చాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ సంచలన నిర్ణయం?
చాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ చేరిన టీమ్ ఇండియాను విజయ పథంలో నిలిపిన తర్వాత రోహిత్ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.;
ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్ మాజీ అయ్యాడు.. పాకిస్థాన్ వన్డే కెప్టెన్ రిజ్వాన్ ను పక్కనపెట్టారు.. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ రిటైర్ అయ్యాడు.. ఇక చాంపియన్స్ ట్రోఫీ ముగిసే సరికి మరో కెప్టెన్ కూడా వెళ్లిపోనున్నాడు. అతడే టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ. చాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ చేరిన టీమ్ ఇండియాను విజయ పథంలో నిలిపిన తర్వాత రోహిత్ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
టి20 ప్రపంచ కప్ తర్వాత రోహిత్ పొట్టి ఫార్మాట్ కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ తరంలో మేటి బ్యాట్స్ మన్ అయిన రోహిత్ వన్డేలకూ రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే ఊహాగానాలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. కానీ, చాంపియన్స్ ట్రోఫీలోనూ అతడే కెప్టెన్ గా ఉన్నాడు. ఈ ట్రోఫీ ముగిసేసరికి మాత్రం రోహిత్ నిర్ణయం తీసుకుంటాడని అంటున్నారు.
చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత రోహిత్ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. దీనికితగ్గట్లే సెంట్రల్ కాంట్రాక్ట్ లలో మార్పులు చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే, రోహిత్ వన్డే కెప్టెన్సీకి మాత్రమే రిటైర్మెంట్ ఇస్తాడని.. ఫిట్ నెస్ ఉన్నంతకాలం ఆటగాడిగా కొనసాగుతాడని తెలుస్తోంది. అందుకనే భవిష్యత్తు ప్లాన్ ఏమిటో చెప్పాలని అతడిని కోరారట.
రిటైర్మెంట్ రోహిత్ నిర్ణయం అని.. కానీ, కెప్టెన్సీని కొనసాగించాలనే చర్చా జరుగుతోందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. అయితే, 2027లో ఆస్ట్రేలియాలో జరిగే వన్డే ప్రపంచ కప్ కోసం జట్టును సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. అప్పటికి రోహిత్ కు దాదాపు 40 ఏళ్లు వస్తాయి. జట్టులో చోటు కష్టమే. అంటే.. అసలు ఫ్యూచర్ ప్లాన్ లోనూ లేనట్లే. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా వన్డేలకు కొనసాగడం కష్టమే. కాబట్టి ఇప్పటినుంచే జట్టును తయారు చేసుకోవాలి.
ఈ పరిస్థితిని రోహిత్ అర్థం చేసుకున్నాడని.. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత అతడి నిర్ణయం కోసం బోర్డు వెయిట్ చేస్తోందని తెలుస్తోంది. ఒకవేళ రిటైర్ అయితే ఏం చేయాలనేది బోర్డు ఆలోచించనుంది. దీనికితగ్గట్లే సెంట్రల్ కాంట్రాక్ట్ ల విషయంలోనూ మార్పులు చేయొచ్చు. రోహిత్, కోహ్లి వంటి టాప్ ప్లేయర్లకు ఏ+ గ్రేడ్ ఇస్తున్నారు. రోహిత్ రిటైర్ అయితే ఇందులో మార్పులు చేయాల్సి ఉంటుంది.
టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్ గానూ ఉన్న రోహిత్ ను ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ చివరి మ్యాచ్ నుంచి తప్పించారు. అతడు టెస్టుల్లో కొనసాగడం కష్టమే. వచ్చే జూన్ లో ఇంగ్లండ్ తో సిరీస్ కు రోహిత్ ను ఎంపిక చేయడమూ కష్టమే.