టోర్నీ వారిదే.. ప్రజంటేషన్ కూ దూరం.. పాక్ కు ఏడుపే తక్కువ..
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మోసిన్ నక్వీ కూడా చాంపియన్స్ ట్రోఫీ ప్రజంటేషన్ కు రాలేదు. కారణం.. ఆయన పార్లమెంటు సమావేశాలకు హాజరు కావాల్సి ఉండడమేనట.;
దాదాపు 30 ఏళ్ల తర్వాత స్వదేశంలో ఒక ఐసీసీ టోర్నీ నిర్వహించామన్న సంతోషం లేదు.. తమ దేశంలో ఇక ఏ జట్టయినా పర్యటించవచ్చు.. అన్న ఉత్సాహమూ లేదు.. పాకిస్థాన్ జట్టుకు మిగిలిందంతా కేవలం ఒక ఏడుపే.. తాజాగా ముగిసిన చాంపియన్స్ ట్రోఫీ ప్రజంటేషన్ కు ఆతిథ్య దేశం అయినప్పటికీ ఆ దేశం నుంచి ఒక్క ప్రతినిధి కూడా వెళ్లింది లేదు. దీన్నంతటినీ చూసి అసలు పాకిస్థాన్ చాంపియన్స్ ట్రోఫీని హోస్ట్ చేసిందా లేదా? అనే సందేహం వ్యక్తం అవుతోంది.
భారత్ విజేతగా నిలిచిన చాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ మ్యాచ్, ప్రజంటేషన్ కూడా దుబాయ్ లోనే జరిగిన సంగతి తెలిసిందే. అయితే, అధికారికంగా టోర్నీ పాకిస్థాన్ లోనే జరిగినందున ఆ దేశం నుంచి ప్రైజ్ ప్రజంటేషన్ కు ఎవరో ఒకరు రావాలి. కానీ, ఆతిథ్య పాక్ నుంచి ఏ ఒక్క ప్రతినిధి కూడా కనిపించలేదు. దీంతో విస్మయం వ్యక్తమవుతోంది.
సహజంగా ఏదైనా పెద్ద టోర్నీ జరిగితే అది ఆ దేశానికి గర్వకారణం. ప్రపంచ కప్ లాంటి వాటి ముగింపునకు అయితే దేశ ఆధ్యక్షులు హాజరవుతుంటారు. కానీ, చాంపియన్స్ ట్రోఫీ ప్రజంటేషన్ కు మాత్రం పాకిస్థాన్ ప్రతినిధులు వ్యక్తిగత కారణాలతో గైర్హాజరైనట్లు సమాచారం.
బోర్డు చైర్మన్ కూ వీలులేదా?
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మోసిన్ నక్వీ కూడా చాంపియన్స్ ట్రోఫీ ప్రజంటేషన్ కు రాలేదు. కారణం.. ఆయన పార్లమెంటు సమావేశాలకు హాజరు కావాల్సి ఉండడమేనట. ఇంకా విచిత్రం ఏమంటే పీసీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుమైర్ అహ్మద్ దుబాయ్ లోనే ఉన్నా రాలేదట. దీంతో పీసీబీ తీరుపై మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ విమర్శలు గుప్పించాడు.
పాకిస్థాన్ ఆతిథ్య దేశమే అయినా చాంపియన్స్ ట్రోఫీలో భారత్ తో మ్యాచ్ కోసం దుబాయ్ వచ్చింది. గ్రూప్ దశలో వరుసగా రెండు మ్యాచ్ లు ఓడి అందరికంటే ముందే టోర్నీ నుంచి ఔట్ అయింది. దీంతోనే పాక్ లో చాలామంది అభిమానులకు ఆనందం ఆవిరైంది. దీనికితోడు భారత జట్టు అజేయంగా కప్ కొట్టింది.
వాస్తవానికి టీమ్ ఇండియా సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడితే ఫైనల్ లాహోర్ లో జరిగేది. కానీ, మన జట్టు ఫైనల్ చేరడంతో ఫైనల్ కూడా దుబాయ్ లోనే నిర్వహించారు. దీంతో పాక్ కు ఫైనల్ నిర్వహణ ఆశ కూడా లేకపోయింది. ఆపై టీమ్ ఇండియా విజేతగా నిలవడంతో మన జట్టుకు కప్పు అందించడం ఇష్టం లేక పాక్ బోర్డు నుంచి ఒక్కరూ ఆ వేడుకలో పాల్గొనలేదనే అభిప్రాయం వినిపిస్తోంది.
కప్ ప్రదానంలో పోడియం మీదకు వవరిని ఆహ్వానించాలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్ణయిస్తుంది. పీసీబీ సీవోవో సమైర్ దుబాయ్ లోనే ఉన్నప్పటికీ ఆయనకు ఆహ్వానం దక్కలేదని సమాచారం. ఐసీసీకి, సమైర్ కు సరైన సమాచారం లేదని, అందుకే ఇలా జరిగిందనే కథనాలు వస్తున్నాయి. ప్రజంటేషన్ లో ఐసీసీ చైర్మన్ జై షా, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి దేవజిత్ సైకియా, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ రోజర్ ట్వోజ్ పాల్గొన్నారు. జై షా చేతుల మీదుగానే రోహిత్ శర్మ కప్ అందుకున్నాడు.