18 రోజుల్లో 18వ ఎడిషన్..ఐపీఎల్ చాంపియన్ కోల్ కతాకు కొత్త కెప్టెన్
కోల్ కతా నైట్ రైడర్స్ డిఫెండింగ్ చాంపియన్ గా బరిలో దిగుతున్న ఈ టోర్నీలో ఆ జట్టుకు ఇంతవరకు కెప్టెన్ ఎవరు అనేది సందిగ్ధంగా మారింది.;
ధనాధన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు మరెంతో సమయం లేదు.. మరొక్క 18 రోజుల్లో 18వ ఎడిషన్ స్టార్ట్ కానుంది. ఈ సారి ఎన్నో మార్పులు.. మరెన్నో ఆసక్తికర అంశాలతో లీగ్ జనరంజకంగా సాగడం ఖాయం. కోల్ కతా నైట్ రైడర్స్ డిఫెండింగ్ చాంపియన్ గా బరిలో దిగుతున్న ఈ టోర్నీలో ఆ జట్టుకు ఇంతవరకు కెప్టెన్ ఎవరు అనేది సందిగ్ధంగా మారింది.
గత సీజన్ విజేత కోల్ కతా తమ కెప్టెన్ గా అనూహ్య ఎంపిక చేసింది. టీమ్ ఇండియాకు ఓ దశలో కెప్టెన్ స్థాయికి ఎదిగినా ఫామ్ కోల్పోయి టెస్టు జట్టుకు దూరమైన ముంబై బ్యాటర్ అజింక్య రహానేను సారథిగా ఎంచుకుంది. ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ ను వైస్ కెప్టెన్ గా ప్రకటించింది.
కొత్త సీజన్ కు కొత్త జెర్సీతో రానున్న కోల్ కతా కెప్టెన్ గా రహానే ఎంపిక ఆశ్చర్యమే.. టి20 ఫార్మాట్ లో అంతగా రాణించని అతడిని ఏకంగా సారథిగా ప్రకటించడం అంటే మరే చాయిస్ లేకనే అనుకోవాలి. కాగా, కోల్ కతాకు గత ఏడాది కెప్టెన్ గా టైటిల్ అందించిన టీమ్ ఇండియా స్టార్ శ్రేయస్ అయ్యర్ ను రిటైన్ చేసుకోలేదు. మెగా వేలంలోనూ తీసుకోలేదు. వెంకటేశ్ అయ్యర్ కు మాత్రం భారీ మొత్తం వెచ్చించింది. 36 ఏళ్ల వెటరన్ రహానెను తీసుకుంది.
కోల్ కతా మూడుసార్లు టైటిల్ కొట్టింది. తాజాగా సోమవారం ఆవిష్కరించిన కొత్త జెర్సీలో మూడు స్టార్లు ఉన్నాయి. వారు గెలిచిన మూడు టైటిళ్లకు బెంగాలీలో కర్బో, లోర్బో, జీత్బో అని పేరు పెట్టింది. వాటికి ప్రదర్శన, పోరాటం, గెలుపు అని తెలుగు అర్థం.
కొసమెరుపు: అజింక్య రహానే 2011లో టీమ్ ఇండియాకు ఎంపికయ్యాడు. అతడు తొలి మ్యాచ్ ఇంగ్లండ్ పై టి20. వన్డేల్లో వరుసగా ఆరు హాఫ్ సెంచరీలు చేశాడు. టెస్టుల్లో కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. విదేశాల్లో టెస్టుల్లో అద్భుతంగా రాణించాడు. కానీ, అనుకున్నంత ఫేమ్ రాలేదు. టి20లకు పనికిరాడని పక్కనపెట్టారు. ఇప్పుడు అతడే ఐపీఎల్ లో ఓ ఫ్రాంచైజీకి కెప్టెన్ అయ్యాడు. తాను టీమ్ ఇండియాలోకి తిరిగొస్తానని ఇటీవల ప్రకటించాడు. మరిప్పుడు ఐపీఎల్ తో దానిని సాకారం చేసుకుంటాడా?