మీకు జీతాలు మా దయే. ఇంకా ఏడుపెందుకు? ఇంగ్లండ్ పై గవాస్కర్ చెడుగుడు

ఫామ్ లో లేని బ్యాట్స్ మెన్ తో బరిలో దిగి.. పదును లేని పేసర్లను నమ్ముకుని ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో లీగ్ దశలోనే వెనుదిరిగింది ఇంగ్లండ్.

Update: 2025-03-01 11:52 GMT

ఫామ్ లో లేని బ్యాట్స్ మెన్ తో బరిలో దిగి.. పదును లేని పేసర్లను నమ్ముకుని ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో లీగ్ దశలోనే వెనుదిరిగింది ఇంగ్లండ్. ఈ పరాజయాన్ని ఒప్పుకోకుండా.. భారత జట్టుపై ఏడుపు అందుకున్నారు ఆ దేశ మాజీ క్రికెటర్లు. ఇప్పటికే సెమీస్ కు చేరిందన్న అక్కసుతో టీమ్ ఇండియా గురించి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు నాజర్ హుస్సేన్, మైక్ అథర్టన్ అవాకాలు చెవాకులు పేలుతున్నారు.

భద్రతా కారణాల రీత్యా పాకిస్థాన్ లో పర్యటించేందుకు టీమ్ ఇండియాకు కేంద్ర ప్రభుత్వం అనుమతివ్వలేదు. దీంతో భారత్‌ ఆడే మ్యాచ్ లన్నీ దుబాయ్‌ లో ఏర్పాటు చేశారు. వాస్తవానికి పాకిస్థాన్ పిచ్ లు బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్నాయి. దుబాయ్ పిచ్ కాస్త మందకొడిగా కనిపిస్తోంది. అయితే, ఇంగ్లండ్ టీమ్ పాకిస్థాన్ లోనే విఫలమైంది. టీమ్ ఇండియా మాత్రం దుబాయ్ లోనూ నెగ్గింది. ఇదేమీ పట్టించుకోకుండా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు తమ కడుపులోని కక్షను బయటపెట్టుకుంటున్నారు.

ఒకే ప్రదేశంలో ఉంటూ మ్యాచ్‌ లు ఆడటం భారత్‌ కు ప్రయోజనకరంగా మారిందంటూ ఇంగ్లండ్ మాజీలు విమర్శలు చేస్తున్నారు. దీంతో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కు చిర్రెత్తింది. ఇలాంటి కామెంట్ల కంటే సొంత జట్టు ప్రదర్శనపై దృష్టిసారిస్తే బాగుంటుందంటూ ఇంగ్లండ్ కు హితవు పలికాడు.

ఆస్ట్రేలియాపై 350 పరుగుల భారీ స్కోరు చేసినా, అఫ్ఘాన్ పై 325 పరుగుల టార్గెట్ ను ఛేదించలేక ఇంగ్లండ్ పరాజయం పాలైంది. చాంపియన్స్ ట్రోఫీ సెమీస్ కు చేరే చాన్స్ కోల్పోయింది. అందుకని ఈ బాధను వేరే జట్లపై నెట్టేందుకు ప్రయత్నించడం సరికాదని గావస్కర్ మండిపడ్డాడు.

‘‘తొలుత జట్టు లోపాలపై దృష్టిసారించండి. నేను చెప్పే విషయాలను అర్థం చేసుకొనే తెలివి వారికి (హుస్సేన్, అథర్టన్) ఉందనుకుంటున్నా. ఇంగ్లండ్ ఎందుకు అర్హత సాధించలేదో దానిగురించి సమాలోచనలు చేయండి. భారత జట్టుపై ఫోకస్‌ పెట్టొద్దు. మీ జట్టు ఆటగాళ్లు ఈ ఫలితాన్ని జీర్ణించుకోలేని స్థితిలో ఉన్నారు. అంచనాలను అందుకోవడంలో విఫలమైనట్లు అనిపిస్తోంది. ఫలితాలపై విశ్లేషణ చేసుకోండి. జట్టును మళ్లీ గాడిలో పెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోండి’’ అంటూ ఇంగ్లండ్ కు హితవు పలికాడు గవాస్కర్.

దేశం కోసం ఆడేటప్పుడు బాధ్యత కూడా చాలా ఎక్కువగా ఉంటుందని గ్రహించాలని ఇంగ్లండ్ క్రికెటర్లకు హితోపదేశం చేశాడు. అంతేకానీ, భారత్‌ మీద పడి ఏడవడం ఎందుకని నిందించాడు. అంతర్జాతీయ క్రికెట్‌ కు భారత్‌ అందించే సేవలు అద్భుతం అని.. టాలెంట్‌ పరంగానే కాకుండా ఆర్థికంగానూ వెన్నుదన్నుగా నిలుస్తోందని అన్నాడు. టెలివిజన్‌, మీడియా హక్కుల ద్వారా భారీగా ఆదాయం సమకూరుతోంది. వారికి దక్కుతోన్న జీతాలు కూడా పరోక్షంగా భారత్‌ వల్లేనని అర్థం చేసుకోవాలి’’ అని గావస్కర్ నిప్పులు చెరిగాడు.

Tags:    

Similar News