తల్లికి వందనం...లోకేష్ కుండబద్ధలు కొట్టేశారా ?

దీని మీద విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ శాసనమండలిలో పూర్తి వివరణ ఇచ్చారు. తల్లికి వందనం పధకం కచ్చితంగా అమలు చేస్తామని ఆయన చెప్పారు.

Update: 2024-07-25 03:37 GMT

తల్లికి వందనం కింద విద్యార్థులకు నగదు సాయం అందించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. విద్యా సంవత్సరం కూడా ప్రారంభం అయింది. దాంతో ఇపుడు ఇస్తేనే ఉపయుక్తంగా ఉంటుందని కూడా అంతా ఎదురు చూస్తున్నారు. మరో వైపు ప్రతీ కుటుంబంలోనూ ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఈ పధకం వర్తింప చేస్తామని ఎన్నికల వేళ కూటమి పార్టీలు చెప్పాయి.

ఆ తరువాత దీని మీద ఒక జీవో వచ్చిందని ప్రచారం సాగింది. అందులో చూస్తే కుటుంబంలో ఒకరికే ఈ పధకం వర్తింప చేస్తారు అని ఉంది. అయితే అది కాదు జీవో అసలు ఇవ్వలేదు అని కూటమి ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఇదిలా ఉంటే ఈ పధకం అమలు చేస్తారా ఎపుడు చేస్తారు, ఎంత మంది పిల్లలకు ఇస్తారు ఇవన్నీ సందేహాలుగా ఉన్నాయి.

దీని మీద విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ శాసనమండలిలో పూర్తి వివరణ ఇచ్చారు. తల్లికి వందనం పధకం కచ్చితంగా అమలు చేస్తామని ఆయన చెప్పారు. అంతే కాదు ప్రతీ కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే వారందరికీ పదిహేను వేల రూపాయలు వంతున ఇస్తామని కూడా తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలలోనే కాదు ప్రైవేట్ పాఠశాలల్లో కూడా విద్యార్ధులకు ఈ పధకం వర్తింప చేస్తామన్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన విధి విధానాలను రూపొందిస్తున్నట్లుగా చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ పధకం విషయంలో తప్పులు జరిగాయని అన్నారు. మొదట పదిహేను వేలు అని చెప్పి పదమూడు వేలే ఇచ్చారని విమర్శించారు.

తాము మాత్రం అందరికీ ఇస్తామని పదిహేను వేల రూపాయలు పూర్తిగా ఇస్తామని ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలోనే చెప్పామని, ఆ మాటకు కూడా కట్టుబడి ఉన్నామన్నామని లోకేష్ చెప్పారు. అయితే ఈ పధకం విషయంలో సరైన సమగ్రమైన నిబంధనలు రూపొందించడానికి కాస్త సమయం కావాలని ఆయన కోరారు.

తాను కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నాను అని చెప్పారు. ఈ పధకాన్ని ఒక్కసారి అమలు చేస్తే ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మొత్తం మీద చూస్తే ఈ పధకం అమలు చేస్తామని మంత్రి లోకేష్ చెప్పిన ఎపుడు అన్నది అయితే చెప్పలేదు.

అధ్యయనం అంటున్నారు.సమయం కావాలని అంటున్నారు. దాంతో ఈ ఏడాదికి తల్లికి వందనం పధకం ఉండకపోవచ్చు అని ప్రచారం సాగుతోంది. అయితే అందరికీ ఈ పధకం వర్తింపచేస్తామని ప్రైవేట్ పాఠశాలల విద్యార్ధులకు కూడా ఇస్తామని మంత్రి ప్రకటించడం విశేషం. మొత్తానికి ఈ పధకం అమలు చేయాలీ అంటే ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నాయని అంటున్నారు. దాంతో అధ్యయనం సమయం అంటూ లోకేష్ కుండబద్ధలు కొట్టేశారా అన్న చర్చ సాగుతోంది.

Tags:    

Similar News