చాంపియన్స్ ట్రోఫీ స్టేడియం టు హోటల్.. పాక్ పోలీస్ జంప్..సర్కారు వేటు

పదేళ్ల తర్వాత 2019లో దశలవారీగా పాక్ లో అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభమైంది. ఇప్పుడు అది చాంపియన్స్ ట్రోఫీ వరకు వచ్చింది. దీనిని విజయవంతంగా నిర్వహించి.. తమ దేశ భద్రతా ప్రమాణాలను ప్రపంచానికి చాటాలని పాక్ భావిస్తోంది.

Update: 2025-02-26 20:30 GMT

2009 మార్చి 3.. లాహోర్‌ లో శ్రీలంక క్రికెట్ జట్టు బస్సుపై గడాఫీ స్టేడియం సమీపంలోని లిబర్టీ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద 12 మంది ఉగ్రవాదులు దాడి చేశారు. అసాల్ట్ రైఫిళ్లు, గ్రెనేడ్‌లు, రాకెట్ లాంచర్లతో దాడికి పాల్పడ్డారు. శ్రీలంక ఆటగాళ్లు కుమార సంగక్కర, అజంతా మెండిస్, తిలన్ సమరవీర, తరంగ పరణవితన, సురంగ లక్మల్, తిలిన తుషార గాయపడ్డారు. ఆరుగురు పోలీసులు, డ్రైవర్ సహా ఎనిమిది మంది మరణించారు.

ఈ ఘటన ప్రపంచ క్రికెట్ లో పాకిస్థాన్ ను ఒంటరి చేసింది. అంతర్జాతీయ జట్లు పాక్ లో ఆడేందుకు రాబోమని చెప్పేశాయి. దీంతో పాకిస్థాన్ హోం మ్యాచ్‌ లు యూఏఈలో నిర్వహించాల్సి వచ్చింది. పదేళ్ల తర్వాత 2019లో దశలవారీగా పాక్ లో అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభమైంది. ఇప్పుడు అది చాంపియన్స్ ట్రోఫీ వరకు వచ్చింది. దీనిని విజయవంతంగా నిర్వహించి.. తమ దేశ భద్రతా ప్రమాణాలను ప్రపంచానికి చాటాలని పాక్ భావిస్తోంది.

కానీ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అనుకున్నది ఒకటైతే.. అనూహ్యంగా మరోటి జరిగింది. 2009లో లంక క్రికెటర్లపై దాడి జరిగిన లాహోర్ లోనే భద్రతా లోపం వెలుగుచూసింది. ఇప్పటికే సెమీఫైనల్స్ కు దూరమైన పాక్ కు ఇదో పెద్ద తలనొప్పిగా మారింది.

చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా భద్రతా విధులు నిర్వర్తించేందుకు పంజాబ్‌ ప్రావిన్స్ పోలీసులు కొందరు నిరాకరించారట. దీంతో వందమందికిపైగా పోలీసులపై ప్రభుత్వం వేటు వేసింది. వీరంతా పోలీసు దళంలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్నవారేనని సమాచారం. పలుసార్లు వీరు విధులకు హాజరుకాలేదని తేలింది.

లాహోర్‌ గడాఫీ స్టేడియం నుంచి జట్లు బస చేసే హోటళ్ల దాక ఆటగాళ్ల కోసం కేటాయించిన భద్రతా సిబ్బందిలో కొందరు హాజరుకాలేదట. వీరు బాధ్యతలను నిర్వర్తించేందుకు తిరస్కరించినట్లు తేలింది. దీంతో వారిపై వేటు పడింది.

అయితే, పోలీసులు సుదీర్ఘ పని గంటలతో ఒత్తిడికి గురవుతున్నారని.. దీంతో విధులకు డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. పాకిస్థాన్ జట్టు సెమీ ఫైనల్ కు చేరకపోవడంతో కూడా వారు విధుల పట్ల నిరాసక్తత ప్రదర్శించడానికి కారణమైందట.

Tags:    

Similar News