టీటీడీ అధికారులతో చంద్రబాబు కీలక సమీక్ష... ఏమన్నారంటే!
ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తిరుమల ఆలయ పవిత్రత, నమ్మకం కాపాడేలా పనిచేయాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వులు కలిపారనే ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ వ్యవహారం ఏపీలో అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య తీవ్ర మాటల యుద్ధానికి దారితీసింది. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వులు కలిశాయనే దానిపై కూటమి ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. కాగా సుప్రీంకోర్టులో వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి, తదితరులు దాఖలైన వ్యాజ్యాలపై తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో విచారణకు ఆదేశించింది.
ఈ పరిణామాల వేళ తిరుమలలో సీఎం చంద్రబాబు సతీసమేతంగా పర్యటించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏడుకొండలవాడికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ధ్వజస్తంభానికి మొక్కిన సీఎం చంద్రబాబు ఆ తర్వాత స్వామిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తిరుమల ఆలయ పవిత్రత, నమ్మకం కాపాడేలా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో అ«ధికారులతో సమీక్ష నిర్వహించి వారికి పలు సూచనలు జారీ చేశారు.
కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రశాంతతకు ఎక్కడా భంగం కలగకూడదన్నారు. స్వామివారికి సంబంధించిన ఏ విషయంలోనూ రాజీ పడొద్దన్నారు. భవిష్యత్ నీటి అవసరాలకు ముందస్తు ప్రణాళిక చాలా అవసరమని తెలిపారు. అటవీ ప్రాంతాన్ని 72 నుంచి 80 శాతానికి పైగా పెంచాలన్నారు. అటవీ సంరక్షణ, అడవుల విస్తరణకు ప్రణాళికబద్ధంగాతో పని చేయాలని ఆదేశించారు.
తిరుమలలో ప్రసాదాల నాణ్యత ఎల్లప్పుడూ కొనసాగాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రసాదాల్లో నాణ్యత ఎప్పటికప్పుడు మరింత మెరుగపడాలని సూచించారు. తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలన్నారు. ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదన్నారు. ఎప్పుడూ ఆధ్మాత్మికత ఉట్టిపడేలా ఉండాలని సూచించారు. ఆర్భాటం, అనవసర వ్యయం చేయవద్దని చంద్రబాబు ఆదేశించారు.
ముఖ్యంగా సామాన్య భక్తుల పట్ల టీటీడీ సిబ్బంది గౌరవంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. దేశవిదేశాల స్వామి దర్శనానికి వస్తున్నవారిని గౌరవించాలని కోరారు. అలాగే శ్రీ వేంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్) సేవలు కూడా మెరుగుపడాలన్నారు.
కాగా జీవ వైవిధ్య పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను సీఎం అధికారులతో ఆరా తీశారు. టీటీడీ సేవలపై భక్తుల నుంచి స్పందన ఎలా తీసుకుంటున్నారో తెలుసుకున్నారు. ప్రతి భక్తుడు అభిప్రాయాలు చెప్పే అవకాశం ఉండాలన్నారు. భక్తుల ఫీడ్ బ్యాక్ ఆధారంగా టీటీడీ పనిచేయాలని ఆదేశించారు. ఒక్క టీటీడీలోనే కాకుండా అన్ని ఆలయాల్లో ఇది అనుసరించాలని ఆదేశాలు జారీ చేశారు.
కాగా తిరుమల పర్యటనలో రెండో రోజు సీఎం చంద్రబాబు అత్యాధునిక వకుళామాత సెంట్రలైజ్డ్ కిచెన్ ను ప్రారంభించారు.