జట్టూ పాయె.. ఫైనలూ పాయె.. డిఫెండింగ్ చాంప్ పాక్ కు ఏం ఖర్మ రా ఇది?
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టోర్నీ అయిన క్రికెట్ చాంపియన్స్ ట్రోఫీ డిఫెండింగ్ చాంపియన్ ఎవరు..?;
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టోర్నీ అయిన క్రికెట్ చాంపియన్స్ ట్రోఫీ డిఫెండింగ్ చాంపియన్ ఎవరు..? ఈ మాటకు వెంటనే సమాధానం చెప్పడం కష్టమేనేమో? చివరగా 2017లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న జట్టు పాకిస్థాన్. అప్పుడు గెలిచినది కూడా చిరకాల ప్రత్యర్థి భారత్ పై.
ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్నది ఎక్కడ..? అందరూ చెప్పే సమాధానం పాకిస్థాన్. టీమ్ ఇండియా మ్యాచ్ లు మాత్రం దుబాయ్ లో నిర్వహిస్తున్నారు. అంటే.. డిఫెండింగ్ చాంపియన్ పాకిస్థాన్ లో చాంపియన్స్ ట్రోఫీ జరుగతోంది అన్నమాట.
కానీ, పరిస్థితి ఏమిటి? చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఏ డిఫెండింగ్ చాంపియన్ కూడా ఎదుర్కొనని రీతిలో ఒక్క విజయమూ లేకుండా టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత్, న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయినా.. బంగ్లాదేశ్ పైన అయినా గెలుస్తుందని భావిస్తే, వర్షంతో ఆ మ్యాచ్ రద్దయింది.
మరోవైపు ఇప్పుడు టీమ్ ఇండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ చేరడంతో ఇంకో పాయింట్ బయటకు వచ్చింది. దీంతో పాకిస్థాన్ పై మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
టీమ్ ఇండియా ఎలాగూ పాకిస్థాన్ కు వెళ్లనందున మ్యాచ్ లన్నీ దుబాయ్ లోనే జరుగుతున్న సంగతి తెలిసిందే. సెమీ ఫైనల్, ఫైనల్ కూడా అక్కడే నిర్వహించనున్నారు. అంటే.. మన జట్టు సెమీస్, ఫైనల్ చేరితే ఈ మ్యాచ్ లూ దుబాయ్ లోనే జరుగుతాయి.
దీంతో కనీసం సెమీస్ కూ చేరని డిఫెండింగ్ చాంపియన్ పాకిస్థాన్, ఆ దేశ క్రికెట్ బోర్డు పీసీబీని సోషల్ మీడియాలో ఓ ఆటాడుకుంటున్నారు. టీమ్ ఇండియా కాకుండా.. మరే జట్లు ఫైనల్ చేరినా ఈ మ్యాచ్ లు లాహోర్ లోని గడాఫీ మైదానంలో జరిగేవి. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య బుధవారం గడాఫీ స్టేడియంలోనే రెండో సెమీఫైనల్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు దుబాయ్ లో భారత్ తో ఫైనల్ ఆడనుంది.
పాక్ పై సోషల్ మీడియా సెటైర్లు కొన్ని..
చాంపియన్స్ ట్రోఫీ పాక్ లో జరుగుతోంది. కానీ, ఆ దేశం టోర్నీలో లేదు. ఇప్పుడు భారత్ టైటిల్ పోరుకు సిద్ధమైంది. కానీ, ఫైనల్ పాక్ లో జరగదు.
-పాకిస్థాన్ ను ట్రోఫీ నుంచి పంపాం. ఆ జట్టు స్పిన్నర్ అబ్రార్ హావభావాలు వారికే అతికినట్లు సరిపోతాయి. ఇప్పుడు ఆ దేశం ఫైనల్ కూడా జరగకుండా లాహోర్ ను నాకౌట్ చేశాం
-దుబాయ్ లో భారత్ అత్యుత్తమంగా ఆడి పాక్ ను ఓడించింది. పాక్ అత్యుత్తమ మైదానాల్లో వర్షం కారణంగా మూడు మ్యాచ్ లు జరగలేదు. సెమీ ఫైనలే కాదు.. ఫైనల్ కూడా లాహోర్ నుంచి దుబాయ్ కు పోయింది.
-కేఎల్ రాహుల్ సిక్స్ తో చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ వేదిక మారిపోయింది. ఫిబ్రవరి 23న పాక్ పోయింది. రెండుసార్లూ విరాట్ కోహ్లినే కింగ్.