ఐసీసీ.. ఇండియన్ క్రికెట్ బోర్డు.. వెస్టిండీస్ దిగ్గజం తీవ్ర ఆరోపణలు

అయితే, తాజాగా వెస్టిండీస్ దిగ్గజం అండీ రాబర్ట్స్ టీమ్ ఇండియానే కాకుండా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)ని తీవ్రంగా విమర్శిస్తున్నాడు.;

Update: 2025-03-12 19:30 GMT

చాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియా మ్యాచ్ లు మొత్తం దుబాయ్ లో నిర్వహించడంపై విమర్శలు ఆగడం లేదు.. ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా మన జట్టు చాంపియన్ గా నిలిచినా.. భారత్ కు అది తటస్థ వేదిక అయినా.. జట్టు జట్టంతా సమష్టిగా రాణించినా.. ‘దుబాయ్’ లో మాత్రమే ఆడడం అనే నింద వేయడం మాత్రం పోవడం లేదు.

చాంపియన్స్ ట్రోఫీ జరుగుతుండగానే టీమ్ ఇండియా గురించి ఇలాంటి అవాకులు చవాకులు పేలారు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు నాసిర్ హుస్సేన్, మైక్ అథర్టన్. వీరికి ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కూడా గొంతు కలిపినా తర్వాత అతడు తన మాటలను వెనక్కుతీసుకున్నాడు.

అయితే, విమర్శలకు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత శర్మ దీటుగానే సమాధానం ఇచ్చాడు. దుబాయ్ అనేది తమ సొంత గడ్డ కూడా కాదని చురకేశాడు. అయితే, తాజాగా వెస్టిండీస్ దిగ్గజం అండీ రాబర్ట్స్ టీమ్ ఇండియానే కాకుండా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)ని తీవ్రంగా విమర్శిస్తున్నాడు.

ఐసీసీ అంటే ఇండియన్ క్రికెట్ బోర్డు అని రాబర్ట్స్ ధ్వజమెత్తాడు. అన్ని నిర్ణయాలు భారత్ కు అనుకూలంగా తీసుకుంటోందని ఐసీసీపై మండిపడ్డాడు. చాంపియన్స్ ట్రోఫీలో ఇండియా మ్యాచ్ లన్నీ ఒకే వేదిక మీద నిర్వహించడాన్ని ప్రశ్నించాడు.

కాగా జూన్ లో కరీబియన్ దీవులు ఆతిథ్యం ఇచ్చిన టి20 ప్రపంచ కప్ లోనూ ఇలానే భారత్ పట్ల ప్రత్యేకత చూపారని కరీబియన్ దీవులకే చెందిన అండీ రాబర్ట్స్ ఆరోపించాడు. తాము ఆడబోయే సెమీ ఫైనల్ వేదిక టీమ్ ఇండియాకు ముందే తెలిసిపోయిందని పేర్కొన్నాడు.

నో బాల్స్ వద్దంటే వద్దు..

ఐసీసీ తీరును చూసే తాను ఇండియన్ క్రికెట్ బోర్డు అని విమర్శిస్తున్నట్లు అండీ రాబర్ట్స్ చెప్పాడు. ఒకవేళ క్రికెట్ లో నోబాల్స్, వైడ్లు వద్దని గనుక భారత్ కోరితే ఐసీసీ ఆ మేరకు నిర్ణయం తీసుకుంటుందని కూడా ఎద్దేవా చేశాడు.

74 ఏళ్ల అండీ రాబర్ట్స్ కరీబియన్ దీవుల్లోని అంటిగ్వాకు చెందినవాడు. వెస్టిండీస్ దిగ్గజ పేస్ బౌలర్లలో ఒకడు. 47 టెస్టుల్లోనే 202 వికెట్లు తీశాడు. మాల్కం మార్షల్, జోయల్ గార్నర్ లతో కూడిన 1970ల నాటి వెస్టిండీస్ అరివీర భయంకర పేస్ బౌలింగ్ దళంలో అండీ రాబర్ట్స్ ఒకడు.

కొసమెరుపు: ఐసీసీలో ఒకప్పుడు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా బోర్డుల ఆధిపత్యం నడిచేది. దానిని ఇండియా కూలగొట్టింది.

Tags:    

Similar News