డైరెక్టర్ కావాలని.. 26 ఏళ్లకు క్రికెటర్..కంగారూలపై ఇక 'వరుణా'స్త్రం

వరుణ్ చక్రవర్తి.. ఇప్పుడు భారత క్రికెట్ లో మార్మోగుతున్న పేరు. 33 ఏళ్ల వరుణ్ నాలుగైదేళ్ల కిందటి వరకు ఎవరికీ పెద్దగా తెలియదు.;

Update: 2025-03-03 13:30 GMT

26 ఏళ్లు.. ఓ సగటు క్రికెటర్ కు కెరీర్ అప్పటికే సగం ప్రారంభమై ఉంటుంది.. రంజీల్లో తలపండిపోతారు.. ఇంకా క్రికెట్ ఆడుతున్నవారికి అయితే తన ప్రయాణం ఏమిటో తెలిసిపోతుంది.. కానీ, 26 ఏళ్లకు ఓ యువకుడు క్రికెటర్ అయ్యాడు.. 32 ఏళ్ల వయసులో జాతీయ జట్టులోకి వచ్చాడు 33 ఏళ్ల వయసులో వన్డేల్లోకీ వచ్చేశాడు.. ఇపుడు అతడు ప్రత్యర్థులను ముంచేసే ‘వరుణా’స్త్రంగా మారాడు.

వరుణ్ చక్రవర్తి.. ఇప్పుడు భారత క్రికెట్ లో మార్మోగుతున్న పేరు. 33 ఏళ్ల వరుణ్ నాలుగైదేళ్ల కిందటి వరకు ఎవరికీ పెద్దగా తెలియదు. 2018లో మాత్రమే అతడు దేశవాళీ క్రికెట్ ఆడడం మొదలుపెట్టాడు. అప్పటికి 26 ఏళ్ల వరుణ్.. 2019లో ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ కు తొలిసారిగా ఆడాడు.

2020 సీజన్ నుంచి కోల్ కతా నైట్ రైడర్స్ కు ఆడుతూ వెలుగులోకి వచ్చాడు. ఆ జట్టులోని వెస్టిండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ సహచర్యంతో వరుణ్ మరింత రాటుదేలాడు. ఇటీవల ఇంగ్లండ్ తో ముగిసిన టి20, వన్డే సిరీస్ చివరి మ్యాచ్ లో రాణించాడు. ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ తో చివరి లీగ్ మ్యాచ్ లో 5 వికెట్లతో అదరగొట్టాడు.

వరుణ్ మిస్టరీ స్పిన్నర్. అతడు బంతిని సంధించే విధానాన్ని పసిగట్టడం అంత తేలిక కాదు. చేతి నుంచి వదిలిందే ఆలస్యం.. సర్రున లోపలికి దూసుకొచ్చే ఆ బంతిని ఆడడం అసాధ్యం అనిపిస్తుంది. ఐపీఎల్ లో కోల్ కతా నిరుడు చాంపియన్ గా నిలవడంలో వరుణ్ ది కీలక పాత్ర.

ఆలస్యం వచ్చినా..

32 ఏళ్ల వయసులో గత ఏడాది టీమ్ ఇండియాలోకి వచ్చిన వరుణ్ ఇప్పుడు రెగ్యులర్ సభ్యుడు కానున్నాడు. మరీ ముఖ్యంగా దుబాయ్ లో చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ను వరుణ్ ముప్పుతిప్పలు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

కొసమెరపు: 33 ఏళ్ల వరుణ్ 26 ఏళ్లకు దేశవాళీల్లోకి వచ్చాడని చెప్పుకొన్నాం కదా..? అతడి అసలు లక్ష్యం క్రికెటర్ కదాట.. మొదట్లో ఆర్కిటెక్ట్ లేదా సినిమా డైరెక్టర్ కావాలని కలలు కన్నాడట. తెలంగాణ సరిహద్దులో కర్ణాటకలోని బీదర్ లో పుట్టిన వరుణ్ దేశవాళీల్లో తమిళనాడుకు ఆడుతుంటాడు. భారత్ కు ఇప్పటివరకు 18 టి20లు, 2 వన్డేల్లో ఆడాడు.

Tags:    

Similar News