జగన్ కోటరీ రహస్యం చెప్పిన విజయసాయి !
జగన్ ఆ కోటరీ మాటలు వింటూ పార్టీకి దూరంగా ఉంటున్నారని కూడా ప్రచారం సాగింది.;
వైసీపీలో ఏమి జరుగుతోంది అన్నది నిన్నటి దాకా ఒక ప్రచారం. ఎవరికి తోచినట్లుగా వారు రాసుకునే వారు. వైసీపీలో అధినేతకు పార్టీ నేతలకు మధ్య ఒక బలమైన కోటరీ ఉందని దానిని దాటుకుని జగన్ ని కలవడం కష్టమని వార్తలు వచ్చేవి. జగన్ ఆ కోటరీ మాటలు వింటూ పార్టీకి దూరంగా ఉంటున్నారని కూడా ప్రచారం సాగింది.
అయితే ఆ ప్రచారంలో ఎంతో నిజం ఉందని విజయసాయిరెడ్డి చెబుతున్నారు. తాను వైసీపీలో కోటరీకి బలి అయిపోయాను అని ఆయన అతి పెద్ద బాంబు పేల్చారు. జగన్ మనసులో తనకు స్థానం లేకుండా కోటరీ నేతలు చేశారని ఆయన అన్నారు. నా మనసు విరిగిపోయింది అని ఆయన అన్నారు.
జగన్ తనకు ఎన్నో పదవులు ఇచ్చారని తాను కూడా చిత్తశుద్ధితో పార్టీ కోసం పనిచేశాను అని ఆయన చెప్పారు. అయితే జగన్ తన చుట్టూ ఉన్న వారి మాటను విని తనను అవమానించారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీలో గత మూడున్నరేళ్ళుగా తాను అనేక అవమానాలు ఎదుర్కోన్నాను అని ఆయన చెప్పారు.
తనకు జగన్ మధ్య దూరం పెంచిన కోటరీ నేతలూ ఒక్కో మెట్టూ ఎక్కుతూంటే తాను ఒక్కో మెట్టూ దిగుతూ వచ్చాను అని విజయసాయిరెడ్డి అన్నారు. తాను వైఎస్సార్ కుటుంబంలో మూడు తరాలుగా పనిచేశాను అని అన్నారు. అయితే తనకు ఆత్మాభిమానం అన్నది అతి ముఖ్యమని అన్నారు.
అందుకే తాను వైసీపీ కి దూరం అయ్యాను అని అన్నారు. భార్యాభర్తలే ఈ రోజు విడిపోతున్నారని అందువల్ల ఈ బంధాలు ఏపాటివి అని కూడా ఆయన అన్నారు. ఒకనాడు జగన్ అన్న నాయకుడిని ఎంతో భక్తిగా ఆరాధించాను అని ఇపుడు తిరుమల వెంకటేశ్వరుడిని ఆరాధిస్తున్నాను అని అన్నారు.
జగన్ కి భవిష్యత్తు ఉండాలీ అంటే ఈ కోటరీకి దూరంగా ఉండాలని విజయసాయిరెడ్డి సూచించారు. కోటరీ బయట జరిగే ఏ విషయాలను జగన్ కి చేరవేయదని ఆ విధంగా బయట ఏమి జరుగుతుందో జగన్ కి తెలియకుండా పోయిందని అన్నారు. నాయకుడు అన్న వారు చెప్పుడు మాటలు వినరాదని అన్నారు. దాని వల్ల ఆయనకే కాదు పార్టీకి ప్రజలకు కూడా నష్టమని అన్నారు.
జగన్ అయిదేళ్ళ పాటు సీఎం గా పనిచేశారని భవిష్యత్తులో కూడా ప్రజలకు సేవ చేయాలని అనుకుంటే ఆయనలో మార్పు రావాలని కోరారు. కోటరీని దూరం పెట్టి జనం మధ్యకు రావాలని కోరారు. పార్టీతో నాయకుడికి గ్యాప్ అన్నది ఉండరాదని సూచించారు.
తాను వైసీపీలో తిరిగి చేరే ప్రసక్తి లేదని విజయసాయిరెడ్డి అన్నారు. తాను జగన్ కోసం చేసినంత చేశానని ఆయనకు అన్నీ చెప్పే పార్టీ నుంచి బయటకు వచ్చాను అన్నారు. కోటరీ గురించి కూడా జగన్ లండన్ లో ఉంటే ఆయనకు అన్నీ వివరించాను అని చెప్పారు.
ఇక భవిష్యత్తులో తాను మళ్ళీ వైసీపీలో చేరేది లేదని స్పష్టం చేశారు. ఘర్ వాపసీ అన్నది తనకు వర్తించదని అన్నారు. కాగా తాను బీజేపీలో చేరుతున్నట్లుగా గవర్నర్ పదవి తనకు దక్కుతుంది అన్నది కూడా తనకు తెలియదని అంతా మీడియా రాతలే అని అన్నారు. ఈ రోజు దాకా తాను ఏ పార్టీతోనూ మాట్లాడలేదని ఆయన చెప్పారు. మొత్తానికి చూస్తే వైసీపీ నుంచి ఎందుకు బయటకు రావాల్సి వచ్చిందో పూర్తిగా వివరించిన విజయసాయిరెడ్డి జగన్ కోటరీలో చిక్కుకుని ఉన్నారని వైసీపీ కోట రహస్యం పూర్తిగా చెప్పేశారు. మరి దీని మీద వైసీపీ రియాక్షన్ ఎలా ఉంటుందో.