ఆఫ్ఘాన్ కు ఆవగింజంత అదృష్టం లేదా?

ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ - ఏ లో భారత్, న్యూజిలాండ్ లు ఇప్పటికే సెమీస్ కు చేరిన సంగతి తెలిసిందే.;

Update: 2025-03-01 03:37 GMT

రంగం ఏదైనప్పటికీ గుమ్మడి కాయంత టాలెంట్ ఉంటే సరిపోదు.. ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలని అంటుంటారు పెద్దలు! ప్రస్తుతం ఈ విషయం ఛాంపియన్స్ ట్రోఫీలో ఫుల్ ఫామ్ లో కనిపించిన ఆఫ్ఘాన్ టీమ్ కు కరెక్ట్ గా వర్తిస్తుందా అనే చర్చ తెరపైకి వచ్చింది. వరుణుడి రూపంలో వారిని దురదృష్టం వెంటాడింది.. ఫలితంగా ఆసిస్ సెమీస్ కు చేరింది.

అవును... ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ కు షాకిచ్చి, మాంచి ఊపులో కనిపించిన ఆఫ్ఘనిస్థాన్.. ఆస్ట్రేలియాను దెబ్బ కొట్టాలని చూసింది! ఈ సమయంలో.. క్రికెట్ లో ఏదైనా సాధ్యమే కాబట్టి.. మరో అద్భుతం జరుగుతుందా అనే ఆసక్తి క్రికెట్ ప్రపంచంలో నెలకొంది. అయితే... వర్షం వల్ల ఆసిస్ తో మ్యాచ్ రద్దు కావడంతో ఆఫ్ఘాన్ దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే!

ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ - ఏ లో భారత్, న్యూజిలాండ్ లు ఇప్పటికే సెమీస్ కు చేరిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో... గ్రూప్ - బీ లోనూ తొలి సెమీస్ బెర్త్ కన్ఫాం అయ్యింది. ఈ విషయంలో టీమ్స్ పెర్ఫార్మెన్స్ కంటే వరుణుడి పెర్ఫార్మెన్స్ కీలకంగా మారడం గమనార్హం. ఇప్పటికే ఫిబ్రవరి 25న ఆసిస్ - సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ టాస్ పడకుండా రద్దైన సంగతి తెలిసిందే.

దీంతో... పాక్ క్రికెట్ బోర్డ్ పై పలువురు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. కొద్ది వర్షానికే నీరు ఔట్ ఫీల్డ్ లో చేరడం, గ్రౌండ్ ను వెంటనే ఆటకు అనువుగా మార్చే స్థితి లేకపోవడంతో మ్యాచ్ లు రద్దవుతున్నాయి. తాజాగా ఆసిస్ – ఆఫ్ఘాన్ మధ్య మ్యాచ్ లో కేవలం 30 నిమిషాలే వర్షం పడటంతో ఔట్ ఫీల్డ్ అంతా చిత్తడిగా మారింది. దీంతో.. మ్యాచ్ ను రద్దు చేశారు అంపైర్లు.

దీనిపై.. ఆఫ్ఘాన్ క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు, ఇతర దేశాల క్రికెట్ అభిమానులు మండి పడుతున్నారు. పాక్ క్రికెట్ బోర్డును దుయ్యబడుతున్నారు. సమీప భవిష్యత్తులో పాక్ కు ఎలాంటి ఐసీసీ ఆతిథ్య హక్కులు ఇవ్వొద్దని డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క.. ఆతిథ్య పాకిస్థాన్ టీమ్ ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే!

కాగా... శుక్రవారం జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘాన్.. 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. ఆఫ్ఘాన్ బ్యాటర్స్ లో సెదిఖుల్లా (85), అజ్మతుల్లా (67) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇది కచ్చితంగా బ్యాడ్ టోటల్ అయితే కాదనేది నిపుణుల మాటగా ఉంది! అనంతరం ఆసిస్ 12.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది. వర్షం వల్ల మ్యాచ్ రద్దయ్యింది.

దీంతో... ఆసిస్ 4 పాయింట్లు, ఆఫ్ఘాన్ 3 పాయింట్లతో లీగ్ దశను ముగించాయి. ఇప్పటికే లీగ్ దశనుంచి నిష్క్రమించిన ఇంగ్లాండ్ తో శనివారం సౌతాఫ్రికా తలపడనుంది. ఇప్పటికే 3 పాయింట్లతో ఉన్న సఫారీ జట్టు ఈ మ్యాచ్ గెలిచినా, రద్దైనా ముందజ వేస్తుంది. కారణం.. ఆఫ్ఘాన్ నెట్ రన్ రేట్ (-0.990)కంటే.. సౌతాఫ్రికా నెట్ రన్ రేట్ (+2.140) మెరుగ్గా ఉంది.

ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో సౌతాఫ్రికా ఛేంజింగ్ లో 207 పరుగుల తేడాతో ఓటమి పాలైతేనే ఆఫ్ఘాన్ సెమీస్ కు అర్హత సాధిస్తుంది. ఇది దాదాపు అసాధ్యం అనే చెప్పాలి! దీంతో... ఆఫ్ఘాన్ కు ఆవగింజంత అదృష్టం కూడా లేదు అని కొంతమంది అంటుంటే.. పాక్ బోర్డుపై ఆ దేశ క్రికెట్ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు.

Tags:    

Similar News