పాదయాత్ర ఓల్డ్ అయింది కేటీఆర్ !

ఒక్కో ఎన్నికకూ ఒక్కో విధానం అనుసరించాలి. ఎందుకంటే అయిదేళ్ళ కాలం అంటే సుదీర్ఘమైనది.

Update: 2024-11-02 03:32 GMT

ఒక్కో ఎన్నికకూ ఒక్కో విధానం అనుసరించాలి. ఎందుకంటే అయిదేళ్ళ కాలం అంటే సుదీర్ఘమైనది. పైగా నిన్నా నేడూ రేపూలో జనరేషన్ లో ఎన్నో డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి. వారి అభిరుచులూ రుచులూ మారిపోతున్న నేపథ్యం ఉంది.

ఈ పరిస్థితులలో తెలంగాణాలోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్ర చేస్తామని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది మరో విధంగా సంచలనం అయింది. పాదయాత్ర ఇపుడు చేయడమేంటి అని కూడా ఒక చర్చ మొదలైంది.

పాదయాత్రకు పాతికేళ్ళు ఉమ్మడి ఏపీలో నిండాయి. తెలుగు నాట పాదయాత్రను 2003లో ఆనాటి కాంగ్రెస్ నాయకుడు వైఎస్సార్ చేశారు అని గుర్తు చేస్తున్నారు. ఆ తరువాత అందరూ చేశారు. అయితే అందులో కొందరినే విజయం వరించింది. అలా విజయం అందుకున్న వారు కూడా కేవలం పాదయాత్ర వల్లనే గెలిచారు అంటే కూడా తప్పే అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగా వీచిన చోటను మాత్రమే పాదయాత్ర పండింది అని గుర్తు చేస్తున్నారు

పాదయాత్ర విశేషాలు వింతలూ ఈ విధంగా ఉంటే మళ్లీ ఆ ఓల్డ్ ట్రిక్ నే బయటకు తీస్తాను అంటున్నారు కేటీఆర్. దానికి ఆయన కార్యకర్తల అభీష్టం అని అంటున్నారు. క్యాడర్ కోరినా లేక కేటీఆర్ కి ఈ ఆలోచన వచ్చినా అది చాలా పాతబడిపోయిన రాజకీయ ప్రయోగం అని విశ్లేషకులు అంటున్నారు.

కాంగ్రెస్ ఏడాది పాలనలోనే తెలంగాణా అస్తవ్యస్తం అయింది అని కేటీఆర్ అంటున్నారు. ప్రజల తరఫున తాము పోరాటాలు చేస్తామని చెప్పారు. అందులో భాగంగా పాదయాత్ర అంటున్నారు. అంటే తెలంగాణ వ్యాప్తంగా కాలికి బలపం కట్టుకుని తిరిగితే అధికారం వరించి ఒడిలో పడుతుందని బీఆర్ఎస్ నేతలు ఆలోచిస్తున్నారా అన్న చర్చ సాగుతోంది.

పాదయాత్రలకు ఓట్లు రాలే కాలం కాదు ఇది అని కూడా అంటున్నారు. మంత్రాలకు చింతకాయలు ఎలా రాలవో పాదయాత్రకు అధికారం కూడా అంతేనని అంటున్న వారూ ఉన్నారు. అయితే పాదయాత్ర వల్ల గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ తెలుస్తాయి. పార్టీ గురించి ఒక అవగాహన వస్తుంది. దాని వరకు చక్కదిద్దుకోవచ్చు అని అంటున్నారు.

అంతే తప్ప కాళ్ళు అరిగేలా తిరిగినంత మాత్రాన జనాలు అయ్యో అని అధికారం అప్పగించరు అని అంటున్నారు. పాదయాత్ర దేనికోసమో మొదట్లో జనాలకు తెలిసేది కాదని ఇపుడు దాని లక్ష్యం అధికారం అయినపుడు ప్రజలకు కూడా ఆసక్తి తగ్గిపోతుందని అంటున్నారు.

గతంలో రాజకీయ నేతలు పాదయాత్రలు చేయడం అన్నది సమస్యలు తెలుసుకోవడానికే పరిమితం అయ్యేదని కానీ రాను రానూ అది కాస్తా అధికారాన్ని అందుకునే బ్రహాస్త్రం గా మారుతోంది. అందుకే ఎవరు పాదయాత్ర అన్నా అది భూమి బద్దలు అయ్యే సెన్సేషన్ క్రియేట్ చేయడం లేదు. అవునా అని విని ఊరుకుంటున్నారు.

ఇక గతంలో అంటే టీవీ ఇతర ప్రసార మాధ్యమాలు పెద్దగా లేని రోజులలో నాయకులను చూసేందుకు జనాలు ఎగబడి వచ్చేవారు. ఇపుడు ఏ నాయకుడు ఎలా ఉంటారో తెలుసు. వారి మాట తీరు మనిషి తీరు తెలుసు. దాంతో ఆ రకమైన ఆకర్షణ అన్నది పోయింది అంటున్నారు.

దాంతో పాదయాత్ర పేరు చెప్పి జనాలను పోగు చేసుకుని ఊళ్ళకు ఊళ్ళూ చుట్టబెడుతూ ఒక భారీ బడ్జెట్ సినిమా మాదిరిగా ఈ రాజకీయ జాతర సాగుతోంది అన్నది జనాలకు ఎరుక అయింది అంటున్నారు. మొత్తానికి చూస్తే తెలంగాణాలో కాంగ్రెస్ ని గద్దె దించేందుకు తాము అధికారంలోకి వచ్చేందుకు బీఆర్ఎస్ అమ్ముల పొదిలో ఉన్న అస్త్రం పాదయాత్ర అయితే అది పాతబడి తుత్తునియలు అయిన పురాతన ఆయుధమని సెటైర్లు అయితే మహా గట్టిగానే పడుతున్నాయి.

Tags:    

Similar News