ఐపీఎల్-25 సస్పెన్స్.. తెలుగోళ్ల ఆ ఒక్క ఫ్రాంచైజీకి కెప్టెన్ ఎవరబ్బా?
అలాంటి జట్టు ఈ ఏడాది కొత్త కెప్టెన్ తో బరిలో దిగి లక్ పరీక్షించుకోనుంది. కానీ, ఇంతకూ ఆ కెప్టెన్ ఎవరనేదే తేలడం లేదు.;
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఇప్పటివరకు టైటిల్ కొట్టని జట్టు అది.. వీరేంద్ర సెహ్వాగ్ నుంచి రిషభ్ పంత్ వరకు విధ్వంసక ఆటగాళ్లు కెప్టెన్లుగా చేసినా కప్ ను ముద్దాడని జట్టు అది.. కొన్నాళ్లుగా మెరుగైన ప్రదర్శనే చేస్తున్నా.. చాంపియన్ అనే అర్హతను మాత్రం చేరుకోలేకపోతోంది. అలాంటి జట్టు ఈ ఏడాది కొత్త కెప్టెన్ తో బరిలో దిగి లక్ పరీక్షించుకోనుంది. కానీ, ఇంతకూ ఆ కెప్టెన్ ఎవరనేదే తేలడం లేదు.
పేరు మారినా రాత మారలేదు
ఢిల్లీ క్యాపిటల్స్.. దేశ రాజధాని ఢిల్లీ పేరిట ఉన్న ఐపీఎల్ ఫ్రాంచైజీ. ఢిల్లీ డేర్ డెవిల్స్ పేరిట 2008 నుంచి 2018 వరకు కొనసాగిన ఈ జట్టుకు 2019లో పేరు మార్చారు. ఈ తరం క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ వంటి ఆటగాళ్లు సారథులుగా పనిచేశారు. రోడ్డు ప్రమాదం అనంతరం పంత్ కోలుకుని వచ్చి గత ఏడాది సీజన్ లో కెప్టెన్సీ చేశాడు. అలాంటివాడిని ఢిల్లీ రిటైన్ చేసుకోలేదు. మెగా వేలంలోనూ దక్కించుకోలేదు. పంత్ ను రూ.27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ తీసుకుంది. కెప్టెన్ గానూ ప్రకటించింది.
ఐపీఎల్ లోని పది జట్లలో తెలుగువారి భాగస్వామ్యం ఉన్నది ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్కటే. ఇందులో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గ్రంథి మల్లికార్జున రావుకు చెందిన జీఎంఆర్ గ్రూప్ భాగస్వామి. ఇక 18 రోజుల్లో ప్రారంభం కానున్న కొత్త సీజన్ లో ఢిల్లీని నడిపించేది ఎవరనేది ఇంకా తేలలేదు.
ఇటీవల రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ కెప్టెన్ గా రజత్ పటీదార్ ను ప్రకటించింది. తాజాగా అజింక్య రహానేను సారథిగా నియమించింది కోల్ కతా నైట్ రైడర్స్. ఇక ఢిల్లీకి మాత్రమే కెప్టెన్ ఎవరో తేలాల్సి ఉంది.
టీమ్ ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్, నిరుటి వరకు లక్నో సూపర్ జెయింట్స్ కు ఆడిన కేఎల్ రాహుల్ లేదా స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అయ్యే చాన్సున్నట్లు తెలుస్తోంది.