మన దేశం పేరు ‘భారత్’.. అధికారికంగా పిలవాల్సిందే.. ఆర్ఎస్ఎస్ నేత

భరతుడు పాలించిన దేశం కాబట్టి భారతదేశం.. మన దేశం అధికారిక పేరు ఇదే అనేది సంప్రదాయవాదుల వాదన. హిందూస్థాన్ అని పిలవాలనేది మరికొందరి అభిప్రాయం.;

Update: 2025-03-12 14:30 GMT

భరతుడు పాలించిన దేశం కాబట్టి భారతదేశం.. మన దేశం అధికారిక పేరు ఇదే అనేది సంప్రదాయవాదుల వాదన. హిందూస్థాన్ అని పిలవాలనేది మరికొందరి అభిప్రాయం. కానీ, అందరికీ తెలిసింది మాత్రం ఇండియాగానే. విదేశాల్లోనే కాదు.. స్వదేశంలోనూ ఇండియన్స్ అనే పదమే బాగా పాపులర్. ఇక తెలుగువారయితే మనం భారతీయులం అని చెప్పుకొంటాం...

కాగా మన దేశం పేరును అధికారికంగానే భారత్‌ అని పిలవాలని చాలాకాలంగా వాదిస్తోంది ఆర్ఎస్‌ఎస్. ఇండియా దటీజ్‌ భారత్‌ అంటూ రాజ్యాంగంలో రాసి ఉందని.. భారత్‌ అంటే ఇండియా, ఇండియా అంటే భారత్‌ అన్నది సుస్పష్టం అని పేర్కొంటోంది. కేంద్ర సంస్థలు, అధికారిక కార్యక్రమాలు, ప్రభుత్వ పాలసీలపై ఇండియా గా పేర్కొనడాన్ని నిలదీస్తోంది.

మన దేశం పేరును భారత్‌ గా మార్చాలంటున్నారు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబలే. ఇది ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది. ఇండియా అంటే భారత్‌ అని రాజ్యాంగంలోని మొదటి పేజీలో రాసున్నదని.. ఇండియా అని ఇంగ్లిష్‌ వారు పిలుచుకుంటారని.. మనం భారత్‌ గానే పలకాలని అంటున్నారు.

అధికారికంగానే భారత్‌ అని ఉంటే.. కేంద్ర సంస్థ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పేరును కూడా భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ గా మార్చాలని అంటున్నారు. కాన్‌ స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇండియా పేరులోనూ భారత్‌ గా చేర్చాలని చెబుతున్నారు. మన దేశంలో కేవలం భారత్‌ అనే పిలవాలని.. ఇండియా అనే పదాన్ని మానాలని కోరుతున్నారు.

దాదాపు ఏడాదిన్నర కిందట ఢిల్లీలో ప్రతిష్ఠాత్మక జీ20 సదస్సు సందర్భంగానూ ఇండియా పదం బాగా చర్చనీయాంశమైంది. సదస్సు డిన్నర్‌ ఆహ్వానం పై ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌ అనే ప్రస్తావించిన సంగతిని దత్తాత్రేయ గుర్తుచేశారు.

కాగా దత్తాత్రేయ వ్యాఖ్యలపై జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ మన దేశానికి మూడు పేర్లు ఉన్నాయని.. అవి ఇండియా, భారత్‌, హిందూస్థాన్‌ అని పేర్కొన్నారు. ఎవరికి నచ్చిన పేరుతో వారు పిలుచుకోవచ్చని తెలిపారు. ఎయిర్‌ఫోర్స్‌, ఆర్మీ ముందు ఇండియన్ అని లేదా? అని ప్రశ్నించారు. సారేజహాసే అచ్చా.. హిందుస్థాన్‌ హమారా అని పాడడంలో ఏ సమస్య లేదన్నారు.

Tags:    

Similar News