పంచె కట్టులో తలా.. ఆట మొదలెట్టేశాడు.. ఐపీఎల్ టీమ్ ఫుల్ ఖుష్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఎన్నో జట్ల ఉండొచ్చు.. కానీ, ఆ ఫ్రాంచైజీకి ఉన్న ఫాలోయింగే వేరు.. సొంత రాష్ట్రం అభిమానులే కాదు.. ఇతర ప్రాంతాల వారూ జట్టంటే అమితమైన ప్రేమ చూపిస్తారు..;
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఎన్నో జట్ల ఉండొచ్చు.. కానీ, ఆ ఫ్రాంచైజీకి ఉన్న ఫాలోయింగే వేరు.. సొంత రాష్ట్రం అభిమానులే కాదు.. ఇతర ప్రాంతాల వారూ జట్టంటే అమితమైన ప్రేమ చూపిస్తారు.. ఆ జట్టు ఎక్కడ ఆడితే అక్కడ స్టేడియాన్ని పసుపుమయం చేసేస్తారు.. ఇక ఆ జట్టు కూడా అంతే.. అభిమానుల ఆశలను ఏమాత్రం వమ్ము చేయదు.. ఇప్పటికే ఐదుసార్లు టైటిల్ కొట్టింది.. 18వ ఎడిషన్ లో టైటిల్ సాధించే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది.
పైన చెప్పుకొన్నదంతా ఏ జట్టు గురించో అందరూ ఊహించే ఉంటారు. ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) గురించి. ఈ ఫ్రాంచైజీకి ఇంత ఆదరణ రావడానికి ప్రధాన కారణం భారత క్రికెట్ దిగ్గజం, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.
2008లో మొదలైన ఐపీఎల్ లో ప్రస్తుతం కొనసాగుతూ తొలి నుంచి ఒకటే ఫ్రాంచైజీకి ఆడినది ఇద్దరే ఇద్దరు. ఒకరు ధోనీ కాగా రెండో ఆటగాడు విరాట్ కోహ్లి. కాగా, ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగి ఇప్పటికే ఆరేళ్లు అవుతోంది. గత సీజన్ తోనే ఐపీఎల్ కూ వీడ్కోలు చెబుతాడని భావించారు. అయితే, అప్పటికి నిర్ణయం ప్రకటించలేదు. ఈ ఏడాది మాత్రం లీగ్ ముగిసే సరికి ధోనీ రిటైర్ కావడం ఖాయం అంటున్నారు.
ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ కోసం పదిరోజుల కిందటే చెన్నై చేరుకున్న ధోనీ తాజాగా తన ప్రాక్టీస్ మొదలుపెట్టేశాడు. ఈ మేరకు తలా (నాయకుడు) జట్టుతో చేరాడని సీఎస్కే మేనేజ్ మెంట్ ప్రకటించింది. ఈ మేరకు తమిళ సంప్రదాయ పంచెకట్టుతో ఉన్న ధోనీ ఫొటోను షేర్ చేసింది. దీంతో సీఎస్కే అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
వాస్తవానికి ధోనీ రెండేళ్ల కిందటే సీఎస్కే కెప్టెన్సీ వదిలేశాడు. బ్యాట్స్ మన్ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ చేస్తున్నాడు. కానీ, ఇప్పటికీ చెన్నైకి అనధికారిక కెప్టెన్ ధోనీనే. అదీ అతడి పాపులారిటీ.