రేవంత్ గారూ అంటూ మర్యాదగా మాట్లాడారని.. కానీ తనకు మాత్రం ఆయనంటే అంత మర్యాద లేదన్నారు. మానం, సిగ్గు, శరం ఉన్నోళ్లకే మర్యాద ఇవ్వాలని, ఈయనకు అలాంటివి ఏవీ లేవని మండిపడ్డారు. ఈయన కూలగొట్టేవాడు చిట్టినాయుడు అంటూ సెటైర్లు వేశారు.

Tags:    

Similar News