భారత్‌ పాలిట తేనె పూసిన కత్తి న్యూజిలాండ్‌.. కసి తీరే మరో చాన్స్‌!

సరిగ్గా 25 ఏళ్ల కిందట 2000 సంవత్సరంలో కెన్యాలో చాంపియన్స్‌ ట్రోఫీ.. అప్పటికి ఇంకా టి20లు రాలేదు.. చాంపియన్స్‌ ట్రోఫీలో టీమ్‌ ఇండియా అదరగొట్టింది.;

Update: 2025-03-06 07:00 GMT

పాతికేళ్ల తర్వాత ప్రమాదకర ప్రత్యర్థితో చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ ఆడబోతోంది టీమ్‌ ఇండియా...! అంతేకాదు తేనె పూసిన కత్తిలాంటి జట్టుతో టైటిల్‌ కోసం తలపడనుంది..! ఈ మాట చెప్పడానికి చాలా ఉదాహరణలున్నాయి. ఆస్ట్రేలియాతో తలపడుతుంటే భారత జట్టుదే విజయం అని చెప్పొచ్చు.. పాకిస్థాన్‌ పై మనకు తిరుగులేదని చెప్పొచ్చు.. దక్షిణాఫ్రికానూ సమర్థంగా ఎదుర్కొని ప్రపంచ కప్‌ గెలిచాం.. కానీ, న్యూజిలాండ్‌ తో ఐసీసీ టోర్నీల్లో మ్యాచ్‌ అంటే మాత్రం కాస్త ఆలోచించాల్సిందే.

సరిగ్గా 25 ఏళ్ల కిందట 2000 సంవత్సరంలో కెన్యాలో చాంపియన్స్‌ ట్రోఫీ.. అప్పటికి ఇంకా టి20లు రాలేదు.. చాంపియన్స్‌ ట్రోఫీలో టీమ్‌ ఇండియా అదరగొట్టింది. ఫైనల్‌ చేరింది. అటువైపు ప్రత్యర్థి న్యూజిలాండ్‌. దీంతో మనదే కప్‌ అని ఒకింత ధీమా. దీనికితగ్గట్లే ఓపెనర్లు కెప్టెన్‌ గంగూలీ (117) అద్భుత సెంచరీ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (69) అద్భుత ప్రారంభంతో భారత్ 264 పరుగుల భారీ స్కోరు (ఆ రోజుల్లో) సాధించింది. ఛేదనలో భారత బౌలర్లు అనిల్ కుంబ్లే (2/55), వెంకటేశ్ ప్రసాద్ (3/27) ధాటికి న్యూజిలాండ్ 132 పరుగలకే 5 వికెట్లు కోల్పోయింది. మరో 130 పైగా పరుగులు చేయాల్సిన స్థితిలో టీమ్ ఇండియాదే కప్ అనుకున్నారు. కానీ, ఆల్ రౌండర్ల క్రిస్ కెయిన్స్ (102 నాటౌట్), క్రిస్ హారిస్ (46) అద్భుతంగా ఆడి భారత్ కు కప్ ను దూరం చేశారు.

ఇంగ్లండ్ లో జరిగిన 2019 వన్డే ప్రపంచ కప్ లో భారత్ అద్భుతంగా ఆడుతూ సెమీఫైనల్ కు చేరుకుంది. చాలా పటిష్ఠంగా కనిపిస్తున్న మన జట్టును ఓడించడం కష్టం అనిపించింది. వర్షం పడిన ఇంగ్లండ్ వాతావరణంలో కివీస్ 239 పరుగుల టార్గెట్ విధించగా భారత్ ఛేదించేస్తుంది అనిపించింది. కానీ, రోహిత్, రాహుల్, కోహ్లిలను 1 పరుగుకే ఔట్ చేశారు. ధోనీ (50), రవీంద్ర జడేజా (77) ఎంతగా పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ మ్యాచ్ లో 49వ ఓవర్లో ధోనీని రనౌట్ చేసిన న్యూజిలాండ్ అతడి కెరీర్ కు పరోక్షంగా ముగింపు పలికింది.

2019-21 ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ సైకిల్ ఫైనల్లోనూ టీమ్ ఇండియాను న్యూజిలాండ్ దెబ్బకొట్టింది. 2021 మార్చి 6న జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో నెగ్గింది. వాస్తవానికి టెస్టుల్లో న్యూజిలాండ్ అంత బలమైనది కాదు. పైగా టెస్టు చాంపియన్ షిప్ జరిగింది లండన్ లో. అయినా, భారత్ ను ఓడించి మరో షాకిచ్చింది.

చరిత్రలో ఎరుగని విధంగా..

భారత్ లో భారత్ ను టెస్టుల్లో ఓడించడం చాలా కష్టం. మన గడ్డపై విదేశీ జట్లు ఒక్క టెస్టు నెగ్గితే అదే పదివేలు. న్యూజిలాండ్ కు అయితే అసలు అసాధ్యం అనే చెప్పాలి. కానీ, నిరుడు అక్టోబరు –నవంబరులో టీమ్ ఇండియాను సొంతగడ్డపై 0-3తో ఓడించి చరిత్రలో ఎరుగని పరాభవాన్ని రుచి చూపించింది. మూడున్నర దశాబ్దాల తర్వాత టెస్టు మ్యాచ్ నెగ్గడమే కాదు.. చరిత్రలో ఏకంగా భారత్ ను స్వదేశంలో క్లీన్ స్వీప్ చేసిన జట్టుగానూ న్యూజిలాండ్ రికార్డుల్లోకి ఎక్కింది.

ఈ ఉదాహరణలు అన్నీ బట్టి చూస్తే న్యూజిలాండ్ ఎంతటి ప్రమాదకారినో అని తెలిసిపోతుంది. అందుకనే ఆ జట్టుతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ ఐసీసీ టోర్నీల్లో..

మెరుపు ఫీల్డింగ్.. మంచి పేసర్లు.. మేటి స్పిన్నర్లు.. ఆల్ రౌండర్లు న్యూజిలాండ్ బలం. ఇప్పుడు దానికి బలమైన బ్యాటింగ్ కూడా తోడైంది. అందుకనే భారత్.. బహు పరాక్..

Tags:    

Similar News