ఉమ్మడి ‘తూర్పు’ ఫలితాన్ని శాసించనున్న కట్టప్పలు
దీనికి కారణం మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 21 స్థానాలు ఉమ్మడి జిల్లాలోనివే.
ఎన్నికలంటేనే అలకలు.. ఆందోళనలు. ఉండే టికెట్ ఒక్కటైతే.. దాన్ని ఆశించే అశావాహులు బోలెడంత మంది ఉంటారు. అందరిని బుజ్జగించి అందరికి ఆమోదయోగ్యమైన అభ్యర్థిని బరిలో నిలపాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల మీద ఉంటుంది. మిగిలిన పార్టీల సంగతి ఎలా ఉన్నా.. అధికార.. విపక్షాలకు మాత్రం ఈ ప్రక్రియ కత్తి మీద సామే. ఏ చిన్న పొరపాటు జరిగినా.. తప్పు దొర్లినా అందుకు చెల్లించాల్సిన మూల్యం భారీగా ఉంటుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కీలకంగా మారనుంది. దీనికి కారణం మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 21 స్థానాలు ఉమ్మడి జిల్లాలోనివే. అంటే.. 12 శాతానికి మించిన సీట్లు ఈ జిల్లా పరిధిలోనే ఉంటాయి మరి.
ఇలాంటి వేళ.. ఉమ్మడి తూర్పు పరిధిలోని అత్యధిక స్థానాల్ని సొంతం చేసుకోవటానికి ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహ రచనలు చేస్తున్నాయి. అయినప్పటికీ టికెట్ రాక తీవ్రమైన నిరాశతో ఉన్న వారు.. తమకు దక్కనిది ఇంకెవరికి దక్కకూడదన్న లక్ష్యంతో పావులు కదుపుతుంటారు. ఇలాంటి వారితో జరిగే నష్టం తీవ్రంగా ఉంటుంది. నమ్మకంగా ఉంటూ అసంతృప్తికి బానిసలుగా ఉండే కట్టప్పలతో పెను ప్రమాదం పొంచి ఉంటుంది. అలాంటి నియోజకవర్గాల్ని చూస్తే.. మొదట పిఠాపురం సీటు గురించి మాట్లాడుకోవాలి.
ఒక్క ఏపీలోనే కాదు తెలంగాణతో పాటు తెలుగు వారంతా ఆసక్తిగా గమనిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గంగా పిఠాపురం నిలిచింది. దీనికి కారణం జనసేన అధినేత పవన్ కల్యాణ్ బరిలోకి దిగటమే. ఆయన ప్రత్యర్థిగా ఒకప్పుడు తన అన్న ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన వంగా గీత అధికార పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. పవన్ కల్యాణ్ గెలుపులో కీలకభూమిక పోషించాల్సింది టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మనే. నియోజకవర్గం మీద మాంచి పట్టున్న వర్మ ఈ స్థానంలో తనకుటికెట్ వస్తుందని ఆశించారు.
పొత్తులో భాగంగా పవన్ కల్యాణ్ కు టికెట్ కేటాయిస్తే తాను శ్రమించి గెలుపును పవన్ కు గిఫ్టుగా ఇస్తానని కోతలు కోశారు. అయితే.. అదంతా టికెట్ ను ప్రకటించక ముందు.ఎప్పుడైతే పిఠాపురం నుంచి పవన్ బరిలోకి దిగుతారన్న అధికారిక ప్రకటన వెలువడినంతనే తెలుగు తమ్ముళ్లు.. వర్మ విధేయులు ఎంతలా తెగబడ్డారో.. పవన్ ను ఉద్దేశించి ఎన్నెన్ని మాటలు అన్నారో తెలియంది కాదు. దీంతో.. రోజు వ్యవధిలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి కబురు రావటం.. ఆయనతో భేటీ కావటం తెలిసిందే.
పవన్ ను గెలిపిస్తామని వర్మ మాటిచ్చినప్పటికీ.. ఆయన మాటను బొత్తిగా నమ్మాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితి ఒక్క పవన్ కు మాత్రమే కాదు.. అధికార వైసీపికి అభ్యర్థి వంగా గీతకు ఇలాంటి పరిస్థితే ఉంది. ఎందుకంటే ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబును కాదని కాకినాడ ఎంపీ వంగా గీతను వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు. అప్పటి నుంచి దొరబాబు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయనకు వైసీపీ అధినేత జగన్ నుంచి కబురు రావటం.. ఆయన భవిష్యత్తుకు సీఎం భరోసా ఇవ్వటం తెలిసిందే. అయినప్పటికీ ఆయన ఎంత కమిట్ మెంట్ తో వ్యవహరిస్తారన్నది ప్రశ్నగా మారింది.
దీంతో అధికార.. విపక్ష అభ్యర్థులు ఇద్దరు ఒకేలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దీంతో.. ఇక్కడి ఫలితం ఏ రీతిలో ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. కాకినాడ గ్రామీణ వైసీపీ టికెట్ ను పితాని అన్నవరం ఆశించారు. ఒకవేళ టికెట్ రాకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయనపై బహిష్కరణ వేటు పడింది. దీంతో ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేను ఓడించటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. దీంతో కన్నబాబు పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.
ఇదే స్థానంలో టీడీపీ నుంచి టికెట్ ఆశించారు మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి. అయితే ఆమె భర్తకు నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతను అప్పగించారు. ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. ఆ పార్టీ అభ్యర్థిగా పంతం నానాజీ బరిలో ఉన్నారు. అయితే.. మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి కుటుంబం కమిట్ మెంట్ మీదనే జనసేన అభ్యర్థి గెలుపు ఆధారపడి ఉంటుందని చెప్పక తప్పదు.
రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఎమ్మెల్యే రాపాక (తొలుత జనసేన మీద గెలిచి తర్వాత అధికార పార్టీ తీర్థం పుచ్చుకోవటం తెలిసిందే) వర్గం టికెట్ ఆశించింది. కానీ.. గొల్లపల్లి సూర్యారావును అభ్యర్థిగా వైసీపీ ప్రకటించింది. అదే సమయంలో రాపాకను అమలాపురం ఎంపీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా పంపారు. దీంతో జనసైనికులు రాపాకకు అమలాపురం ఎంపీ స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోనూ రాపాక మీద బదులు తీర్చుకోవాలని పని చేస్తున్నారు. గత ఎన్నికల్లో తనను గెలిపించిన జనసైనికులు ఇప్పుడు వ్యతిరేకంగా పని చేస్తుండటంతో ఫలితం ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు టికెట్ ఇవ్వకుండా మాజీ ఎంపీ తోట నరసింహంను అభ్యర్థిగా ఎంపిక చేయటం తెలిసిందే. సమన్వయకర్తగా నియమించిన అనంతరం తోటపై ఓపెన్ గానే చంటిబాబు విమర్శించారు. చంటిబాబు వ్యతిరేకంగా పని చేస్తే తోటకు ఇబ్బందికర పరిస్థితి తప్పదంటున్నారు. మరి.. తుది ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.