కేటీఆర్ ట్వీట్స్ పార్టీకి నష్టం చేస్తున్నాయా ?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి అయిన కేటీఆర్ ప్రతీ విషయం మీద ట్వీట్లు పెడుతూంటారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి అయిన కేటీఆర్ ప్రతీ విషయం మీద ట్వీట్లు పెడుతూంటారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ విధంగా ఎండగడుతూంటారు. ఎక్కడ ఏ సంఘటన జరిగినా ప్రభుత్వానికి సంబంధం చూపుతూ ఆయన ట్వీట్లు వేస్తారు. దీని వల్ల జనంలో చర్చ సాగాలని సర్కార్ బదనాం కావాలన్న ఎత్తుగడలతోనే ఇదంతా చేస్తున్నారు.
రాజకీయాల్లో ఇది ఒక విధానంగా ఉన్నా కేటీఆర్ ఉన్న పార్టీ బీఆర్ఎస్ పదేళ్ళ పాటు తెలంగాణాను ఏలిన పార్టీ. కేటీఆర్ కూడా మంత్రిగా పదేళ్ళ పాటు పనిచేశారు. మరి సమస్యలు ఎపుడూ ఉంటూనే ఉంటాయి. ఒక సమస్యను విపక్షంగా వీరు చెబితే మీ హయాంలో పది సమస్యలు చెప్పమంటారా అని అధికార కాంగ్రెస్ నేతలు రివర్స్ లో ఎటాక్ చేస్తూంటారు. అది వారి రాజకీయ వ్యూహం.
దీంతో ఒక ఇష్యూతో కాంగ్రెస్ ని కార్నర్ చేయబోయి మరిన్ని ఇష్యూస్ తో కేటీఆర్ చిక్కుకుంటున్నారా అన్న చర్చ అయితే వస్తోంది. ఇవే కాదు రాజకీయంగా కూడా కేటీఅర్ వేసే ట్వీట్లు కూడా ఎదురు తంతున్నాయని బీఆర్ఎస్ ని బూమరాంగ్ చేస్తున్నాయని అంటున్నారు. ఉదాహరణకు చూస్తే కనుక ఢిల్లీలో కాంగ్రెస్ ఓటమి పాలు అయింది. రాహుల్ గాంధీ మీద కేటీఆర్ ఈ సందర్భంగా పెట్టిన ట్వీట్ అయితే అభాసుపాలు అయింది అని అంటున్నారు.
కాంగ్రెస్ బీజేపీని గెలిపించింది అన్నట్లుగా ట్వీట్ పెట్టి కంగ్రాట్స్ అంటూ రాహుల్ కి చెప్పడం మీద బీఆర్ఎస్ నే అంతా టార్గెట్ చేశారు. నిజానికి కాంగ్రెస్ బీజేపీల మధ్య జాతీయ స్థాయిలో ఎంతటి రాజకీయ వైరం ఉంటుందో అందరికీ తెలుసు. అలాంటిది ఈ ట్వీట్ల ద్వారా కేటీఆర్ కాంగ్రెస్ బీజేపీ ఒక్కటి అని చెప్పాలనుకోవడం రాజకీయ అతిగానే అంతా చూశారు. అందుకే అభాసు అయింది అని అంటున్నారు. దాంతో కేటీఆర్ ఈ రోజు మరో ట్వీట్ పెట్టి మరీ డిలిట్ చేశారు అని గుర్తు చేస్తున్నారు.
ఇక చూస్తే కనుక తెలంగాణాలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని అంతా డిసైడ్ అయ్యారని అంటున్నారు. దానికి ఎన్నో నిదర్శనాలు ఉదంతాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పటిదాకా కేటీఆర్ కానీ బీఆర్ఎస్ నేతలు కానీ బీజేపీ మీద ఒక్క ట్వీట్ కూడా వేయలేదని గుర్తు చేస్తున్నారు.
బడ్జెట్ సహా అనేక అంశాలలో తెలంగాణాను కేంద్ర ప్రభుత్వం బీజేపీ అన్యాయం చేసినా వాటి మీద ఒక్క ట్వీట్ కూడా ఎందుకు ఉండదని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం లో చీమ చిటుక్కుమన్నా కూడా కేటీఆర్ ట్విట్టర్ హ్యాండిల్ బిగ్ సౌండ్ చేస్తుందని అంటున్నారు.
ఈ విధంగా గులాబీ పార్టీ కమలం పార్టీల మధ్య తెర వెనక తెలియని బంధం ఉందా అన్న చర్చ కూడా సాగుతోంది. వాటి విషయం పక్కన పెడితే బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ పెట్టే ట్వీట్ల వల్ల పార్టీకి వచ్చే పొలిటికల్ మైలేజ్ ఏదీ లేకపోగా మొత్తం బూమరాంగ్ అవుతోంది అని అంటున్నారు. ఒక వేలితో కాంగ్రెస్ ని నిలదీస్తే నాలుగు వేళ్ళు తిరిగి బీఆర్ఎస్ నే గుచ్చుతున్నాయని అంటున్నారు.
ట్వీట్లతో వార్ చేయాలనుకుంటే దానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక జనాలు కూడా ఏమీ అమాయకులు కారని అంటున్నారు. వారు ఎవరి హయాంలో ఏమి జరిగింది అన్నది పూర్తిగా తెలుసుకునే ఉన్నారు.
దాంతో కేటీఆర్ కానీ మరొకరు కానీ ముందు తమ పార్టీని ఉద్ధరించుకోవడం గ్రౌండ్ లెవెల్ లో బలోపేతం చేసుకోవడం బెటర్ కానీ తీరి కూర్చుని అధికార పార్టీపైన రాజకీయ విమర్శలు చేయాలనుకుంటే మాత్రం తాము ఉన్న కొమ్మను తెగ్గొట్టుకున్నట్లే అవుతుంది అని అంటున్నారు. మరి కేటీఆర్ ట్వీట్ల జోరు నెమ్మదిస్తున్నా లేక కంటిన్యూ అవుతుందా అన్నది చూడాల్సి ఉంది.