నియోజకవర్గాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు సరికొత్త లెక్కలు!
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించని పార్టీగా టీడీపీ హామీ ఇస్తోందని, భవిష్యత్తులో అసెంబ్లీలో కూడా 33 శాతం మహిళలు ఉండేలా చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు.;
పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనపై పక్క రాష్ట్రాల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు సరికొత్త లెక్కలు తెరపైకి తెచ్చారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను పునర్విభజిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో లోక్ సభ సీట్లు, ఆ మేరకు అసెంబ్లీ సీట్లు తగ్గిపోతాయనే ఆందోళన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆందోళనలను కొట్టిపారేయడమే కాకుండా ఏపీ సీఎం చంద్రబాబు తనదైన విశ్లేషణతో కొత్త ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రస్తుతం అనుకుంటున్నట్లు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రాష్ట్రంలో మహిళా ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం పెరుగుతుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అసెంబ్లీలో ఈ రోజు మాట్లాడిన సీఎం చంద్రబాబు మహిళా సాధికారితపై తమ ప్రభుత్వ విధానాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పిస్తున్న పార్టీ కూడా టీడీపీయే నంటూ గుర్తు చేశారు. ఇక రానున్న కాలంలో మహిళా ఎమ్మెల్యేల సంఖ్య పెరగనుందని చెప్పిన సీఎం.. నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్ర అసెంబ్లీలో కనీసం 75 మంది మహిళా ఎమ్మెల్యేలు వస్తారన్నారు.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించని పార్టీగా టీడీపీ హామీ ఇస్తోందని, భవిష్యత్తులో అసెంబ్లీలో కూడా 33 శాతం మహిళలు ఉండేలా చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వంలో ఏ పనిచేసినా మహిళలను దృష్టిలో పెట్టుకునే పథకాలకు రూపకల్పన చేశామన్నారు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో హక్కును కల్పించారని గుర్తు చేశారు. తల్లికి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి గతంలో సీఎంగా ఉన్నారని జగన్ ను విమర్శించారు. ఇచ్చిన ఆస్తిని వెనక్కి తీసుకునేందుకు కోర్టుకు వెళ్లారని, ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తే, తల్లి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వలేదని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ తెలుగింటి ఆడపడుచుల పార్టీగా అభివర్ణించిన సీఎం చంద్రబాబు రాష్ట్రంలో డ్వాక్రా సంఘాల మద్దతుతో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తామని వెల్లడించారు.