ఇండియా వర్సెస్ ఎన్డీయే.. మీడియాకు మేలు చేస్తుందా?
రాజకీయ నేతల మధ్య అయినా.. పార్టీల మధ్య అయినా.. పోటీ తీవ్రంగా ఉన్నప్పుడు సహజంగానే మీడియాకు ప్రాధాన్యం పెరుగుతుంది.
రాజకీయ నేతల మధ్య అయినా.. పార్టీల మధ్య అయినా.. పోటీ తీవ్రంగా ఉన్నప్పుడు సహజంగానే మీడియాకు ప్రాధాన్యం పెరుగుతుంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలోనూ ఇదే తరహా వాతావరణం కనిపించింది. అధికారం నిలబెట్టుకునేందుకువైసీపీ, అధికారంలోకి వచ్చేందుకు టీడీపీలు పెద్ద ఎత్తున మీడియాను వినియోగించుకున్నాయి. దీంతో ఆయా మీడియా సంస్థలకు కనక వర్షం కురిసిందనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక, ఇప్పుడు జాతీయస్థాయిలోనూ ఇలాంటి చర్చే జరుగుతోంది.
జాతీయస్థాయి రాజకీయాల విషయానికి వస్తే.. దేశవ్యాప్తంగా జాతీయ పార్టీలు ప్రభావం చూపిస్తాయి.ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది. కానీ, బీజేపీ ఒంటరిగా విజయం దక్కించుకోలేక పోయింది. ఇతర పార్టీలపై ఆధార పడాల్సిన పరిస్థితిని ఎదుర్కొంది. ఇక, ఇదేసమయంలో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు సాధించి.. తన అస్థిత్వాన్ని నిలబెట్టుకుంది. అయితే.. కేంద్రంలో ఇరు పక్షాలకు కూడా.. భారీ మెజారిటీ అయితే దక్కలేదు. ఇది అంతిమంగా వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ యుద్ధాన్ని మరింత పెంచుతుంది. ఫలితంగా.. మీడియా ఇరు పార్టీలకూ అత్యంత కీలకరోల్ పోషించనుంది.
దీంతో సహజంగా మీడియా సంస్థల ఆదాయం రెట్టింపు అయినా ఆశ్చర్యం ఉండదనే విశ్లేషణలు వస్తున్నాయి. మరో వైపు వచ్చే ఏడాది, ఏడాదిన్నరలో కీలక రాష్ట్రాలైన మహారాష్ట్ర, యూపీ, ఢిల్లీ, ఛండీగఢ్, జార్ఖండ్, హరియాణ లాంటి చోట్ల ఎన్నికలు వున్నారు. దీంతో కాంగ్రెస్, బీజేపీలు మరింతగా పోరు సాగించనున్నాయి. ఇది కూడా మీడియాకు వరంగా మారనుంది. ఇక, తదుపరి సార్వత్రిక ఎన్నికలకు దారితీసే ఎన్డీయే, ఇండియా కూటముల మధ్య నెలకొనే భారీ పోటీ మీడియా సంస్థలకు గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు.
మరోవైపు రాజ్యసభలోనూ వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నాయి. ఇకన స్థానిక సంస్థల ఎన్నికలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో జరగనున్నాయి. ఈ పరిణామాలను గమనిస్తే.. ఎన్డీయే, ఇండియా కూటముల మధ్య జరుగుతున్న పోరు.. మీడియాకు మెరుగైన ప్రయోజనం అందించడం ఖాయంగానే కనిపిస్తోంది. ముఖ్యంగా టీవీ, ప్రింట్, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రకటనలు పెరగడంతోపాటు వార్తల కంటెంట్‌కు కూడా ప్రాధాన్యం పెరగనుంది. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల సమయంలో Google వంటి ప్లాట్‌ఫారమ్‌లపై బీజేపీ, కాంగ్రెస్‌లు భారీగానే ఖర్చు చేశాయి. ఇటీవల వెల్లడించిన లెక్కల ప్రకారం.. బీజేపీ ఒక్క గూగుల్‌కే 900 కోట్ల రూపాయల మేరకు ప్రకటన ఖర్చు ఇచ్చింది.
మరోవైపు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు వేగంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో కొన్నాళ్లుగా అవి సవాళ్లను ఎదుర్కొన్నాయి. ఇప్పుడు రాజకీయంగా జాతీయ, ప్రాంతాల స్థాయిలో పార్టీల మధ్య పోటీ పెరిగిన దరిమిలా.. వాటికి కూడా ఆదాయం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. 2024లో భారతదేశ ప్రకటనల ఆదాయం రూ. 1.55 లక్షల కోట్లను అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.