కర్త, కర్మ, క్రియ అన్నీ విక్రాంత్ రెడ్డి.. లోగుట్టు విప్పేసిన విజయసాయిరెడ్డి?

కాకినాడ సీపోర్టు కేసులో సీఐడీ విచారణకు హాజరైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన విషయాలను వెల్లడించారు.;

Update: 2025-03-12 12:56 GMT

కాకినాడ సీపోర్టు కేసులో సీఐడీ విచారణకు హాజరైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన విషయాలను వెల్లడించారు. సీఐడీ తనను ఏం ప్రశ్నించింది? దానికి తన సమాధానం ఏం చెప్పిందీ కూడా మీడియాకు వివరించారు. కాకినాడ సీపోర్టు వాటాల బదిలీ వ్యవహారంలో తనకే పాపం తెలియదన్న విజయసాయిరెడ్డి.. ఈ విషయంలో కర్త, కర్మ, క్రియ అంతా వైసీపీ ఎంపీ వైవీ.సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి అని చెప్పారు. సీఐడీ విచారణలో విక్రాంత్ రెడ్డి పేరు చెప్పడంతో ఈ వ్యవహారంలై వైసీపీ అధినేత జగన్ కు విజయసాయిరెడ్డి షాకిచ్చినట్లైందని అంటున్నారు.

సీఐడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి సంచలన విషయాలు వెల్లడించారు. కాకినాడ సీపోర్టు వాటాలను కొనుగోలు చేసిన అరబిందో సంస్థ యజమానులతో తనకు కుటుంబ సంబంధాలే ఉన్నాయని, వ్యాపార సంబంధాలు, లావాదేవీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని వివరించారు. కాకినాడ సీపోర్టు వాటాల బదిలీ కేసులో ఓ సీనియర్ ఐఎఎస్ అధికారి తనను ఇరికించారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. కాకినాడ సీపోర్టు ఎండీ కేవీ రావుతో తనకు ఎలాంటి పరిచయం లేదని సీఐడీకి తెలిపానన్నారు.

అరబిందో నుంచి కేవీఆర్ కు బదిలీ అయిన మొత్తంపై సీఐడీ తనను ప్రశ్నించగా, తనకు ఆ విషయం తెలియదని చెప్పానన్నారు. ఈ కేసులో ఏ1 విక్రాంత్ రెడ్డితో పరిచయం ఉందా? అని సీఐడీ ప్రశ్నించిందని, అయితే వైవీ సుబ్బారెడ్డి కుమారుడిగా ఆయన తనకు తెలుసునని చెప్పారు. అదేవిధంగా ఈ కేసులో తనను ఎందుకు ఇరికించారని తాను కేవీరావును కామన్ ఫ్రెండ్స్ ద్వారా అడిగించానని, ఓ అధికారి ఆదేశాల వల్లే విజయసాయిరెడ్డి పేరు చేర్చామని చెప్పారన్నారు.

ఇక విక్రాంత్ రెడ్డిని తాను కేవీఆర్ కి పరిచయం చేయాల్సిన అవసరం లేదని విజయసాయిరెడ్డి చెప్పారు. విక్రాంత్ రెడ్డి తండ్రి సుబ్బారెడ్డి, కేవీ రావు మంచి స్నేహితులని, సుబ్బారెడ్డి ఎప్పుడు అమెరికా వెళ్లినా కేవీ రావుకు చెందిన రాజభవనంలోనే విడిది చేస్తారన్నారు. ఈ కేసులో కర్మ, కర్త, క్రియ అంతా విక్రాంత్ రెడ్డి అంటూ కేవీ రావు తన కామన్ ఫ్రెండ్స్ కు చెప్పారన్నారు విజయసాయిరెడ్డి. ఈ కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేకపోవడంతో తన సమాధానాలకు సీఐడీ సంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్పారు. మళ్లీ అవసరమైతే విచారణకు రమ్మని సీఐడీ చెప్పిందని, అయితే తనను మళ్లీ విచారించే అవసరం ఉండదని భావిస్తున్నట్లు విజయసాయిరెడ్డి చెప్పారు.

Tags:    

Similar News