చైనా, పాక్ లకు ఉమ్మడి స్ట్రోక్... 'మాజిద్ బ్రిగేడ్' చరిత్ర తెలుసా?
వాస్తవానికి 1974 ఆగస్టు 2న మాజిద్ లాంగోవ్ సీనియర్ అలియాస్ అబ్దుల్ మాజీద్ బలోచ్ అనే మిలిటెంట్.. పాకిస్థాన్ మాజీ ప్రధాని జుల్ఫీకర్ అలీ భుట్టోపై హత్యాయత్నం చేశాడు.;
భారతదేశంతో సరిహద్దును పంచుకుంటూ పక్కలో బల్లేలులా ఉన్న దేశాల జాబితాలో పాక్, చైనా కీలకమనే సంగతి తెలిసిందే! ఈ క్రమంలో ఒక దేశం భారత్ పై ఆర్థికంగా ప్రభావం చూపిస్తుంటే.. మరోదేశం ఉగ్రవాదులతో ప్రభావం చూపించే ప్రయత్నాలు చేస్తుంటుంది. ఈ సమయంలో తాజాగా ఈ రెండు దేశాలకూ షాకిస్తూ మాజిద్ బ్రిగేడ్ షాకింగ్ పెర్ఫార్మెన్స్ చేస్తుందనే చర్చ తెరపైకి వచ్చింది.
అవును... ఉగ్రవాదులను పెంచి పోషించడం తమ కర్తవ్యంగా భావిస్తున్నట్లుగా ప్రవర్తించి, నిత్యం భారత్ పై కవ్వింపు చర్యలకు పాల్పడే పాకిస్థాన్ కు తాజాగా మాజిద్ బ్రిగేడ్ షాకిచ్చింది. ఇందులో భాగంగా... పాకిస్థాన్ లోని బలోచిస్థాన్ లో ఏకంగా రైలునే హైజాక్ చేసి వార్తల్లో నిలిచింది. పాక్ సైన్యమే లక్ష్యంగా పలు ఆత్మాహుతి దాడులు చేసింది. పాక్-చైనా ఎకనామిక్ కారిడార్ ను వ్యతిరేకిస్తూ భారీ దాడులు నిర్వహిస్తోంది.
వాస్తవానికి 1974 ఆగస్టు 2న మాజిద్ లాంగోవ్ సీనియర్ అలియాస్ అబ్దుల్ మాజీద్ బలోచ్ అనే మిలిటెంట్.. పాకిస్థాన్ మాజీ ప్రధాని జుల్ఫీకర్ అలీ భుట్టోపై హత్యాయత్నం చేశాడు. దానికి కారణం.. బలోచ్ ఉద్యమాన్ని అణిచివేసేందుకు అలీ భూట్టో భారీ ఆపరేషన్లు నిర్వహించడమే. అయితే ఈ ప్రయత్నంలో మాజిద్ లాంగోవ్ సీనియర్ అలియాస్ అబ్దుల్ మాజీద్ బలోచ్ పొరపాటున ప్రాణాలు కోల్పోయాడు!
అనంతరం.. అతడి తమ్ముడు జూనియర్ మాజిద్ ఈ పోరాటం బాధ్యతలు తీసుకొన్నాడు. ఈ క్రమంలో 2010లో క్వెట్టాలో జూనియర్ మాజిద్ తో పాటు పలువురు బలోచ్ మిలిటెంట్లు ఉన్న ఓ ఇంటీపై పాక్ సైన్యం దాడి చేసింది. ఈ సమయంలో అతడి మిత్రులు తప్పించుకున్నప్పటికీ.. ఓ గంట సేపు పాక్ సైన్యంతో పోరాడిన జూనియర్ మరణించాడు. దీంతో.. బలోచ్ ఉద్యమంలో మాజిద్ సోదరులు బాగా పాపులర్ అయ్యారు.
అనంతరం వీరిద్దరి స్ఫూర్తితో 2011లో అస్లాం ఆచు అనే మిలిటెంట్ "బలోచ్ లిబరేషన్ ఆర్మీ" కోసం ఆత్మాహుతి దళాన్ని ఏర్పాటు చేశాడు. దానికి మాజిద్ బ్రిగేడ్ అని పేరుపెట్టాడు. ఈ క్రమంలో... ఈ బలోచ్ లిబరేషన్ ఆర్మీ కోసం మాజిద్ బ్రిగేడ్ ఇప్పటివరకూ సుమారు 12 భారీ ఆత్మహుతి దాడులు చేసింది. ఈ దాడుల్లో కరాచీ దద్దరిల్లిపోయింది. మరో దాడిలో చైనా ఇన్వెస్టర్స్ లో భయం రేకెత్తించింది.
ఈ క్రమంలోనే 2020 జూన్ లో కరాచీ స్టాక్ ఎక్స్ ఛేంజిని లక్ష్యంగా చేసుకుని మాజిద్ బ్రిగేడ్ విరుచుకుపడింది. చైనాకు చెందిన ఓ కన్సార్టియం నిర్వహించడమే ఈ దాడికి కారణంగా చెబుతారు. ఇక గత ఏడాది అక్టోబర్ లో కరాచీ ఎయిర్ పోర్టు వద్ద ఆత్మాహుతి దాడి చేయగా.. ఆ దాడిలో ఇద్దరు చైనా ఇంజినీర్లు ప్రాణాలు కోల్పోయారు.
కాగా... ఇటీవల పాకిస్థాన్ లో 500 మంది ప్రయాణికులతో వెళుతున్న రైలు హైజాక్ కు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఈ సమయంలో బలోచ్ లిబరేషన్ ఆర్మీ అదుపులో ఉన్న బందీల్లో 80 మందిని సైనిక బలగాలు విడిపించాయని చెబుతున్నారు. మిలిటెంట్ల అదుపులో ఇంకా 100 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది.