ఇంకా మిగిలేవుంది.. వైసీపీకి విజయసాయిరెడ్డి వార్నింగ్!
కేసుల్లో ఇరికిస్తున్నారనే కారణంతోనే వైసీపీకి విజయసాయి రాజీనామా చేశారా?;
వైసీపీ మాజీ ఎంపీ, సీనియర్ నేత విజయసాయిరెడ్డి తన మాజీ బాస్ జగన్మోహనరెడ్డికి వార్నింగ్ ఇస్తున్నారా? అనే అనుమానం తలెత్తుతోంది. కాకినాడ సీపోర్టు కేసులో విచారణ ఎదుర్కొన్న విజయసాయిరెడ్డి.. లిక్కర్ స్కాం జరిగిందని చెప్పడమే కాకుండా, మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తానని చెప్పడం చూస్తే.. విజయసాయిరెడ్డికి ఏమైనా రహస్య వ్యూహం ఉందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాకినాడ కేసుతో తనకు సంబంధం లేదని చెప్పడం తనను తాను రక్షించుకోవడమైతే.. లిక్కర్ స్కాంలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పాత్ర ఉందని బయటపెట్టడం ఎలా చూడాలని ప్రశ్న ఎదురవుతోంది.
వైసీపీకి ఆ పార్టీ మాజీ నేత విజయసాయిరెడ్డి మధ్య రచ్చ ఎక్కువవుతోంది. పార్టీలో అవమానాలు ఎదురవడం వల్లే రాజకీయాల నుంచి వైదొలిగానని చెబుతున్న విజయసాయిరెడ్డి అధినేత జగన్ చుట్టూ ఉన్న కోటరీపై రగిలిపోతున్నట్లు చెబుతున్నారు. ఈ రోజు సీఐడీ విచారణ అనంతరం ఆయన చెప్పిన మాటలు పరిశీలిస్తే తన జోలికి ఎవరు వచ్చినా, అందరి జాతకాలు బయటపెడతాననే హెచ్చరికలు పంపినట్లు భావించాల్సివుందని అంటున్నారు.
వరుస కేసులు, స్కాంల్లో పేరు బయటకు వస్తుందనే భయంతోనే రాజకీయాల నుంచి వైదొలిగినట్లు తనపై జరుతున్న ప్రచారాన్ని విజయసాయిరెడ్డి కొట్టిపారేశారు. భయం అనేది తన బ్లడ్ లోనే లేదని, భక్తి అనేదే మాత్రమే ఉండేదని చెప్పారు. ఇంతకు ముందు తమ నాయకుడు జగన్ అంటే భక్తి ఉండేదని, కానీ ఇప్పుడు కేవలం కలియుగ దైవం వెంకటేశ్వరుడిపై మాత్రమే భక్తి వుందన్నారు. తనకు వైసీపీలో ఎన్నో పదవులిచ్చారని, అంతకుమించి అవమానాలు ఎదుర్కొన్నానని వివరించారు. విజయసాయిరెడ్డి మాటలు పరిశీలిస్తే.. భవిష్యత్తులో ఎదురవబోయే పరిణామాలకు ఆయన ప్రిపేర్ అయినట్లే ఉందని అంటున్నారు.
కేసుల్లో ఇరికిస్తున్నారనే కారణంతోనే వైసీపీకి విజయసాయి రాజీనామా చేశారా?
గత ప్రభుత్వంలో తన పాత్ర ఏమీ లేకపోయినా, అన్ని విషయాల్లో తనను ఇరికించే కుట్ర చేస్తున్నారని విజయసాయి అనుమానిస్తున్నారని చెబుతున్నారు. అందుకే తనపై కుట్ర జరుగుతోందని చెప్పడానికి గతంలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారుల పేర్లు ప్రస్తావిస్తున్నారని చెబుతున్నారు. తనను గతంలో నిర్లక్ష్యం చేసినందుకు ఇప్పుడు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదనే సంకేతాలు ఆయన పంపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. లిక్కర్ స్కాంపై మీడియా ప్రశ్నిస్తే తనకు సంబంధం లేదనో.. విచారణ జరుగుతుందనో చెప్పవచ్చని, కానీ, నేరుగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంతా చేశారని చెప్పడం చూస్తే వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలనే ఉద్దేశమే కనిపిస్తోందని అంటున్నారు.
మాజీ సీఎం జగన్ తో అత్యంత సన్నిహితంగా మెలిగిన తనను ఆయనకు దూరం చేశారని పార్టీలోని కొందరు పెద్దలపై విజయసాయిరెడ్డి రగిలిపోతున్నారని అంటున్నారు. అధికారంలోకి వచ్చేవరకు తనను ఉపయోగించుకుని, చేతికి అధికారం వచ్చాక తనను సైడ్ చేయడాన్ని విజయసాయిరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. అదేసమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ తనను A2 చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆయన అంటున్నారు. అధికారం అనుభవించింది ఒకరైతే కేసులు తాను ఎదుర్కోవాలా? అవమానాలు తాను భరించాలా? అంటూ విజయసాయిరెడ్డి ఎదురు తిరుగుతున్నట్లు చెబుతున్నారు. అందుకే తొలిసారిగా జగన్ పైనా ఆయన విమర్శలు ఎక్కుపెట్టారంటున్నారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యల్లో కాస్త బెదిరింపు ధోరణి కూడా ఉండటం చూస్తే ఆయనపై నమోదైన కేసుల్లో అప్రూవర్ గా మారిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని అంటున్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డి ఇచ్చిన ట్విస్టుతో వైసీపీ ఎలా బయటపడుతుందో చూడాల్సివుంది.